హిందూ పురాణమైన రామాయణంలో శ్రవణ కుమారుడి పాత్ర గుర్తుందా..? అంధ దంపతులకు జన్మించిన శ్రవణుడు వారిరువురినీ పోషించిడం కోసం సంపాదించాల్సి వచ్చేది. ఈ ప్రయత్నంలో ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ప్రయాణం చేస్తుండేవాడు.
వృద్ధులు, అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చుండబెట్టుకొని దాన్ని తన భుజంపై మోస్తూ ప్రయాణం చేస్తుండేవాడు. చిన్న పొరపాటు వల్ల దశరథుడి చేతితో శ్రవణుడు ప్రాణాలు కోల్పోతాడు. కాగా, కన్వర్ యాత్ర సందర్బంగా ఈ పాత్రను గుర్తుచేశాడు ఓ వ్యక్తి. ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది..
ఈ వీడియోను ఐపీఎస్ అధికారి అశోక్ కుమార్ ట్విటర్లో షేర్ చేశారు. ఈ వీడియోలో వ్యక్తి వృద్దులైన తన తల్లిదండ్రులను కావడికి చెరో పక్కన కూర్చోబెట్టాడు. ఆ కావడిని మోస్తూ కన్వర్ యాత్రలో పాల్గొన్నాడు. లక్షలాది మంది శివభక్తుల్లో ప్రత్యేకంగా నిలిచాడు. అందరి దృష్టినీ ఆకర్షించాడు. ఆ వ్యక్తిని చూసి అందరూ శ్రవణుడిని గుర్తుచేసుకున్నారు. కలియుగ శ్రవణుడు అని పిలిచారు. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది.