More

  కేసీఆర్, జగన్, బాబు..
  థర్డ్ ఫ్రంట్‎లో చోటెవరికి..?

  2024లో మోదీని ఎదుర్కోవడానికి విపక్షాలన్నీ ఏకమవుతున్నాయి.‘థర్డ్ ఫ్రంట్’ సినిమా కోసం ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. స్టోరీ, స్క్రీన్ ప్లే రెడీ చేయడమే కాకుండా దర్శకత్వ బాధ్యతలను కూడా చేపట్టారు. ఈ పొలిటికల్ పిక్చర్ లో శరద్ పవార్, మమతా బెనర్జీ ప్రధాన పాత్రలు పోషిస్తున్నప్పటికీ.. చివరికి లీడ్ రోల్ ఎవరికి దక్కుతుందనేది సందిగ్ధంలోనే వుంది. ఇప్పటికే మరాఠా నాయకుడి ఇంట్లో పలుమార్లు మాటా ముచ్చట నడిచాయి. పైకి ఇవి ఫ్రంట్ భేటీలు కాదని.. ప్రస్తుత రాజకీయాలపై చర్చలు మాత్రమేనని చెప్పుకుంటున్నా.. కచ్చితంగా కూటమి కూడికలేనని అర్థమవుతోంది.

  అయితే, ఓవైపు థర్డ్ ఫ్రంట్ ఫ్రేమ్ వర్క్ ముందుకు సాగుతున్నా.. అవి థర్డ్ ఫ్రంట్ సమావేశాలు కాదని చెప్పడం.. అనేక అనుమానాలకు తావిస్తోంది. నిజానికి, విపక్ష పార్టీల్లో కొన్నింటికి థర్డ్ ఫ్రంట్ పై నమ్మకం లేదని తెలుస్తోంది. శరద్ పవార్ ఇంట్లో జరిగిన సమావేశానికి, దేశంలో పలు ప్రధాన ప్రాంతీయ పార్టీల నాయకులు, ముఖ్యంగా దక్షిణాది నాయకులకు పిలుపు రాలేదు. కొన్ని పార్టీలు ఆహ్వానం అందక ఆగిపోతే.. మరికొన్ని.. ఇష్టం లేక నిమ్మకుండిపోయాయి. కొన్ని పార్టీలైతే సెకండ్ గ్రేడ్ నాయకులను పంపి మమ అనిపించాయి. ఇలా.. థర్డ్ ఫ్రంట్ బలంపై పీకే బ్యాచ్ లోనే క్లారిటీ లేదు కాబట్టే.. ఇవి థర్డ్ ఫ్రంట్ చర్చలు కాదంటూ పైకి కలరింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ప్రాంతీయ పార్టీలన్నిటినీ ఏకం చేసే పనిలో ఉన్నారు పీకే. అయితే ఆయన మాటకు సై అంటూ విపక్షాలన్నీ ఏకతాటిపైకి చేరుతాయా లేదా అన్నదానిపై సందిగ్ధం నెలకొంది.

  ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లోని మూడు ప్రధాన ప్రాంతీయ పార్టీలు థర్డ్ ఫ్రంట్ పై సందిగ్ధంలో వున్నట్టు తెలుస్తోంది. నిజానికి, కేంద్రం రాజకీయాల్లో అవిభాజ్య ఏపీది ప్రముఖ స్థానం. ఇప్పుడు రాష్ట్రం విడిపోయినా.. ఎంపీల బలం, రాజకీయ దిగ్గజాలు ఉన్న రాష్ట్రాలుగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ముందంజలోనే ఉన్నాయి. దక్షిణాది రాష్ట్రాల్లో కేరళ ప్రధాన పార్టీలు ఎప్పుడూ ఎన్డీఏకు వ్యతిరేకమే. ఇక దక్షిణాదిలో బీజేపీ చేతిలో వున్న ఏకైక అస్త్రం కర్నాటక. ఇక, తమిళనాడు కొరుకుడు పడని అంశమే. ఇక, మిగిలింది ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే. ఇవి బీజేపికి సపోర్ట్ గా ఉంటాయా..? లేక పీకే టీం అమ్ములపొదిలో అస్త్రాలుగా మారుతాయా..? అన్నది తేలాల్సి ఉంది. తెలంగాణ విషయానికి చూస్తే.. సీఎం కేసీఆర్ తటస్థ వైఖరి స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన నేరుగా బీజేపీతో ఢీకి దిగిన సంకేతాలేవీ లేవు. అయితే గత రాజకీయ పరిణామాల్ని అంచనా వేస్తే.. ఆయన థర్డ్ ఫ్రంట్ వైపు వేసిన అడుగులు గమనిస్తే.. ఆయన బీజేపీయేతర శక్తిగా ఉపయోగపడతారన్నది సందేహం లేని అంశం.

