తెలంగాణ-చత్తీస్‌గఢ్ సరిహద్దు ప్రాంతంలో భారీ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంది. ములుగు- బీజీపూర్ జిల్లా తర్లగూడ అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన కాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెంచారు. చనిపోయిన వారిలో ఒకరు వాజేడు, వెంకటాపురం మావోయిస్టు పార్టీ ఏరియా కమిటీ కమాండర్ సుధాకర్‌గా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మరో ఇద్దరిని గుర్తించే పనిలో ఉన్నారు. కాల్పులు జరిగిన సమయంలో మరో ఆరుగురు మావోయిస్టులు తప్పించుకున్నట్లు తెలుస్తోంది. తప్పించుకున్న వారిలో మావోయిస్టు అగ్రనేత ఉన్నట్లు సమాచారం. సంఘటనా స్థలంలో ఏకే47, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్స్ లభ్యమయ్యాయి. చత్తీస్‌గఢ్ నుంచి మావోయిస్టు పార్టీ కీలక నేత హిడ్మా తెలంగాణ సరిహద్దులోకి ఎంట్రీ అయ్యాడని వార్తల నేపథ్యంలో గత వారం రోజుల నుంచి పోలీసులు ముమ్మరంగా కూంబింగ్ చేపడుతున్నారు. చర్ల, వాజేడు, వెంకటాపురం అటవీ ప్రాంతంలో కుంబింగ్ కొనసాగుతోంది. పోలీసులు కుంబింగ్ జరుపుతున్న సమయంలోనే మావోయిస్టులు ఎదురు పడడంతో తాజాగా ఈ కాల్పులు ఘటన చోటుచేసుకుంది.
ఘటనాస్థలం నుంచి ఏకే-47, ఎస్ఎల్ఆర్ తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మృతి చెందిన మావోయిస్టుల్లో గతంలో వాజేడు-వెంకటాపురం ఏరియా కమాండర్ గా పని చేసిన సుధాకర్ ఉన్నట్టు భావిస్తున్నామని.. ఎన్ కౌంటర్ నేపథ్యంలో ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లో పోలీసులు అప్రమత్తం అయ్యారని పోలీసు అధికారులు తెలిపారు.