More

    ఎమ్మెల్సీ కవిత జగిత్యాల పర్యటనలో విషాదం.. కుప్పకూలిన కౌన్సిలర్ భర్త..!

    బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. ర్యాలీ తీస్తుండగా బీఆర్ఎస్ కౌన్సిలర్ బండారి రజినీ భర్త నరేందర్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. ఆయన మృతి చెందారని వైద్యులు తెలిపారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో భాగంగా కవితకు స్వాగతం పలికేందుకు బీఆర్ఎస్ నాయకులు డీజేలతో డ్యాన్స్ చేస్తూ భారీ ర్యాలీ నిర్వహించారు. డీజే ముందు డ్యాన్స్ చేస్తున్న బండారి నరేందర్ ఒక్కసారిగా కుప్పకూలారు. కార్యకర్తలు సీపీఆర్ చేసి ఆయన్ను హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నరేందర్ మృతి చెందారు. దీంతో పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. నరేందర్ మృతితో జగిత్యాలలో బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని రద్దు చేశారు.

    నరేందర్ మృతి తెలియగానే కవిత అక్కడకు చేరుకొని నరేందర్ మృతికి సంతాపం తెలిపారు. భౌతిక కాయాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. పార్టీపరంగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. నరేందర్ మృతితో జగిత్యాలలో ఇతర కార్యక్రమాలను కూడా రద్దు చేశారు. ఈడీ విచారణ తరువాత తొలిసారిగా నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో పర్యటనకు వచ్చిన ఎమ్మెల్సీ కవితకు ఘనస్వాగతం పలికారు. బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్న ఎమ్మెల్సీ కవితను ర్యాలీగా కార్యక్రమం జరిగే ప్రాంతానికి తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేశారు. ఇంతలో నరేందర్ మృతి చెందడం అందర్నీ విషాదంలోకి నెట్టేసింది.

    Trending Stories

    Related Stories