పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మమతా బెనర్జీ.. బీజేపీ తోపాటు, కేంద్ర భద్రత బలగాలను సైతం టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. గతంలో పశ్చిమ బెంగాల్ లో ఎన్నికలు అనగానే హింసాకాండా అనేది సర్వసాధారణమైన విషయంగా అందరూ చెప్పుకునేవారు. పోలింగ్ రోజున టీఎంసీ కార్యకర్తలది ఆడింది ఆట.., పాడింది పాట అనేంతగా వారి హవా నడిచేది. స్థానిక పోలీసుల అయితే…, ఇదేమిటని వారిని కనీసం టచ్ కూడా చేయరనే విమర్శలు ఉన్నాయి.
అయితే ఈ సారి అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ కార్యకర్తలకు చెక్ పెట్టింది కేంద్ర ఎన్నికల సంఘం.! గతంలో పోలింగ్ రోజున ఆయా పోలింగ్ బూత్ లకు సంబంధించిన రక్షణ వ్యవస్థ అంతా కూడా స్థానిక బెంగాల్ స్టేట్ పోలీసులే చూసుకునేవారు. భద్రత కోసం వచ్చిన కేంద్ర బలగాలను చౌరస్తాల్లో మోహరించేవారు. దీంతో స్థానిక పోలీసుల అండతో పోలింగ్ బూత్ ల ఆక్రమణ యాధేచ్చగా జరిగేదనే ఆరోపణలు వినిస్తూండేవి. గతంలో జరిగిన ఎన్నికల్లో పోలింగ్ బూత్ ఆక్రమణను అడ్డుకున్న ఓ ప్రిసైడింగ్ అధికారి…రైలు పట్టాలపై విగతజీవయ్యాడు. టీఎంసీ కార్యకర్తలపైనే అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. చివరకు ఆత్మహత్య అంటూ కేసును క్లోజ్ చేసిన విషయం మనం మర్చిపోరాదు.
అయితే ఈసారి ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తల ఆటలు సాగడం లేదు. ఎందుకంటే ప్రతి పోలింగ్ బూత్ వద్ద కేంద్ర పారా బలగాలను మోహరించడంతో పోలింగ్ బూత్ లను ఆక్రమించుకునేందుకు, నాటు బాంబు దాడులతో దాడులు చేసేందుకు టీఎంసీ కార్యకర్తలు జంకుతున్నారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు.
మమతా బెనర్జీ కూడా తన ప్రతి సభలో కూడా కేంద్ర బలగాల ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలను… పోలింగ్ బూతుల్లోకి వెళ్లకుండా కేంద్ర భద్రతా బలగాలు అడ్డుకుంటున్నాయని ఆమె ఆరోపించారు. ఒక పార్టీకి అనుకూలంగా ఓటు వేసే విధంగా ఓటర్లను కేంద్ర బలగాలు ప్రభావితం చేస్తున్నాయని, అదే సమయంలో టీఎంసీ ఓటర్లను బహిరంగంగా బెదిరిస్తున్నాయని, ఎన్నికల కమిషన్ మౌన ప్రేక్షకుడిగా కొనసాగుతోంది’’ అంటూ మమత ట్వీట్ చేశారు. అంతేకాదు ఏప్రిల్ 2వ తేదీన ఓ ఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ.. ఓటు వేసేందుకు వెళ్లే మహిళలు…మూకుమ్మడిగా పోలింగ్ బూత్ వద్ద విధుల్లో ఉండే కేంద్ర బలగాలపై దాడులు చేయండి అంటూ మమతా పిలుపునిచ్చారు.
అయితే మూడో దశ పోలింగ్ సందర్భంగా మమతా చెప్పిన పాఠాన్ని మహిళలు ఆమె తిరిగి బాగానే అప్పజెప్పారని కొంతమంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
సౌత్ 24 పరగణా జిల్లాలోని ఆరామ్ భాగ్ అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని సుభయ్ పూర్ హరిజన్ ప్రాథమిక విద్యాలయంలో ఏర్పాటు చేసిన ఓ పోలింగ్ బూత్ లో టీఎంసీకి చెందిన బాబర్ అలీఖాన్ పోలింగ్ ఏజెంట్ గా ఉన్నాడు. ఈ క్రమంలో ఓటు వేసేందుకు వచ్చిన కొంతమంది మహిళలను బాబర్ అలీఖాన్ ప్రశ్నించినట్లు తెలుస్తోంది.దీంతో వారందరూ కలిసి కోపంతో భద్రత బలగాల ఎదుటే, బాబర్ అలీఖాన్ పై పిడిగుద్దుల వర్షం కురిపించారు. దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన బాబర్ ను స్థానిక పోలీసులు జోక్యం చేసుకుని అక్కడి నుంచి తరలించారు. సో మమతా చెప్పిన పాఠాన్ని.. ఆమె పార్టీకే చెందిన పోలింగ్ బూత్ ఏజెంట్ ను చితకబాది ఆమెకే ఆ పాఠం అప్పజెప్పారు.