Special Stories

మమతా బెనర్జీ భయపడుతున్నారా.? ఆరు నెలల్లోశాసనసభకు ఎన్నిక కాపోతే పరిస్థితి ఏంటి.?

మమతా బెనర్జీ గురించి బాగా తెలిసినవారు ఆమెను ఒక యోధురాలిగా పేర్కొంటారు. ఇంకా ఆమెను స్ట్రీట్ ఫైటర్ గా అభివర్ణిస్తారు.! అంతేకాదు కళ్ల ముందు కటిక నిజం కనిపిస్తున్నా కూడా…ఆమె ఒకపట్టాన ఒప్పుకోరని కూడా చెబుతుంటారు. అయితే ఇదంతా గతమని.., మమతా ఎప్పుడైతే సుబేందు అధికారి చేతిలో ఓటమి పాలయ్యారో అప్పటి నుంచే ఆమెలో ఏదో తెలియని భయం కనిపిస్తోందని కొంతమంది విశ్లేషకులు చెబుతున్న మాట! ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారమైతే చేశారు కానీ.. మమతా బెనర్జీ మాత్రం ఆందోళనలోనే ఉన్నారని అంటున్నారు.

ఇటీవల జరిగినఅసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ ఎమ్మెల్యేగా గెలువలేదు. నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థి సుబేందు అధికారి చేతిలో ఓటమిపాలయ్యారు. దీంతో ఆరు నెలల్లోగా శాసనసభ ద్వారా కానీ, శాసన మండలి ద్వారా కానీ చట్టసభల సభ్యురాలిగా ఎన్నిక కావాల్సి ఉంది.

మమతా బెనర్జీ నేతృత్వంలో తిరుగులేని మెజారిటీ టీఎంసీ ప్రభుత్వం ఏర్పడటం జరిగింది. దీంతో రాష్ట్ట్రంలో ప్రస్తుతం అస్థిర పరిస్థితులకు అవకాశాలేవు. మమతా బెనర్జీ ప్రభుత్వం స్థిరంగానే ఉండబోతుందనేది స్పష్టం.! కానీ ఎందుకో తెలియదు కానీ మమతా బెనర్జీ సీఎంగా ఎంతకాలం ఉంటారనే ఊహగానాలు అప్పుడే మొదలు అయ్యాయి. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో  రెండు స్థానాలకు ఎన్నికలు వాయిదా పడ్డాయి.అలాగే ఇద్దరు బీజేపీ ఎంపీలు జగన్నాథ్ సర్కార్, నిసిత్ ప్రమాణిక్ లు శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే బీజేపీ అధిష్టానం ఆదేశాల మేరకు వారు తమ శాసనసభ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం బెంగాల్ లో నాలుగు స్థానాలు ఖాళీగా ఉన్నాయి.

కరోనా సెకండ్ వేవ్ కేసులు దృష్ట్యా తీవ్ర విమర్శల పాలైనా ఈసీ ఆరు నెలల్లోగా బెంగాల్ లో ఉప ఎన్నికలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయా..? అనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ఆరు నెలల్లోపు బెంగాల్ లోఉపఎన్నికలు జరగకపోతే మమతా బెనర్జీ పరిస్థితి ఏమిటీ? అనేది ఇప్పుడు చర్చనీయంశంగా మారింది.

అయితే సడన్ గా మమతా బెనర్జీ కేబినెట్ బెంగాల్ రాష్ట్రంలో శాసనమండలిని తిరిగి పునరుద్ధించేందుకు నిర్ణయం తీసుకుంది. 2011లోనే శాసనమండలి ఏర్పాటు అంశాన్ని పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో సైతం పొందుపర్చింది. అధికారంలో కొనసాగిన రెండు టర్ముల్లో కూడా మండలి ఏర్పాటు కోసం ప్రయత్నం చేసింది లేదు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ టిక్కెట్ లభించని వారిని శాసనమండలికి పంపిస్తామని మమతా హామీ ఇచ్చారు. అంతేకాదు మమతా కేబినెట్ లోని ఆర్థిక మంత్రిగా ఉన్న అమిత్ మిత్రా కూడా శాసనసభకు ఎన్నిక కాలేకపోయారు. అలాగే పార్టీ నేత పూర్ణేందు బోస్ తోపాటు ఇంకా అనేకమంది నేతలు విధాన పరిషత్ లో స్థానం కోసం మమతా బెనర్జీపై ఒత్తిడి తెస్తున్నారని తెలుస్తోంది.

అటు మమతా కూడా ఈసారి విధాన పరిషత్ ద్వారా సభలో ప్రవేశించాలని చూస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఒక వేళా బెంగాల్ లో ఉప ఎన్నికలు జరిగినా తాను పోటీ చేసే స్థానంపై బీజేపీ తన సర్వశక్తులు ఒడ్డుతుందని.., ఏలాగైతే నందిగ్రామ్ లో తనను ఓడించిందో…, అలాగే అక్కడ కూడా ఓడిస్తే పరిస్థితి ఏమిటని మమత బెనర్జీ కాసింత ఆందోళన పడుతున్నారనే వారు లేకపోలేదు.  అందుకే ఆమె ఎన్నికల ప్రక్రియ ద్వారా కాకుండా.. శాసనమండలి ద్వారా తన సీఎం పదవిని కాపాడుకునేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టారని కొందరు అంటున్నారు.

