గుంటూరు జిల్లా మంగళగిరిలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం ప్రహరీలో కొంత భాగం గత రాత్రి కూలిపోయింది. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. ఆ ప్రాంతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల కారణంగా నిత్యం రద్దీగా ఉంటుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. శిథిలాల కింద కొన్ని ద్విచక్రవాహనాలు, తోపుడుబండ్లు ఉన్నట్టు తెలుస్తోంది. దాదాపు 20 అడుగుల పొడవుండే ఈ ప్రహరీని దక్షిణ గాలి గోపురానికి దగ్గరలో రాతితో నిర్మించారు. శనివారం కురిసిన భారీ వర్షాల కారణంగానే దక్షిణ మాడవీధిలో కొంతభాగం కూలిపోయినట్టు చెబుతున్నారు.
ఆదివారం రాత్రి దక్షిణ మాడవీధిలో నైరుతి వైపున సుమారు 70 అడుగుల మేర గోడ కూలింది. ఈ గోడ సుమారు 20 అడుగుల ఎత్తు ఉంటుందని.. పురాతన కట్టడం కావడం, ఇటీవల భారీ వర్షాలు కురుస్తుండటంతో ఒక్కసారిగా గోడ కుప్పకూలినట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రాంతం నిత్యం రద్దీగా ఉంటుంది. ఆదివారం కావడం వలన అక్కడ జనసంచారం లేకపోవటంతో పెనుప్రమాదం తప్పింది. పెద్ద శబ్దంతో ఒక్కసారిగా గోడ కూలిపోవడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే దేవస్థానం అధికారులు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. శిథిలాల కింద చిక్కుకుపోయిన వాటిని వెలికి తీసే ప్రయత్నాలు మొదలుపెట్టారు. 10 ద్విచక్ర వాహనాలు పూర్తిగా ధ్వంసమయ్యాయని అధికారులు తెలిపారు.