ముస్లిం అమ్మాయితో పెళ్లి.. హిందూ యువకుడి దారుణ హత్య

0
929

హైదరాబాద్‌ సరూర్ నగర్‌లో పరువు హత్య చోటు చేసుకుంది. ప్రేమ పెళ్లి చేసుకుందన్న కారణంతో ఓ యువతి సోదరుడు ఆమె భర్తను హత్య చేశాడు. గడ్డపారలతో అతనిపై దాడి చేసి హతమార్చాడు. కళ్లెదుటే తన భర్తను చంపడంతో ఆ యువతి కన్నీరుమున్నీరుగా రోధించింది. సరూర్ నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయం ఎదుట జరిగిన ఈ హత్య తీవ్ర కలకలం రేపింది.

రంగారెడ్డి జిల్లాకు చెందిన నాగరాజు, సయ్యద్ అశ్రిన్ సుల్తానా అనే ఇద్దరు ఏడేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరి ప్రేమ విషయం అశ్రిన్ ఇంట్లో తెలియడంతో ఆమెను మందలించారు. సుల్తానాను ప్రేమించవద్దని నాగరాజును హెచ్చరించారు. అయినప్పటికీ ఇద్దరూ కలిసే బతకాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని ఓ కార్ల షోరూం కంపెనీలో నాగరాజు కొద్ది నెలల క్రితం సేల్స్‌మ్యాన్‌గా చేరాడు. ఈ ఏడాది కొత్త సంవత్సరం రోజున సుల్తానాను నాగరాజు రహస్యంగా కలుసుకున్నాడు. ఇద్దరం పెళ్లి చేసుకుందామని చెప్పాడు. జనవరి చివరి వారంలో సుల్తానా ఇంటి నుంచి పారిపోయి హైదరాబాద్ వచ్చింది. జనవరి 31న లాల్ దర్వాజలోని ఆర్య సమాజ్‌లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు.

పెళ్లి విషయంలో సుల్తానా ఇంట్లో తెలియడంతో రెండు నెలల పాటు హైదరాబాద్‌ను వీడి విశాఖపట్నంలో ఉన్నారు. ఇక తమకేమీ కాదని భావించి… ఐదు రోజుల క్రితమే మళ్లీ హైదరాబాద్‌కు చేరారు. సరూర్‌నగర్‌లోని పంజా అనిల్ కుమార్ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకి ఉంటున్నారు. ఎలా తెలిసిందో ఏమో గానీ సుల్తానా-నాగరాజుల ఆచూకీ మొత్తానికి ఆమె కుటుంబ సభ్యులకు తెలిసిపోయింది.

బుధవారం సుల్తానా, నాగరాజు ఏదో పని నిమిత్తం ఇంటి నుంచి బయటకొచ్చారు. స్థానిక జీహెచ్ఎంసీ కార్యాలయం సమీపంలో అప్పటికే మాటు వేసి ఉన్న సుల్తానా సోదరుడు, అతని స్నేహితుడు… బైక్‌పై వారిని వెంబడించారు. నాగరాజుపై గడ్డపారలతో దాడి చేసి హత్య చేశారు. కళ్లెదుటే భర్తను చంపడంతో సుల్తానా కన్నీరుమున్నీరుగా విలపించింది. స్థానికుల ఫిర్యాదుతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని అక్కడి నుంచి తరలించారు. నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here

four × four =