అయితే ప్రస్తుతం దేశంలో ఏపీ, తెలంగాణ, యూపీ, మహారాష్ట్ర, కర్ణాటక   రాష్ట్రాల్లో మాత్రమే శాసనమండలి ఉంది. పశ్చిమ బెంగాల్ లో కూడా 1952 నుంచి 1969 వరకు శాసనమండలి ఉనికిలో ఉంది. ప్రస్తుతం తిరిగి శాసనమండలిని పునరుద్ధరించడం కోసం అసెంబ్లీలో బిల్లు పెట్టి ఆమోదం పొందాలి. దీనికి గవర్నర్ అనుమతి తప్పనిసరి.! 1969లో పశ్చిమ బెంగాల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ రద్దును భారత పార్లమెంటు చట్టం ద్వారా రద్దు చేయడం జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 169 ప్రకారం… ఆ చట్టానికి తిరిగి సవరణ చేసి బెంగాల్ లో శాసనమండలిని పునరుద్ధరించవచ్చునని కొంతమంది రాజ్యాంగ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కార్ అందుకు సహకరిస్తుందా? అనేది ప్రశ్న! శాసనమండలి పునరుద్ధరణ జరిగినా.. పూర్తిస్థాయిలో మండలి ఏర్పాటుకు కనీసం రెండు సంవత్సరాలు పట్టే అవకాశం ఉందని చెబుతున్నారు. మండలిలోని మొత్తం స్థానాలకు తిరిగి ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. 1/3 సభ్యులను ఎమ్మెల్యేలు, అలాగే 1/3 స్థానిక సంస్థల సభ్యులు ఎన్నుకుంటారు. ఇంకా పట్టభద్రుల నియోజకవర్గాలు, ఉపాధ్యాయ నియోజకవర్గాలు ఇవన్ని ఫిల్ కావాలంటే టైమ్ తీసుకుంటుందని అంటున్నారు. ఈ దృష్ట్యా…మమతా ముందున్న ఏకైక ఆప్షన్ ఎమ్మెల్యేగా ఎన్నికకావడమే.!

అయితే ప్రస్తుతం మమతా బెనర్జీ.. కేంద్రంలోని మోదీ సర్కార్ తో ఢీ అంటే ఢీ అంటోంది. బెంగాల్ ఎన్నికల ఫలితాల తర్వాత జరిగిన హింసాకాండలో బీజేపీ కార్యకర్తలు ప్రాణాలు కోల్పోయారు. బీజేపీ ఆఫీసులను, కార్యకర్తల ఇళ్లను సైతం తగులబెట్టారు. ఈ హింసాకాండకు సంబంధించి నేషనల్ మీడియా నుంచి మొదలు పెడితే సోషల్ మీడియాలో సైతం వరుస కథనాలు వచ్చాయి. గవర్నర్ జగదీప్ ధన్ కర్  సైతం రాష్ట్ర సీఎస్, డీజీపీలను రాజ్ భవన్ కు పిలిపించుకుని శాంతిభద్రతల పరిస్థితిపై ఆరా తీశారు. ఇక లాభం లేదు అనుకుని తానే హింసాకాండ జరిగిన ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి వచ్చారు. ఇంతజరిగినా కూడా సీఎం మమతా బెనర్జీ మాత్రం రాష్ట్రంలో అసలు హింసాకాండే జరగలేదని.., అదంతా బీజేపీ దుష్ప్రచారమని మొండిగా ఒక్కమాటలో తేల్చిపారేశారు.

అంతేకాదు నారద స్టింగ్ ఆపరేషన్ లో మమతా కేబినెట్ మంత్రులను సీబీఐ అరెస్టు చేసిన సమయంలో…ఏకంగా సీబీఐ కార్యాలయానికే వెళ్లి అక్కడ ఐదున్నరగంటలపాటు బైఠాయించారు. సీబీఐ అధికారుల విధులను అడ్డుకునేందుకు యత్నించారు. అటు సీబీఐ కార్యాలయం బయట తృణమూల్ కాంగ్రెస్ కార్యకర్తలు కూడా రెచ్చిపోయారు. కొన్ని నేషనల్ మీడియా చానళ్లతోపాటు… కేంద్ర బలగాలపై కూడా రాళ్లు రువ్వారు. ఇంత జరిగినా తర్వాత కూడా కేంద్రంలోని మోదీ సర్కార్… మమత బెనర్జీ కోరుకున్నట్లుగా వ్యవహారిస్తుందా? అంటే డౌటే.! బీజేపీ వాలకం చూస్తేంటే ఇక మమతను ఏమాత్రం ఉపేక్షించకూడదనే భావనలో ఉందని  తేటతెల్లమవుతుంది. ఈ పరిస్థితుల్లో ఆరు నెలల్లో బెంగాల్ లో ఉప ఎన్నికలు జరుగుతాయా? అంటే చెప్పలేని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆరు నెలల తర్వాత ఆమె తన పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. పార్టీలోనే మరోకరికి సీఎం పదవిని అప్పగించాల్సి ఉంటుంది. అందుకు మమతా సిద్ధం అవుతారా? ఈ  పరిస్థితులను ఉపయోగించుకుని బీజేపీ ఊరికే ఉంటుందా? మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే అవకాశాలను వదిలేస్తుందా? జస్ట్ వెయిట్ అండ్ సీ!

Related Articles

Leave a Reply

Your email address will not be published.

19 − one =

Back to top button