గోవా ఎన్నికలను తృణమూల్ కాంగ్రెస్ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అక్కడ ఇప్పటికే ప్రశాంత్ కిషోర్ అండ్ కో ను రంగంలోకి దించింది. ఇక గోవాలో ప్రచారానికి వెళ్లిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ‘జై శ్రీరామ్’ బ్యానర్లతో స్వాగతం తెలిపారు. మమతా బెనర్జీ అక్టోబర్ 28, గురువారం నాడు ఎన్నికల ప్రచారం కోసం గోవాకు వెళ్ళినప్పుడు ‘జై శ్రీరామ్’ నినాదాలు, పోస్టర్‌లతో స్వాగతం పలికారు. 2022 లో జరిగే గోవా రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ఆమె పార్టీ ప్రకటించిన తర్వాత బెనర్జీ తన తొలి పర్యటన కోసం గోవాకు వెళ్లారు. ఆమె గోవా విమానాశ్రయానికి చేరుకున్నప్పుడు అక్కడ ఉన్న పలువురు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ‘జై శ్రీరామ్’ నినాదంతో స్వాగతం పలికారు. అంతేకాకుండా గోవా రాష్ట్రవ్యాప్తంగా అనేక ‘జై శ్రీరామ్’ పోస్టర్లు కూడా వెలిశాయి.

ఈ ఘటనపై గోవా మాజీ సీఎం, టీఎంసీ నేత లుయిజిన్హో ఫలేరియో మాట్లాడుతూ “కొందరు బీజేపీ మద్దతుదారులు జై శ్రీరామ్ నినాదాలతో నిరసన తెలిపారు. మమతా బెనర్జీ వారికి నమస్కారం చేసి మేము ముందుకు సాగాము. “నేను కూడా రామ భక్తుడిని” అని ఆయన అన్నారు. అయితే ఈ ఘటనలో తమ ప్రమేయం లేదని రాష్ట్ర బీజేపీ విభాగం ఖండించింది. “హోర్డింగ్‌ల వ్యవహారంలో మాకు ఖచ్చితంగా సంబంధం లేదు” అని ఒక బీజేపీ కార్యకర్త చెప్పినట్లు స్థానిక మీడియా పేర్కొంది.

తృణమూల్ అధినేత్రి పోస్టర్లను చించేశారు:
తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలి పర్యటనకు ముందు గోవాలో పలు హోర్డింగ్ లు ధ్వంసం అయ్యాయి. ఆమె చిత్రాలతో కూడిన అనేక హోర్డింగ్‌లకు కొందరు చింపేశారు. ఆ హోర్డింగ్ లకు దగ్గరగా ‘జై శ్రీ రామ్’ పోస్టర్లు వెలిశాయి. గోవా అంతటా అనేక తృణమూల్ హోర్డింగ్‌లు మరియు బిల్‌బోర్డ్‌లను తీసి వేశారు. చాలా బ్యానర్‌లపై మమతా బెనర్జీ ముఖంపై సిరా పూశారు. ఆ పార్టీ గోవా యూనిట్.. ఈ ఘటనకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ)పై నిందలు వేసింది.

మమతా బెనర్జీ తన చెప్పులతో ప్రధాని నరేంద్ర మోదీ, హోమ్ మినిస్టర్ అమిత్ షాలను చితకబాదినట్లు చూపుతున్నట్లుగా ఉన్న కార్టూన్ ను తృణమూల్ విడుదల చేసింది. ఆ కార్టూన్‌లో ఒక మహిళ, నీలిరంగు అంచుతో కూడిన తెల్లటి చీరను ధరించి.. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, అలాగే ఒక పౌరుడిని ఆమె చెప్పుల కింద ఉంచినట్లు చూపించింది. దీనిపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
