జనవరి 6వ తేదీన మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కు కాల్ చేసి బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ నివాసం ‘మన్నత్’ సహా ముంబైలోని పలు ప్రాంతాలను పేల్చివేస్తానని బెదిరించిన వ్యక్తిని మధ్యప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ముంబైలోని బాంద్రాలో ఉంది షారూఖ్ ఖాన్ బంగ్లా మన్నత్. ఎన్నో కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ ఇంటిని షారుఖ్ ఖాన్ కట్టుకున్నాడు. ముంబై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జనవరి 6వ తేదీన ఓ గుర్తుతెలియని కాలర్ నగరంలోని పలు ప్రాంతాలను బాంబుతో పేల్చివేస్తానని బెదిరింపు కాల్ చేశాడు. ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్ (CSMT), కుర్లా రైల్వే స్టేషన్, షారూఖ్ ఖాన్ బంగ్లా.. ఇలా పలు ప్రాంతాల్లో బాంబులు పెడతానని అతడు బెదిరించాడు. అలా బెదిరించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌లో నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. ఆ వ్యక్తి పేరు జితేష్ ఠాకూర్. జితేష్ మహారాష్ట్ర పోలీస్ కంట్రోల్ రూమ్‌కి కాల్ చేసి, షారూఖ్ బంగ్లాను బాంబుతో పేల్చివేస్తానని చెప్పాడు. ముంబైలోని పలు ప్రాంతాల్లో ఉగ్రవాద దాడులు, బాంబు పేలుళ్లు చేస్తామని బెదిరించాడు. ముంబై పోలీసులు కాల్‌ను ట్రేస్ చేసి, ఆ నంబర్ మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ నుండి వచ్చిందని కనుగొన్నారు. నిందితుడిపై పలు సెక్షన్ల క్రింద కేసు నమోదు చేసినట్టు పోలీసులు వెల్లడించారు.
CSP అలోక్ శర్మ మాట్లాడుతూ, “మహారాష్ట్ర పోలీసుల నుండి మాకు కాల్ వచ్చింది, జబల్‌పూర్ నుండి టెర్రరిస్ట్ దాడులకు పాల్పడుతున్నట్లు పేర్కొంటూ కాల్ వచ్చింది. ఆ వ్యక్తిని పట్టుకోవడంలో సహాయం కోరారు. మేము అతనిని అదుపులోకి తీసుకున్నాము. భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల క్రింద అతనిపై కేసులు నమోదు చేసాము” అని అన్నారు.
జబల్పూర్ అదనపు పోలీసు సూపరింటెండెంట్ గోపాల్ ఖండేల్ మాట్లాడుతూ మహారాష్ట్ర పోలీసులు మొబైల్ నంబర్‌ను మాతో పంచుకున్నారు, దాని ఆధారంగా 35 ఏళ్ల జితేష్ ఠాకూర్ ని అరెస్టు చేశామని అన్నారు. నిందితుడికి మద్యం సేవించే అలవాటు ఉందని.. గతంలోనూ ఇలాంటి బూటకపు కాల్‌లు చేసి డయల్ 100 సిబ్బందితో గొడవ పడ్డాడని ఖండేల్ వెల్లడించారు. కాల్ వచ్చిన తరువాత, అనేక చోట్ల సోదాలు నిర్వహించబడ్డాయి, అయితే అనుమానాస్పదంగా ఏమీ కనుగొనబడలేదు. ఆ తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.