More

  బెంగాల్ బరిలో ఎంఐఎం.. షాకిచ్చిన మమత

  పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ మమతా బెనర్జీలో భయం మొదలైందా? అందుకే విపక్ష పార్టీల ఎన్నికల ప్రచార ర్యాలీలకు పోలీసు చేత పరిష్మన్లు ఇవ్వకుండా ఆమె అడ్డంకులు సృష్టిస్తున్నారా? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

  ముఖ్యంగా మొన్నటికి మొన్న ముర్షీదాబాద్ లో బీజేపీ పరివర్తన్ ర్యాలీకి అనుమతులు లేవంటూ అడ్డుకున్న మమతా ప్రభుత్వం… తాజాగా AIMIM పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ కోల్ కత్తా పర్యటనకు అడ్డకులు సృష్టించిందని స్వయంగా ఎంఐఎం పార్టీనేతలే ఆరోపణలు గుప్పిస్తున్నారు.

  ఆల్ ఇండియా మజ్లిస్ ఎ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ పార్టీ తరపున ఫిబ్రవరి 25వ తేదీన కోల్ కత్తాలోని మోతిభూర్జ్ ప్రాంతంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది.10 రోజుల క్రితమే సభా అనుమతుల కోసం, కోల్ కత్తా పోలీసులకు అప్లయ్ కూడా  చేసుకున్నారు. అయితే సరిగ్గా బహిరంగ సభకు ఒక రోజు ముందు, ఒవైసీ బహిరంగ సభకు అనుమతులు ఇవ్వలేమని కోల్ కత్తా పోలీసులు తెలిపారని బెంగాల్ ఎంఐఎం పార్టీ కార్యదర్శి జమీరుల్ హసన్ తెలిపాడు. 

  నిజానికి ఇది ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీకి బెంగాల్ లో  పార్టీ పరంగా తొలి అధికారిక పర్యటన. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 చోట్ల ఎంఐఎం పార్టీ అభ్యర్థులు విజయం సాధించిన సందర్భంలో…సంతోషం వ్యక్తం చేసిన అసదుద్దీన్…, ఆ రోజున పక్కనే ఉన్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో సైతం పోటీ చేస్తామని ప్రకటించారు. బెంగాల్ బరిలో తాము కూడా నిలుస్తామని ఎప్పుడైతే అసదుద్దీన్ ప్రకటన చేశాడో అప్పటి నుంచే ఒవైసీ పార్టీని బెంగాల్ బరి నుంచి తప్పించేందుకు మమతా విశ్వప్రయత్నాలు చేసినట్లు ప్రచారం జరిగింది. అయితే అసద్ మాత్రం… బెంగాల్ బరిలో నిలచేందుకు నిర్ణయించారు.

  అంతేకాదు ఈ ఏడాది జనవరిలో బెంగాల్ లో రహస్య పర్యటన జరిపారు. తన పర్యటన అత్యంత గోప్యంగా ఉంచారు. ఈ పర్యటనలో హుగ్లీ జిల్లాలోని ఫుర్‌ఫురా షరీఫ్ ను సందర్శించారు. అక్కడే ముస్లిం మత పెద్దలతోపాటు పలు ప్రాంతాల నుంచి ముస్లిం సంఘాల నేతలతోనూ సమాలోచనలు జరిపినట్లు ప్రచారం జరిగింది. బెంగాల్ ముస్లింలలో పలుకుబడి కలిగిన నాయకుడిగా పేరున్న అబ్బాస్ సిద్దిఖీతో సైతం చర్చలు జరిపినట్లు సమాచారం. దేశంలో జమ్మూకశ్మీర్ తర్వాత ముస్లిం జనాభా ఎక్కువ ఉన్న రాష్ట్రం బెంగాలే కావడంతో ఒవైసీ ఇక్కడ దృష్టి కేంద్రీకరించారనే ప్రచారం జరుగుతోంది. తనను బీజేపీ బీ టీమ్ గా కాంగ్రెస్ పార్టీతోపాటు, తృణమూల్ , లెఫ్ట్ పార్టీలు విమర్శించినా.. ఒవైసీ పట్టించుకోవడంలో సైలెంట్ గా తన పని తాను చేసుకుపోతున్నాడు.

  ప్రస్తుతం బెంగాల్ లో ముస్లింల జనాభా 30 శాతానికి దగ్గర ఉంటుంది. ముర్షీదాబాద్, మల్దా, ఉత్తర దినాజ్ పూర్ లో 70 శాతానికి పైగానే ముస్లిం జనాభా ఉంటుందని ఒక అంచనా. అలాగే బెంగాల్ లో 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటే అందులో 100కు పైగా నియోజకవర్గాల్లో ముస్లింలే నిర్ణయాత్మక శక్తిగా.., కీలకంగా వ్యవహారిస్తున్నారు. మమతా బెనర్జీ వరుసగా రెండు సార్లు అధికారంలోకి రావడానికి ముస్లిం ఓటు బ్యాంకే కారణమని అంటారు. మొదట్లో ముస్లింలు అంతా లెఫ్ట్ పార్టీలకు అండగా ఉండేవారు. తర్వాత మమతా బెనర్జీ వైపు మళ్లారు.

  అయితే ఈసారి బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ కూడా బరిలోకి దిగుతుండంతో… రాష్ట్రంలోని ముస్లింల మైండ్ సెట్ కూడా క్రమంగా మారుతోందని.., తృణమూల్ కాంగ్రెస్ ను నమ్ముకునే కంటే కూడా…,  తమకంటూ ఒక ముస్లిం పార్టీ ఉంటే మంచిదే కదా అనే అభిప్రాయంలో అక్కడి ముస్లిం సమాజం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

  ఇటు బెంగాల్ ముస్లింలు… ఎంఐఎం పార్టీ పట్ల ఏ మేరకు అనుకూలంగా ఉన్నారనే అంశంపై కూడా ఒవైసీ ఒక సర్వే చేయించారనే ప్రచారం జరుగుతోంది. ఈ మేరకు ముస్లిం జనాభా ఆధిక్యం కలిగిన దాదాపు 30కి పైగా నియోజకవర్గాల్లో ఒవైసీ పార్టీ పోటీ చేసే అవకాశాలున్నాయనే ప్రచారం జరుగుతుంది.  మొదట అబ్బాస్ సిద్దిఖీ ప్రారంభించిన ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ తో కలిసి పోటీ చేయాలని ఒవైసీ భావించారని…, అయితే సిద్దిఖీ మాత్రం… కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి మమతకు వ్యతిరేకంగా కూటమి కట్టే ప్రయత్నం చేస్తుండంతో…, ఒవైసీ వెనక్కి తగ్గరని అంటున్నారు. ప్రస్తుతానికి ఒవైసీ బహిరంగ సభకు అడ్డుకుంలు సృష్టించినా… ఎన్నికల నోటిఫికేషన్ నాటికి ఒవైసీ మరోసారి బెంగాల్ లో పర్యటించే అవకాశాలున్నాయని…బీహార్ లో మాదిరిగానే బెంగాల్ లో సైతం తమ పార్టీ అదిరిపోయే ఎంట్రీ ఇస్తుందని ఎంఐఎం నేతలు చెబుతున్నారు.

   

  Trending Stories

  Related Stories