మంగుళూరు పేలుడు ఘటన ఎన్ఐఏ కు అప్పగింత

0
674

క‌ర్ణాట‌క‌లోని మంగుళూరులో జ‌రిగిన ఆటో రిక్షా పేలుడు కేసులో నిందితుడికి ఇస్లామిక్ స్టేట్ ఉగ్ర‌వాద గ్రూపుతో సంబంధాలు ఉన్నాయని తేలింది. నిందితుడు షారీక్‌ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్లు పోలీసులు తేల్చారు. ఈ కేసును జాతీయ ద‌ర్యాప్తు సంస్థ‌(NIA)కు అప్ప‌గిస్తున్న‌ట్లు క‌ర్ణాట‌క డీజీపీ ప్ర‌వీణ్ సూద్ మీడియాకు వెల్ల‌డించారు. నిందితుడు షారిక్ ఆటోలో కుక్కర్‌లో బాంబును త‌ర‌లిస్తుండ‌గా ఈ పేలుడు జ‌రిగింది. షారిక్‌పై మూడు కేసులు న‌మోదు అయ్యాయి. ఒక కేసు శివ‌మొగ్గ‌లో, మ‌రో రెండు కేసులు మంగ‌ళూరులో న‌మోదైన‌ట్లు పోలీసులు పేర్కొన్నారు. షారిక్ ఉంటున్న ఇంట్లో చాలా వ‌ర‌కు పేలుడు ప‌దార్థాలు గుర్తించి, స్వాధీనం చేసుకున్నామ‌ని తెలిపారు. కొన్నింటిని ఆన్‌లైన్‌లో, కొన్ని ఆఫ్‌లైన్‌లో కొన్న‌ట్లు గుర్తించారు. ఇస్లామిక్ ఉగ్ర‌వాద సంస్థ‌తో షారిక్ ప‌నిచేశాడ‌ని, ఆ సంస్థ‌కు చెందిన అల్ హింద్ అనే గ్రూపుతో అత‌నికి లింకులు ఉన్న‌ట్లు తేల్చారు. అరాఫ‌త్ అలీ అనే వ్య‌క్తితో షారిక్‌కు సంబంధాలు ఉన్నాయ‌ని.. మరింత మందిని గుర్తిస్తున్నామ‌ని పోలీసులు చెప్పారు. శనివారం రోజు క‌దులుతున్న ఆటోలో పేలుళ్లు జరిగిన ఘ‌ట‌న అంతా అక్క‌డున్న సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘ‌ట‌న‌ను మొద‌ట ప్ర‌మాదంగా భావించారు. కానీ ఉగ్ర‌వాదుల‌కు సంబంధం ఉంద‌ని పోలీసులు తేల్చారు.