More

    షియా ముస్లింలే టార్గెట్.. శుక్రవారం నమాజ్ సమయంలో మసీదులో బాంబు బ్లాస్ట్

    తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో శుక్రవారం నమాజ్ చేస్తున్న సమయంలో మసీదులో బాంబు బ్లాస్ట్ జరిగింది. ఈ ఘటనలో పదుల సంఖ్యలో గాయపడినట్లు తెలుస్తోంది. నంగర్‌హర్ ప్రావిన్స్‌ ట్రైలీ పట్టణంలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సందర్భంగా ఈ పేలుడు జరిగింది. ఘటనలో కొందరు గాయపడగా మరి కొందరు మరణించి ఉంటారని తాలిబన్‌ అధికారి తెలిపారు. స్థానిక ఆసుపత్రిలో ముగ్గురు చనిపోయినట్లుగా డాక్టర్‌ చెప్పినట్లు కొన్ని మీడియా సంస్థలు తెలిపాయి. ఆగస్టులో తాలిబన్లు దేశంలో అధికారాన్ని చేజిక్కించుకున్నప్పటి నుంచి ఆఫ్ఘనిస్థాన్ తూర్పు ప్రావిన్స్‌లోని స్పిన్ ఘర్ జిల్లా ఐసిస్ కార్యకలాపాలకు కేంద్రంగా ఉంది.

    మసీదు లోపల ఉంచిన బాంబులను పేల్చివేయడంతో ఇమామ్ కూడా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం హై-ఇంటెన్సిటీ బాంబు పేలుడు సంభవించింది. శుక్రవారం నమాజ్ సందర్భంగా మధ్యాహ్నం 1.30 గంటల ప్రాంతంలో స్పిన్ ఘర్ జిల్లాలోని మసీదు ముందు పేలుడు సంభవించింది. మసీదు ఇమామ్‌తో సహా 35 మందికి పైగా గాయపడినట్లు అంచనా వేస్తున్నారు. ఐఎస్‌ఐఎల్‌ (ఐఎస్‌ఐఎస్‌) మిలిటెంట్ గ్రూప్‌కు అనుబంధంగా ఉన్న ఖొరాసన్ ప్రావిన్స్‌లోని ఇస్లామిక్ స్టేట్ ఇటీవలి కాలంలో ఆఫ్ఘనిస్థాన్‌లో అనేక ఉగ్రదాడులకు పాల్పడుతోంది. షియా ముస్లింలు పెద్ద సంఖ్యలో హాజరయ్యే మసీదులను లక్ష్యంగా చేసుకుని పేలుళ్లు జరుపుతోంది. అయితే తాజా పేలుడుకు ఇప్పటి వరకు ఏ గ్రూపు బాధ్యత వహించలేదు.

    తాలిబాన్ అధికారి మాట్లాడుతూ “స్పిన్ ఘర్ జిల్లాలోని మసీదులో శుక్రవారం ప్రార్థనల సమయంలో పేలుడు జరిగినట్లు ధృవీకరిస్తున్నాం. ప్రాణనష్టం చోటు చేసుకుంది” అని అన్నారు. బాంబును ఇమామ్ కు సమీపంలోని లౌడ్ స్పీకర్‌లో దాచబడిందని.. ఆజాన్‌ను వినిపించేందుకు స్పీకర్‌ను ఆన్ చేసినప్పుడు పేలుడు సంభవించినట్లు చెబుతున్నారు. అక్టోబరు 9న కుందుజ్‌లోని షియా మసీదుపై ఆత్మాహుతి దాడికి సున్నీ ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ (ISKP) బాధ్యత వహించింది.

    షియా ముస్లింలను టార్గెట్ చేసి దాడులు

    ఆఫ్ఘనిస్తాన్‌లో ఇటీవల తాలిబాన్ అధికారంలోకి రావడంతో హజారా కమ్యూనిటీ భయాన్ని పెంచింది. ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్ తీవ్రవాద సున్నీ భావజాలాన్ని అనుసరిస్తోంది. ఆగస్ట్ 26న కాబూల్ విమానాశ్రయంలో 13 మంది అమెరికా సైనికుల ప్రాణాలను బలిగొంది ఈ తీవ్రవాద సంస్థనే..! ఇంకా ఎన్నో బాంబు దాడులు, తీవ్రవాద కార్యకలాపాలలో పాల్గొంది. ఆఫ్ఘనిస్తాన్, పాకిస్థాన్ మరియు భారతదేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఇస్లామిక్ స్టేట్ టెర్రర్ గ్రూప్ (ISIS) యొక్క శాఖ ఇది.

    Trending Stories

    Related Stories