Telugu States

విజయవాడ కనకదుర్గ ఆలయంలో అపశ్రుతి

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో అపశ్రుతి చోటుచేసుకుంది. అంతరాలయం మండపాన్ని పూలతో అలంకరించేందుకు పైకెక్కిన ఓ యువకుడు ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడి మరణించాడు. షామియానా సిబ్బందిలోని ఓ వ్యక్తి (36) పూలు కట్టేందుకు పైకెక్కినప్పుడు ఈ ఘటన చోటు చేసుకుంది. కనకదుర్గమ్మ సన్నిదిలో నవరాత్రి వేడుకలను వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బుధవారం తెల్లవారుజామున పూలు అలంకరిస్తున్న సమయంలో అతడు నిల్చున్న సిపాయి బల్ల కదలడంతో పట్టుతప్పి అమ్మవారి ధ్వజస్తంభం దగ్గరి నుంచి కిందపడ్డాడు. భక్తులు నిల్చునేందుకు ఏర్పాటు చేసిన క్యూలోని ఇనుపరాడ్లు అతడి తలకు బలంగా తాకడంతో తీవ్ర గాయమైంది. వెంటనే అప్రమత్తమైన ఆలయ సిబ్బంది యువకుడిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మృతి చెందాడు.

ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ ఆలయంలో దసరా శరన్నవరాత్రులు ప్రారంభం కానున్నాయి. అధికారులు దాదాపుగా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఏర్పాట్లను కలెక్టర్ జె.నివాస్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాసులు పరిశీలించారు. కలెక్టర్ జె.నివాస్ మాట్లాడుతూ ఈ నెల 7 నుంచి 15 వరకు జరిగే దసరా ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. చిన్న చిన్న పనులను వీలైనంత తొందరగా పూర్తి చేస్తామని చెప్పారు. రోజుకు పది వేల మందికి మాత్రమే దుర్గమ్మ దర్శనానికి భక్తులకు అనుమతి ఇస్తున్నామన్నారు. ప్రతిఒక్కరూ కోవిడ్ నిబంధనలు పాటించాల్సిందే అని కలెక్టర్ స్పష్టం చేశారు. వ్యాక్సిన్ డబుల్ డోస్ తీసుకున్న వారు మాత్రమే కొండపైకి రావాలని చెప్పారు. ధర్మల్ స్క్రీనింగ్ చెక్ చేసిన తర్వాతే కొండపైకి అనుమతిస్తామన్నారు. ఘాట్లలో జల్లు స్నానాలకు మాత్రమే అనుమతి ఉంటుందన్నారు. హెలికాఫ్టర్ రైడ్ ఈ సారి దసరాకు ప్రత్యేకత అని చెప్పుకొచ్చారు. విజయవాడ నగరాన్ని హెలి రైడ్ ద్వారా వీక్షించవచ్చని కలెక్టర్ అన్నారు. 2500 మంది పోలీస్ సిబ్బందిని నియమించారు. నాలుగు అంచెలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. దసరా సందర్భంగా మూలానక్షత్రం రోజున సీఎం జగన్ అమ్మవారికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు సమర్పించబోతున్నారు

Related Articles

Back to top button