కొత్త వైరస్ మార్ బర్గ్ కలకలం

0
789

కరోనా వైరస్ కారణంగా ప్రపంచం మొత్తం ఎంత ఇబ్బంది పడుతోందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మరో వైరస్ ముంచుకొచ్చే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తూ ఉన్నారు. అంతరించిపోయిందనుకున్న మార్‌బర్గ్‌ వ్యాధి మళ్లీ వెలుగుచూసింది. పశ్చిమ ఆఫ్రికాలోని గినియా దేశంలో ఆగస్టు 2న మరణించిన వ్యక్తికి మార్‌బర్గ్‌ వైరస్‌ సోకినట్టు గుర్తించామని ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజాగా వెల్లడించడంతో ప్రజల్లో టెన్షన్ మొదలైంది. ఈ వైరస్‌ వ్యాపించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపింది. కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచాన్ని ఆగిపోయేలా చేసింది.. మార్ బర్గ్ వైరస్ కానీ ప్రబలిందంటే ఎంతో ప్రమాదమని హెచ్చరిస్తూ వస్తున్నారు. ఎబోలాను కలుగజేసే వైరస్‌ జాతికి చెందిన ఫిలోవిరిడే అనే వైరస్‌ ద్వారా ఈ వ్యాధి సోకుతుంది. 1967లో జర్మనీలోని మార్‌బర్గ్‌ సిటీలో ఈ వైరస్‌ను తొలిసారిగా గుర్తించారట. ఈ వ్యాధి సోకిన వారిలో 88 శాతం మంది మరణించే ప్రమాదముండడంతో మనుషుల్లో ప్రబలితే ఇది కరోనా కంటే ఎన్నో రెట్ల ప్రమాదకరమైన వ్యాధిగా మారనుంది. గుహలు, అడవుల్లో తిరిగే రౌసెట్టూస్‌ అనే గబ్బిలాల ద్వారా ఈ వైరస్‌ సోకుతుంది. తీవ్ర జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, నీళ్ల విరేచనాలు, కడుపు నొప్పి, వికారం, వాంతులు, తిమ్మిరి వంటివి ఈ వ్యాధి లక్షణాలని చెప్పారు. ఈ వ్యాధి కట్టడికి వ్యాక్సిన్లు, ఔషధాలు లేవని అంటున్నారు.

ఆఫ్రికా దేశం గినియాలో మార్ బర్గ్ వ్యాధి కేసు నమోదైంది. గుడిడెవో రాష్ట్రంలో చనిపోయిన ఓ రోగి నుండి శ్యాంపిల్స్ ను పరిశీలించగా ఈ విషయం బయటపడింది. సియ్రా లియోన్, లిబేరియా బోర్డర్ వద్ద ఉన్న గ్రామంలో మార్ బర్గ్ కేసు నమోదైంది. రోగికి తొలుత మలేరియా పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 2 అతను చనిపోయిన తరువాత పోస్టుమార్టమ్ పరీక్షల్లో ఎబోలా నెగటివ్, మార్ బర్గ్ పాజిటివ్ గా గుర్తించారు. జంతువులనుండి ఈ వైరస్ మనుషులకు సోకి ఉంటుందని డబ్ల్యూహెచ్ వో తెలిపింది. ఈ వ్యాధి సోకిన రోగుల రక్తాన్ని, స్రవాలను తాకడం వల్ల ఈ వ్యాధి వ్యాపిస్తుందని శాస్త్రవేత్తలు చెప్పుకొచ్చారు. గతంలో ఇదే తరహా కేసులు దక్షిణ కొరియా , అంగోలా, కెన్యా, ఉగాండా, కాంగో దేశాల్లో నమోదయ్యాయి. పశ్చిమ ఆఫ్రికాలో నమోదవ్వడం ఇదే తొలిసారని తెలుస్తోంది. గతంలో ఈ వ్యాధి ప్రబలిన సందర్భంలో మరణాల రేటు 24 నుండి 88శాతానికి పెరిగినట్లు అంచనా వేస్తున్నారు. అయితే మార్ బర్గ్ వైరస్ ప్రపంచ వ్యాప్తంగా వ్యాప్తి చెందే అవకాశం లేవని డబ్ల్యూహెచ్ వో తెలిపింది.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

17 − eleven =