More

  పాకిస్తానీలకు నేత్ర దానం చేస్తున్న శ్రీలంక ప్రజలు.. ఇప్పుడేమో ఆ దేశస్థుడినే బహిరంగంగా సజీవదహనం

  శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమారను పాకిస్తాన్ లో సజీవ దహనం చేసిన ఘటనను ఎవరూ మరచిపోలేకపోతున్నారు. దీనిపై ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. సియోల్‌కోట్‌లోని వజీరాబాద్ రోడ్డులో ఉన్న ఓ ప్రైవేటు ఫ్యాక్టరీలో శ్రీలంకకు చెందిన ప్రియాంత కుమార (40) ఎక్స్‌పోర్టు మేనేజరుగా పనిచేస్తున్నారు. తెహ్రీక్-ఇ-లబ్బైక్ పాకిస్థాన్ (టీఎల్‌పీ) అనే కరడుగట్టిన మతవాద సంస్థ ఆయన కార్యాలయానికి సమీపంలోని గోడపై ఓ పోస్టరు అంటించింది. ఆ పోస్టర్‌పై ఖురాన్ పద్యాలు ముద్రించి ఉన్నాయి. తన కార్యాలయ గోడపై అంతికించిన ఆ పోస్టరును ప్రియాంత చింపి చెత్తబుట్టలో పడేశారని ఆరోపణలు ఉన్నాయి. అది గమనించిన కార్మికులు విషయాన్ని తోటి కార్మికులకు చెప్పడంతో వారిలో ఆగ్రహం పెరిగిపోయింది. అందరూ కలిసి అతడి కార్యాలయం వద్దకు చేరుకుని నినాదాలు చేశారు. దైవదూషణకు పాల్పడ్డాడంటూ ఆగ్రహం వ్యక్తం చేసి మూకుమ్మడిగా దాడిచేశారు. దాడిలో తీవ్రంగా గాయపడిన ప్రియాంతను బతికి ఉండగానే మంటలు అంటించి తగలబెట్టేశారు.

  ప్రియాంత కుమార భార్య తన భర్త అటువంటి పని చేసి ఉండడని ఏడుస్తూ తెలిపింది. న్యాయం చేయాలని వేడుకుంది. “నా భర్త అమాయకపు వ్యక్తి. ఇంత కాలం విదేశాల్లో పనిచేసిన ఆయన దారుణ హత్యకు గురయ్యారని వార్తల ద్వారా తెలుసుకున్నాను. హత్య ఎంత అమానుషమో ఇంటర్నెట్‌లో చూశాను. నా భర్తకు, మా ఇద్దరి పిల్లలకు న్యాయం జరిగేలా విచారణ జరిపించాలని శ్రీలంక అధ్యక్షుడు, పాక్ ప్రధాని, అధ్యక్షులకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను.” అని కోరారు. తన చిత్రహింసలకు గురిచేసి, ఎముకలు విరిచి చంపేశారని ఆమె ఏడుస్తూ చెప్పింది.

  శ్రీలంక ప్రజలు పాక్ ప్రజలకు నేత్రదానం కొన్నేళ్లుగా చేస్తూ వస్తున్నారు. అయితే ఇలా ఓ శ్రీలంక వ్యక్తిని సజీవ దహనం చేయడాన్ని శ్రీలంక ప్రజలు అసలు జీర్ణించుకోలేకపోతున్నారు. శ్రీలంక ప్రజల నేత్రదానంలో అత్యధికంగా లబ్దిపొందిన దేశం పాకిస్తాన్. 1967 నుండి, శ్రీలంక విరాళంగా ఇచ్చిన 35,000 కార్నియాలను పాకిస్తాన్ జాతీయులకు ఇచ్చి వారికి కంటి చూపు వచ్చేలా చేశారు. డాక్టర్ నియాజ్ బరోహి, పాకిస్తాన్ లోని గొప్ప నేత్ర వైద్యులలో ఒకరు.. అతను పాకిస్తాన్‌లోని శ్రీలంక నేత్రదాన సంఘంలో సభ్యుడు కూడా. ఆయన మాట్లాడుతూ సియాల్‌కోట్‌లో జరిగిన సంఘటన తన మనస్సుపై తీవ్ర ప్రభావం చూపించిందని అన్నారు. ఇస్లామిక్ ఛాందసవాదుల ఈ చర్యను ప్రపంచ వ్యాప్తంగా వ్యతిరేకిస్తున్నారు. తమ దేశంలో చాలా మంది సిగ్గుతో తల దించుకున్నారని చెప్పారు. కరాచీలోని ప్రసిద్ధ స్పానిష్ కంటి ఆసుపత్రి అధిపతి డాక్టర్ బరోహి ఇప్పటివరకు అనేక కార్నియా మార్పిడిని నిర్వహించగలిగారు. శ్రీలంక ఇప్పటివరకు 83,200 కార్నియాలను ప్రపంచానికి అందించిందని ఆయన చెప్పారు. శ్రీలంక మొత్తం విరాళాల్లో 40 శాతం పాక్ కు అందడంతో తమ దేశ ప్రజలకే ఎక్కువ ప్రయోజనం చేకూరిందని అన్నారు. గణాంకాలను వివరిస్తూ 1967 నుండి, శ్రీలంక నేత్రదాన సంఘం పాకిస్తాన్‌కు 35,000 కార్నియాలను విరాళంగా ఇచ్చిందని చెప్పారు. ఎంతో మంది యువకులకు, పిల్లలకు వారు ఇచ్చిన కార్నియాల కారణంగా చూపును తెప్పించామని అన్నారు. సియాల్‌కోట్ ఘటనను ఖండిస్తూ శ్రీలంక మనకు వేలాది కళ్లను అందించినా.. మనం మాత్రం చూపు కోల్పోయామని అన్నారు.

  Trending Stories

  Related Stories