యాస్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో భారత ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. తుపాను కారణంగా తీవ్ర నష్టానికి గురైన రాష్ట్రాలను ఆదుకుంటామని మోదీ హామీ ఇచ్చారు. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కూడా మోదీ భేటీ అయ్యారు. కానీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రవర్తించిన తీరు ఇప్పుడు వివాదాస్పదమైంది. ఒకే బిల్డింగ్ లో ఉన్నా కూడా మోదీని ఎదురుచూసేలా చేశారు మమతా బెనర్జీ.
యాస్ తుఫాన్‌పై సమీక్ష సమావేశం నిర్వహించగా ఆ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన తర్వాత 30 నిమిషాలు ఆలస్యంగా మమతా అక్కడి వచ్చారు. యాస్ తుఫాను ప్రభావంపై మోదీ, పశ్చిమబెంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ పాల్గొన్న సమీక్ష సమావేశానికి మమతా బెనర్జీ అరగంట ఆలస్యంగా వచ్చారు. ఆలస్యంగా వచ్చిన మమతా బెనర్జీ రాష్ట్రంలో తుఫాను నష్టంపై పత్రాలను అందజేసి ఇతర సమావేశాల కోసం వెళ్లిపోయారు. ఆమె వ్యవహరించిన తీరు అత్యంత వివాదాస్పదమైంది.

యాస్ తుపాను ప్రభావంపై సమీక్షించేందుకు బెంగాల్‌లో పర్యటించారు మోదీ. పశ్చిమ మెదినీపుర్ జిల్లా కలైకుండాలో సమీక్షా సమావేశం నిర్వహించారు ప్రధాని మోదీ. మమతా ముందుగా నిర్ణయించిన సమయానికి రాకుండా ప్రధాని మోదీ ఎదురుచూసేలా ప్రవర్తించారు. సమావేశానికి అనుకున్న సమయానికన్నా ఆలస్యంగా వచ్చిన మమతా… ఇలా వచ్చి… అలా వెళ్లి పోయారు. తుపాను వల్ల కలిగిన నష్టంపై ప్రాథమిక నివేదికను మోదీకి అందించి బయటకు వెళ్లిపోయారు. మీడియాతో మాట్లాడిన మమతా.. ఇతర సమావేశాలు ఉండటం వల్లే ఇలా జరిగిందని అన్నారు.
‘ఈ రోజు మీరు నన్ను కలవాలని భావించారు.. అందుకే వచ్చాను.. నేను, నా ప్రధాన కార్యదర్శి ఈ నివేదికను మీకు సమర్పించాలనుకుంటున్నాను.. దీఘాలో ఓ సమావేశానికి హాజరుకావాల్సి ఉన్నందున వెళ్లడానికి మీ అనుమతి తీసుకుంటున్నాం’’ అని మమతా అక్కడ నుంచి వెళ్లిపోయారు. దీఘా అభివృద్ధికి రూ.20వేల కోట్లు, సుందర్బాన్ అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇవ్వాలని నివేదకలో కోరినట్లుగా తెలిపారు. రాష్ట్ర అధికారులు నన్ను కలవాలనుకుంటున్నట్లు ఆయనతో చెప్పాను. ఆయన అనుమతి తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాను అని తెలిపారు.

‘పశ్చిమబెంగాల్ రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం ప్రధాని నేతృత్వంలో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి, ఇతర అధికారులు హాజరుకావాల్సి ఉంది. కానీ, అలా జరగలేదు. ముఖాముఖి వైఖరి రాష్ట్ర లేదా ప్రజాస్వామ్య ప్రయోజనాలకు ఉపయోగపడుతుంది. సీఎం, అధికారులు పాల్గొనకపోవడం రాజ్యాంగబద్ధత లేదా చట్ట నియమాలతో సమకాలీకరించబడదు ‘ అని బెంగాల్ గవర్నర్ జగదీప్ ధనఖర్ ట్విట్టర్ లో మమతా బెనర్జీ తీరుపై నిరసన వ్యక్తం చేశారు.
దేశ చరిత్రలో ఇంత నీచంగా ప్రవర్తించిన ముఖ్యమంత్రి మరొకరు లేరనే విమర్శలు మమతా బెనర్జీని చుట్టుముట్టాయి. మమతా బెనర్జీ అహంకారి అని మరోసారి రుజువైందని అన్నారు. మమతకు బద్ధ విరోధి అయిన సువేందు అధికారి ప్రధాని పక్కనే ఉండడంతో మమత తీవ్ర అసంతృప్తికి గురయ్యారని అంటున్నారు. తుఫాను సమీక్ష సమావేశానికి ప్రతిపక్ష నేత సువేందు అధికారిని కూడా పిలవడంతోనే మమతా బెనర్జీ ఈ విధంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ప్రధాని సమావేశానికి సీఎం హాజరుకాకపోవడం చీకటి రోజంటూ సువేందు అధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్డీయేతర సీఎంలు ఇలాంటి సమావేశాల్లో పాల్గొన్నారని.. మమతకు మాత్రం రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని దుయ్యబట్టారు. మమతా బెనర్జీ వ్యవహరించిన తీరుపై కేంద్ర మంత్రి అమిత్ షా కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రధానిని కించపరిచేలా, అమర్యాదగా ఓ ముఖ్యమంత్రి ప్రవర్తించడం గతంలో ఎన్నడూ చూడలేదని.. నియంతృత్వ స్వభావానికి ఇది పరాకాష్ట అని అన్నారు. ప్రజల సంక్షేమం కంటే దీదీకి తన ఈగోనే ఎక్కువైపోయిందని అమిత్ షా అన్నారు.
