హైదరాబాదులోని నెహ్రూ జూలాజికల్ పార్కులో ఓ యువకుడు సింహం ఉండే ఎన్ క్లోజరులో దూకేందుకు ప్రయత్నించాడు. ఎన్ క్లోజరు పైభాగంలో ఉన్న గుహ వంటి నిర్మాణం మీదకు ఎక్కిన యువకుడు లోపలికి దిగేందుకు ప్రయత్నించగా, జూ సిబ్బంది అడ్డుకున్నారు. ఆ యువకుడు గుహపై ఉండగా, కొన్ని అడుగుల కిందనే సింహం ఉండడంతో అందరూ ఆందోళనకు గురయ్యారు. అతడు దూకుతాడేమోనని సింహం కూడా అక్కడే కాపు కాసింది. కాసేపటి తర్వాత అది అవతలికి వెళ్లిపోయింది. ఎన్ క్లోజరు వెనుక నుంచి వచ్చిన జూ సిబ్బంది అతడిని అక్కడి నుంచి తరలించడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
జూ సిబ్బంది అతడిని పట్టుకుని బహదూర్ పుర పోలీసులకు అప్పగించారు. అతడి పేరు సాయికుమార్. వయసు 31 సంవత్సరాలు. స్వస్థలం కీసర అని తెలుస్తోంది. అతడికి తల్లిదండ్రులు లేరని.. మానసిక స్థితి సరిగా లేకపోవడంతో అప్పుడప్పుడు వింతగా ప్రవర్తిస్తుంటాడని అతడి గురించి తెలిసిన వాళ్లు చెప్పారు. ఓసారి హోటల్లో టీ తాగుతుండగా, కొందరు వ్యక్తులు మాట్లాడుకుంటూ సింహం వద్ద వజ్రాలు ఉంటాయని చెబుతుంటే విన్నాడట. వారి మాటలు నిజమో కాదో తెలుసుకునేందుకు జూలో సింహాల ఎన్ క్లోజరులో దిగేందుకు ప్రయత్నించానని సాయికుమార్ వెల్లడించాడు. ఈ మాటలు విన్న పోలీసులు షాక్ అయ్యారు. అతడి మానసిక స్థితి సరిగా లేదని గుర్తించారు.