ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ కృష్ణ కాన్షియస్‌నెస్ (ఇస్కాన్) గోవులను కసాయిలకు విక్రయిస్తోందని బీజేపీ ఎంపీ మేనకా గాంధీ చేసిన వ్యాఖ్యలు ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర దుమారాన్ని రేపాయి. ఆమె చేసిన ఆరోపణల్లో ఏ మాత్రం నిజం లేదని ఇస్కాన్ చెప్పడమే కాకుండా.. ఏకంగా రూ.100 కోట్ల పరువు నష్టం నోటీసును పంపింది. ఇస్కాన్ గోశాలలపై మేనకా గాంధీ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, ఈ వ్యాఖ్యలతో భక్తులు ఎంతో మనో వేదనను అనుభవించారని ఇస్కాన్ సంస్థ తెలిపింది. ఇస్కాన్ భక్తులు, మద్దతుదారులు, శ్రేయోభిలాషులు ఈ ఆరోపణలతో ఎంతో బాధపడ్డారని.. తప్పుడు ప్రచారానికి వ్యతిరేకంగా న్యాయం కోసం తాము పోరాటం చేస్తున్నామని అందుకే పరువు నష్టం దావా వేసినట్లు ఇస్కాన్ కోల్‌కతా వైస్ ప్రెసిడెంట్ రాధారామన్ దాస్ తేల్చి చెప్పారు.
ఇస్కాన్ సంస్థపై బీజేపీ ఎంపీ, మేనకా గాంధీ ఆరోపణలు చేసిన వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇస్కాన్ సంస్థ దేశంలోనే పెద్ద మోసానికి పాల్పడుతూ ఉందని.. గోశాలల నిర్వహణకు ప్రభుత్వం నుంచి గ్రాంట్లు తీసుకుంటూ గోవులను మాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గోశాలల నిర్వహణలో అవకతవకలు జరుగుతున్నాయని.. గోవులను కసాయి వాళ్లకు అమ్ముకుంటున్నారన్నారు. అనంతపురంలోని ఇస్కాన్ గోశాలను సందర్శించినప్పుడు అక్కడ ఒక్క ఆవు కూడా లేదని, అన్నింటినీ కబేళాలకు అమ్మేశారని ఆరోపించారు. మేనకా గాంధీ ఆరోపణలలో ఎటువంటి నిజం లేదని.. అనంతపురంలోని గోశాలకు సంబంధించిన వీడియోను ఇస్కాన్ వెంటనే పోస్టు చేసింది. అనంతపురం గోశాలలో 76 ఎద్దులు.. 246 ఆవులు, దూడలు కూడా ఉన్నాయని ఇస్కాన్ తెలిపింది. వీటన్నిటికీ ప్రేమ, భక్తితో సేవలందిస్తున్నామని ఇస్కాన్ తెలిపింది. మేనకా గాంధీ చేసిన ఆరోపణలన్నీ నిరాధారమని తెలిపే పలు పత్రాలను ఇస్కాన్ సంస్థ సోషల్ మీడియాలో పోస్టు చేసింది.
గోసంరక్షణలో తాము ముందు నుండి ఎన్నో గొప్ప చర్యలు చేపట్టామని ఇస్కాన్ తెలిపింది. గోవులకు సాయం చేయడమే తమ ఆశయం అని.. తమ గోశాలల్లోని ఆవులకు, ఎద్దులకు చివరి శ్వాస వరకు సేవలందిస్తామని స్పష్టం చేసింది. వాటిని కసాయిలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మడం లేదని ఇస్కాన్ జాతీయ అధికార ప్రతినిధి యుధిష్టిర్ గోవింద దాస్ తెలిపారు. ఇస్కాన్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఆవులు, ఎద్దుల సంరక్షణలో ముందంజలో ఉందని తెలిపారు. ఇస్కాన్ అనేక గోశాలలను నడుపుతోందని, ఎన్నో గోవులకు సేవ చేస్తుందని తెలిపారు. రోడ్ల మీద పట్టించుకోకుండా వదిలిపెట్టి వెళ్ళిపోయిన గోవులను, గాయపడిన, ఆశ్రయం లేకుండా ఉన్న ఆవులు, ఎద్దులను తీసుకుని వెళ్లి వాటి బాగోగులు చూసుకుంటున్నట్లు యుధిష్టిర్ గోవింద దాస్ తెలిపారు. ఇస్కాన్ నుండి కసాయిలకు అమ్ముకుంటున్నారనే ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని.. తామే కబేళాల నుండి కాపాడిన గోవులకు, ఎద్దులను పెంచుతున్నామని స్పష్టం చేశారు. బీఫ్ ను ప్రధాన ఆహారంగా తీసుకునే దేశాల్లో కూడా తాము గోసంరక్షణ చేపట్టామని ఇస్కాన్ తెలిపింది. భారతదేశంలో 60కి పైగా గోశాలలను నడుపుతూ ఉన్నామని.. గోసంరక్షణలో ఉన్నత ప్రమాణాలు పాటిస్తున్నామని ఇస్కాన్ ప్రతినిధులు వివరణ ఇచ్చారు.