More

    మంగళూరు విమానాశ్రయం దగ్గర పేలుడు పదార్థాల బ్యాగ్.. అతడికి 20 ఏళ్ల జైలు శిక్ష

    మంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ద్వారం దగ్గర పేలుడు పదార్థాన్ని అమర్చినందుకు గానూ బుధవారం నాడు కర్ణాటక న్యాయస్థానం ఆదిత్య రావు అనే వ్యక్తికి జైలు శిక్ష విధించింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల (నివారణ) చట్టం కింద 20 ఏళ్ల జైలుశిక్ష విధించింది. విమానాశ్రయంలో బాంబులు అమర్చిన కేసులో నాల్గవ జ్యుడీషియల్ జిల్లా కోర్టు ఆదిత్యరావుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, 10,000 రూపాయలు జరిమానా విధించింది.

    2020 జనవరి 20న ఎయిర్‌పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ టికెట్ కౌంటర్ దగ్గర బాంబు ఉన్న బ్యాగ్‌ని ఉంచినట్లు ఆదిత్యరావుపై ఆరోపణలు వచ్చాయి. బాంబులు ఉన్న బ్యాగ్ పెట్టేసిన తర్వాత అతడు ఆటో రిక్షాలో పారిపోయాడు. బ్యాగ్ లో తక్కువ-తీవ్రత కలిగిన IEDని ఉంచారు. ట్రిగ్గరింగ్ మెటీరియల్‌ను మినహాయించి అన్ని భాగాలు కలిగి ఉన్నాయి. ఆదిత్య ఆ తర్వాత బెంగళూరులోని రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయంలో లొంగిపోయాడు.

    అతడికి 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు, పేలుడు పదార్థాల చట్టం 1908లోని సెక్షన్ 4 ప్రకారం రూ. 10,000 జరిమానాతో పాటు ఐదేళ్ల జైలుశిక్షను కూడా కోర్టు ఆదేశించింది. జరిమానా చెల్లించడంలో ఆదిత్య విఫలమైతే అతడి శిక్షను మరో ఆరు నెలలు పొడిగిస్తారు. రెండు శిక్షలు ఏకకాలంలో అమలవుతాయి.

    Trending Stories

    Related Stories