భారతదేశంలో కరోనా వ్యాక్సినేషన్ ఎంతో వేగంగా సాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో మినహా కరోనా కేసులు మిగిలిన ప్రాంతాల్లో బాగా తగ్గిపోయాయి. కరోనా రెండు డోసులు వేసుకున్నా మాస్కులు పెట్టుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. అయితే కొన్ని దేశాల్లో మాత్రం వ్యాక్సిన్లు వేయించుకున్న వాళ్లు.. కరోనా కేసులు తక్కువ ఉన్న ప్రాంతాల్లో మాస్కుల అవసరం లేదని చెబుతున్నారు. అయితే భారతదేశంలో మాస్కులు ఇంకా ఎన్ని రోజులు పెట్టుకోవాలో తెలియని పరిస్థితి. దీనిపై నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ స్పందించారు. 2022 వరకూ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందేనని.. దేశంలో పండుగల సీజన్ ప్రారంభం కావడంతో థర్డ్‌వేవ్ ముప్పు ముంగిట్లో ఉన్నామని ఆయన అన్నారు. వ్యాక్సిన్లు, అత్యవసర మందులు, కఠిన ఆంక్షలతోనే కొవిడ్‌కు చెక్ పెట్టగలమని అన్నారు. ఇప్పుడే ప్రజలు రిలాక్స్ కావద్దని, అది ముప్పును మరింత పెంచుతుందని హెచ్చరించారు. ఇప్పటికే పండుగల సందర్భంగా భారీగా ప్రజలు గుమిగూడకుండా చూడాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ప్రభుత్వం సూచించింది.
మరోవైపు తొలి కోవిడ్ టీకా డోసు తీసుకున్న నాలుగు నెలల తర్వాత యాంటీబాడీలు గణనీయంగా తగ్గుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. భారత్ లో నిర్వహించిన స్టడీకి సంబంధించిన డేటాను రిలీజ్ చేశారు. రెండు డోసుల టీకాలు తీసుకున్న మొత్తం 614 హెల్త్ వర్కర్లపై జరిపిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని తెలిపారు. యాంటీబాడీలు తగ్గుతున్నంత మాత్రాన సదరు వ్యక్తిలో వ్యాధి నిరోధక సామర్థ్యం నిర్వీర్యం అవుతుందని చెప్పలేమన్నారు. ఒడిశాలోని భువనేశ్వర్‌లో ఉన్న రీజినల్ మెడికల్ రీసర్చ్ సెంటర్ దీనిపై స్టడీ చేసింది. ఆరు నెలల తర్వాత మాత్రమే బూస్టర్ డోసు ఎప్పుడు అవసరం వస్తుందో చెప్పగలమని ఆర్ఎంఆర్సీ డాక్టర్ సంగమిత్ర పతి తెలిపారు. టీకాలు తీసుకున్న ఆరు నెలల్లోనే యాంటీబాడీలు క్రమంగా తగ్గుతుంటాయని ఇటీవల బ్రిటీష్ పరిశోధకులు చెప్పారు. ఫైజర్, ఆస్ట్రాజెనికా టీకాలు తీసుకున్నవారిలో ఈ మార్పు కనిపించినట్లు తెలిపారు. ఇండియన్ స్టడీకి సంబంధించిన నివేదికను రీసర్చ్ స్క్వేర్‌లో పబ్లిష్ చేశారు. కోవీషీల్డ్, కోవాగ్జిన్ తీసుకున్నవారిలో ఈ స్టడీ చేశారు.