తమిళనాడులో గత కొద్దిరోజులుగా భారీగా వర్షాలు పడుతున్న విషయం తెలిసిందే. చెన్నైలో ఇటీవల చోటు చేసుకున్న ఓ ఘటన అందరినీ ఆశ్చర్య పోయేలా చేసింది. చెన్నైలోని టీపీ చట్రం ఏరియాలోని ఓ శ్మశాన వాటికలో ఉదయ్ కుమార్ అనే యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అతని శరీరంలో కదలికలను గమనించిన మహిళా సీఐ రాజేశ్వరి తక్షణమే ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు చేశారు. శ్మశాన వాటిక నుంచి ఆటో వరకు సీఐ రాజేశ్వరి ఉదయ్ కుమార్‌ను తన భుజాలపై మోసుకెళ్లారు. ఆ తర్వాత ఆటోలో ఉదయ్‌ను ఉంచి ఆస్పత్రికి తరలించారు. యువకుడి ప్రాణాలను కాపాడిన సీఐ రాజేశ్వరిపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. పలువురు ప్రముఖులు కూడా ఆమెను ప్రశంసించారు.
అయితే అనే చేసిన కృషి ఫలించలేదు. ఆ యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. విషయం తెలుసుకున్న మహిళా పోలీసు రాజేశ్వరి తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఆ యువకుడిని కాపాడేందుకు మహిళా పోలీసు చేసిన ప్రయత్నం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. విధినిర్వహణలో రాజేశ్వరి చేసిన పనికి తమిళనాడు సీఎం ఎం.కె స్టాలిన్ సైతం అభినందించారు. ఎస్సై రాజేశ్వరి మానవతా దృక్పథం తెలుసుకున్న ఆయన ఎస్సై రాజేశ్వరిని తన కార్యాలయానికి పిలిపించి మనస్ఫూర్తిగా అభినందించారు. ఆమెకు ప్రశంసా పత్రం అందజేశారు. ఎంతోమందికి స్ఫూర్తిగా నిలిచారంటూ ఎస్సై రాజేశ్వరిని కొనియాడారు. చెన్నై నగర పోలీస్ కమిషనర్ శంకర్ జివాల్ కూడా ఎస్సై రాజేశ్వరి సేవల పట్ల కితాబునిచ్చారు. ఆమె ఒక అద్భుతమైన అధికారిణి అని అన్నారు. దేశంలోని పలువురు ప్రముఖులు కూడా ఆమెను మెచ్చుకున్నారు. కానీ ఆ యువకుడు మరణించాడనే వార్త ఇప్పుడు బయటకు వచ్చింది.