ఉత్తరప్రదేశ్‌లో మచ్లిషహర్లోని రాంలీలాలో శివుడి పాత్రను పోషిస్తున్న ఓ వ్యక్తి.. వేదికపై ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడికక్కడే గుండెపోటుతో మరణించిన విషాద ఘటనను అందరూ చూశారు. రామ్ ప్రసాద్ అలియాస్ చబ్బన్ పాండే అనే వ్యక్తి గత ఆరేళ్ల నుంచి శివుడి పాత్రలో నటిస్తున్నాడు. బెలాసిన్ గ్రామంలో రామ్‌ప్రసాద్ ఛాతీ పట్టుకుని ఒక్కసారిగా కిందపడ్డాడు. రామ్ ప్రసాద్ మరణంతో రాంలీలాలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శివుడి పాత్రకు హారతి ఇస్తూ ఉండగా.. ఒక్కసారిగా కిందకు పడిపోయాడు. వెంటనే అక్కడున్న వాళ్లంతా ఆయన చుట్టూ చేరుకున్నారు. రామ్ ప్రసాద్‌ను సమీపంలోని వైద్యశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఇటీవల రాంలీలాలో ప్రదర్శన ఇస్తూ పలువురు కళాకారులు మరణించారు. రావణుడి పాత్రలో నటిస్తున్న 60 ఏళ్ల పతిరామ్ అయోధ్యలోని ఐహార్ గ్రామంలో రాంలీలా చిత్రీకరణ సమయంలో అకస్మాత్తుగా అస్వస్థతకు గురై చనిపోయాడు. ఫతేపూర్‌లో జరిగిన మరొక సంఘటనలో రామ్ స్వరూప్ వేదికపై హనుమంతుని పాత్రను పోషిస్తుండగా మరణించాడు. ఊహించని విధంగా గుండెపోట్లు ప్రజల ప్రాణాలను తీస్తూ వస్తున్నాయి.