సంజయ్ రౌత్…! శివసేన ఎంపీ..! సామ్నా పత్రికకు ఎడిటర్..! పొలిటికల్ సర్కిళ్లల్లో వెటకారపు కామెంట్లకు అతను పెట్టింది పేరని అంటారు! తనదైన శైలీలో సంపాదకీయాలు రాస్తుంటారు. ఎత్తిపొడుపు మాటలతో విమర్శలు గుప్పిస్తుంటారు. అంతేకాదు బీజేపీ, శివసేన పార్టీల మధ్య దోస్తానా చెడగొట్టడంలోనూ ఇతనే కీలక పాత్ర పోషించాడని చెబుతారు. శివసేన అధినేత ఉద్దవ్ థాక్రేను సీఎం చేయడంలోనూ సంజయ్ రౌత్ హ్యాండ్ ఉంది. దీనికోసం శివసేన ఐడియాలాజికల్ బేస్ అయిన హిందూత్వను పక్కన పెట్టించారని కూడా అంటారు. అవకాశం దొరికినప్పుడల్లా ఇతరుల తప్పులనెంచడంలోనూ సంజయ్ రౌత్ దిట్ట. అటువంటి సంజయ్ రౌత్ కు ఇప్పుడు ఊహించని షాక్ తగిలింది.
ఇప్పటికే ప్రస్తుతం మహారాష్ట్రలోని మహా అఘాడీ సర్కార్ పై నీలినీడలు కమ్ముకున్నాయనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్సీపీకి, శివసేనకు మధ్య పొరపొచ్చలు వచ్చాయని టాక్. అంతేకాదు శరద్ పవార్ సైతం సెకండ్ ఆప్షన్ ను రెడీ చేసుకున్నారని, కేంద్రమంత్రి అమిత్ షాతో సీక్రెట్ గా సమాలోచనలు జరిపారని అంటున్నారు.
మరోవైపు ఇటు వంద కోట్ల రూపాయల దందాకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొన్న హోంమంత్రి హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాజీనామా చేశారు. ఆయన స్థానంలో ఎక్సైజ్ శాఖ మంత్రి దిలీప్ వల్సే పాటిల్ ను హోంమంత్రిగా కూర్చొబెట్టారు. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో సంజయ్ రౌత్ చేసిన కామెంట్లు కూడా శివసేన, ఎన్సీపీల మధ్య అగ్గికి అజ్యం పోసినట్లు అయ్యింది. ప్రస్తుతానికి అంతా సద్దుమణగినట్లే కనిపిస్తున్నా … కూటమిలోని పార్టీల మధ్య నెలకొన్న అనుమానాలు మాత్రం కొనసాగుతూనే ఉన్నాయి.
ఇన్ని కఠిన పరిస్థితుల మధ్య.. సంజయ్ రౌత్ కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. మరాఠి సినీ నిర్మాత డాక్టర్ స్వప్న పాఠ్కర్.. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ పై లైంగిక వేధింపుల ఆరోపణలు చేశారు. డాక్టర్ స్వప్న కొంతకాలం శివసేన పార్టీలో పనిచేశారు.శివసేన వ్యవస్థాపకుడు బాలాసాహెబ్ థాక్రే జీవితం ఆధారంగా ఓ చిత్రాన్ని కూడా నిర్మించారు. 2009 నుంచి 2014 వరకు సంజయ్ రౌత్ పార్టీ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలను కూడా ఆమె చూశారు. ఈ క్రమంలోనే సంజయ్ తనను లైంగిక వేధింపులకు గురిచేశాడని.. అర్థరాత్రి వల్గర్ వీడియో కాల్స్ చేసేవాడని ఆరోపించారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా… తిరిగి తనతోపాటు తన కుటుంబ సభ్యులపైనా కేసులు పెట్టారని, గత ఎనిమిదేళ్లుగా తాము సంజయ్ రౌత్ వేధింపులకు గురవుతున్నామని, తమకు రక్షణకల్పించాలని కోరుతూ, ఆమె ప్రధాని మోదీకి రెండు పేజీల లేఖ రాశారు. న్యాయం కోసం నేషనల్ హ్యూమన్ రైట్ కమిషన్ తోపాటు, ముంబై హైకోర్టులో సైతం రిట్ పిటిషన్ వేసిన విషయాన్ని ఆమె ప్రస్తావించారు.
అలాగే గత ఏడాది సుశాంత్ సింగ్ రాజ్ పూత్ ఆత్మహత్య కేసు, అనంతర పరిణామాల మధ్య బాలీవుడ్ హీరోయిన్ కంగనా రౌనత్ కు సంజయ్ రౌత్ కు మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ వెంటనే ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కంగనా ఆఫీసును ధ్వంసం చేయడం వెనుక సంజయ్ రౌతే ఉన్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ మరుసటి రోజు ఉకాడ్ ఫేకా అంటూ సామ్నా పేపర్లో హెడ్డింగులు కనిపించాయి. తాజాగా సంజయ్ రౌత్ పై వచ్చిన ఆరోపణలపై న్యాయ విచారణ జరపాలని, అతని ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కంగనా ప్రశ్నించారు.
ఇక రాబోయే రోజుల్లో ఈ లైంగిక వేధింపుల ఆరోపణల వ్యవహారం అటు సంజయ్ రౌత్ కు ఇటు శివసేన పార్టీకి ఎటువంటి షాకులు ఇవ్వనుందో అనే అంశంపై పొలిటికల్ సర్కిల్స్ లో చర్చలు నడుస్తున్నాయి.