హైదారాబాద్ లోని మారేడు పల్లి సీఐ నాగేశ్వరరావు తనపై అత్యాచారానికి పాల్పడ్డారని వివాహిత కేసు నమోదు చేసింది. దీనిపై మాజీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ స్పందించారు. మారేడుపల్లి సీఐ నాగేశ్వరరావును కఠినంగా శిక్షించాలని టీజీ వెంకటేష్ కోరారు. అతని అన్యాయాలు అన్నీ ఇన్నీ కావని.. తనను ఒక ఆస్తి కేసులో అన్యాయంగా ఇరికించాడని టీజీ వెంకటేష్ పేర్కొన్నారు. తనకు సంబంధం లేదని చెప్పినా వినలేదని, పేరు తొలగించడంలో జాప్యం చేశాడని ఆయన అన్నారు. ఉన్నతాధికారులకు కోట్ల రూపాయలు ఇచ్చి నాగేశ్వరరావు పోస్టింగ్ తెచ్చుకున్నాడని.. నాగేశ్వరరావు వల్ల పోలీసు శాఖకు చెడ్డపేరు వస్తుందని టీజీ వెంకటేష్ అన్నారు.
కిడ్నాప్, అత్యాచారం, ఆయుధాల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మారేడ్ పల్లి ఇన్ స్పెక్టర్ నాగేశ్వరరావుపై వేటు పడింది. నాగేశ్వరరావును సస్పెండ్ చేశారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. హస్తినాపురంలో నివాసముండే మహిళపై ఈ నెల 7వ తేదీన రాత్రి 12 గంటలకు సీఐ నాగేశ్వరరావు అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అడ్డొచ్చిన ఆమె భర్తను గన్ తో బెదిరించాడు. అనంతరం దంపతులను బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లాడు. ఇబ్రహీంపట్నం చెరువుకట్ట వద్ద కారుకు యాక్సిడెంట్ కావడంతో బాధితులు తప్పించుకుని వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారుకి ప్రమాదం జరగకుండా ఉంటే తమను సీఐ చంపేసి ఎక్కడో చోట పడేసేవాడని బాధితులు వాపోయారు.