భారత భద్రతా బలగాలు మరో మోస్ట్ వాంటెడ్ తీవ్రవాదిని హతం చేశాయి. అతి కిరాతకుడు, భారత్ లో ఎన్నో ఉగ్రదాడులకు రూప కర్త అయిన మసూద్ అజర్ బంధువు అబూ సైఫుల్లా అలియాస్ లంబూను భారత సైన్యం మట్టుబెట్టింది. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఉగ్రవాది అబూ సైఫుల్లా ఇవాళ జమ్మూకశ్మీర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు. పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన లంబూ 2019లో జరిగిన పుల్వామా దాడిలో ప్రధాన నిందితుడు. ఎన్‌క్రిప్ట్ మెసేజింగ్ అప్లికేషన్స్‌లో సైఫుల్లా నిపుణుడు. ఐఈడీ తయారీలోనూ నిష్ణాతుడు. అవంతిపురా నుంచి అతను తన ఆపరేషన్స్ హ్యాండిల్ చేసేవాడు. పుల్వామా దాడిలో వాడిన ఐఈడీ పేలుడు పదార్ధాన్ని ఇతనే తయారు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. దక్షిణ కశ్మీర్‌లో జైషే సంస్థ ఆపరేషనల్ కమాండర్‌గా ఉన్నాడు.

సైఫుల్లాను లంబూ అని మాత్రమే కాకుండా అద్నన్ అని కూడా పిలుస్తారని తెలుస్తోంది. జైషే ఉగ్ర సంస్థ వ్యస్థాపకుడు మౌలానా మసూద్ అజర్‌కు దగ్గరి బంధువు కూడా..! 2017లో సైఫుల్లా భారత్ లోకి అక్రమంగా ప్రవేశించాడు. అప్పటి నుంచి ఇక్కడే ఉగ్ర కార్యకలాపాలను ఆపరేట్ చేస్తున్నాడు. శ్రీనగర్ లోని అనంత్ నాగ్ జిల్లాల్లో చోటు చేసుకున్న ఎన్ కౌంటర్ లో ఇద్దరు తీవ్రవాదులు హతమయ్యారు. శ్రీనగర్‌లోని డాచిగామ్ అటవీ శ్రేణికి దగ్గరగా, నాగ్‌బెరన్ మరియు మార్సర్ జోన్‌ల మధ్య ఉన్న అటవీ శ్రేణిలో సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఉదయం ఎన్‌కౌంటర్ జరిగింది. భద్రతా దళాలపై ఉగ్రవాదులు కాల్పులు జరపడంతో సెర్చ్ ఆపరేషన్ కాస్తా ఎన్‌కౌంటర్‌గా మారిందని, ఈ రోజు జరిగిన ఎన్‌కౌంటర్‌లో నిషేధిత ఉగ్రవాద సంస్థకు చెందిన లంబూ హతమయ్యాడని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజిపి) విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. గతంలో డాచిగామ్ ప్రాంతంలో చాలా తక్కువ ఎన్‌కౌంటర్‌లు జరిగాయి. ఈ సంవత్సరం తీవ్రవాదులకు వ్యతిరేకంగా జరిపిన ఆపరేషన్లలో కశ్మీర్ లోయలో దాదాపు 85 మంది మిలిటెంట్లు హతమయ్యారు.