  ఏపీ విషయానికి వస్తే.. ప్రస్తుతానికి జగన్ మోహన్ రెడ్డి బీజేపీ వంటి రాజకీయ శక్తిని ఎదిరిస్తారనుకోవడం సందేహమే. పైగా భవిష్యత్తులో టీడీపీ వంటి బలమైన ప్రతిపక్షాన్నిఎదుర్కోవాలంటే.. బీజేపీ అండ తప్పనిసరి. అందుకే ఆయన కేంద్రంతో విభేదాలు పెట్టుకోరనేది రాజకీయ విశ్లేషకుల అంచనా. పైగా జగన్ ఎన్డీఏ కూటమిలో కూడా చేరతారని కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో జగన్ థర్డ్ ఫ్రంట్ కు దూరంగా వుంటారనే అనిపిస్తోంది. శరద్ పవార్ ఇంట్లో జరిగిన సమావేశానికి వైసీపీ నేతలు హాజరు కాకపోవడం ఇందుకు బలాన్ని చేకూర్చుతోంది.

  ఇక, ప్రస్తుతానికి థర్డ్ ఫ్రంట్ కు దూరంగా వున్న మరో ప్రధాన ప్రాంతీయ పార్టీ తెలుగుదేశం. ప్రశాంత్ కిశోర్ టీమ్ లో ఇప్పటిదాకా టీడీపీ పేరు వినిపించలేదు. శరద్ పవార్ ఇంట్లో జరిగిన భేటీకి కనీసం ఆహ్వానం కూడా అందకపోవడం చర్చనీయాంశంగా మారింది. 2014 ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ సహకారం తీసుకున్న బాబు.. కొన్నాళ్లు ఎన్డీఏతో పొత్తు కొనసాగించారు. ఆ తర్వాత రద్దు చేసుకుని బీజేపీ పై ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. 2019 ఎన్నికల ఫలితాల తర్వాత పూర్తిగా సైలెంట్ అయిపోయారు. ప్రస్తుతం వైసీపీలాగే బీజేపీకి దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. అయినా బీజేపీ దూరం పెడుతుండడంతో, ఈ ప్రాంతీయ పార్టీల కూటమిలో తమకూ ప్రాధాన్యం ఉంటుందేమో అని బాబు ఆశగా ఎదురుచూశారు. అయితే, అనూహ్యంగా పీకే బ్యాచ్ నుంచి బాబుకు సంకేతాలు అందకపోవడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

  అయితే, దీనికి రాజకీయ నిపుణులు అనేక కారణాలను విశ్లేషిస్తున్నారు. 2019 ఎన్నికల ముగిసిన తర్వాత చంద్రబాబు అనుసరించిన వైఖరితో జాతీయ నేతల వద్ద నమ్మకం కోల్పోయారు. తరచుగా తమ రాజకీయ వైఖరిని మార్చుకుంటూ, చంద్రబాబు వ్యవహరిస్తున్న తీరుపై జాతీయ నేతల్లో అసంతృప్తి వ్యక్తమైంది. దీంతో ఇటువంటి వ్యక్తి ఉన్నా ఆ తరువాత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందనే ఆలోచనతోనే ప్రశాంత్ కిషోర్ కూటమి నుంచి ఆహ్వానం అందనట్టు తెలుస్తోంది. అసలు టీడీపీని కూటమిలో చేర్చుకునేందుకు ప్రశాంత్ కిషోర్ ఏ మాత్రం సుముఖంగా లేనట్టు వినికిడి. కేవలం కొంత మంది నేతలు బాబు విషయంలో సానుకూలంగా ఉన్నా, ప్రశాంత్ కిషోర్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కూటమిలోని టీడీపీని తీసుకువచ్చేందుకు ససేమిరా అంటున్నారట. దీంతో కూటమిలోని పార్టీలు సైతం చంద్రబాబును పక్కనపెట్టినట్టు తెలుస్తోంది.

  అటు, చంద్రబాబు కూడా థర్డ్ ఫ్రంట్ పై ఇంట్రెస్ట్ చూపడం లేదని సమాచారం. ఇప్పట్లో మోదీ క్రేజ్ తగ్గే అవకాశం లేదని.. ఇలాంటి సమయంలో ఆయనకు వ్యతిరేకంగా వెళ్లి కోరి కష్టాలు తెచ్చుకోవడం కాన్నా.. కూల్ గా కాంప్రమైజ్ అవ్వడం బెటటరని చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే టీడీపీ నుంచి బీజేపీలో చేరిన విధేయుల ద్వారా కేంద్ర పెద్దలకు తన మనసులో మాట చేర్చినట్టు సమాచారం. అయితే, బీజేపీ జగన్ ను అక్కున చేర్చుకుంటుందా..? లేక, చంద్రబాబును ఆహ్వానిస్తుందా అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

  Trending Stories

  Related Stories