పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల తర్వాత చోటు చేసుకున్న హింసపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్‌హెచ్‌ఆర్‌సి) నివేదికను తయారు చేసింది. పశ్చిమ బెంగాల్ లో ఎన్నో దారుణాలు ఆ సమయంలో చోటు చేసుకున్నాయని నివేదిక చెబుతోంది. ఈ నివేదికను లీక్ చేశారంటూ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గగ్గోలు పెడుతున్నారు. బెంగాల్‌లో ఎన్నికల అనంతరం చెలరేగిన హింసపై తృణమూల్ సర్కార్ పాత్రను తప్పుపడుతూ ఎన్‌హెచ్ఆర్సీ తుది నివేదికను కలకత్తా హైకోర్టుకు గురువారం సమర్పించింది. ఈ నివేదికలో పేర్కొన్న అంశాలు బయటకు రావడం పట్ల మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కోర్టుకిచ్చే నివేదికను ఎన్‌హెచ్‌ఆర్‌సి ఎందుకు లీక్ చేసిందని సిఎం మమతా బెనర్జీ మండిపడ్డారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతరం జరిగిన హింసపై ఎన్‌హెచ్‌ఆర్‌సి నివేదిక ఇవ్వగా.. ఆ నివేదిక బహిర్గతం కావడంపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయవ్యవస్ధను గౌరవించాలని.. ఇది రాజకీయ కక్షసాధింపు కాకుంటే ఈ నివేదికను వారు ఎలా లీక్ చేస్తారని దీదీ ప్రశ్నించారు. బెంగాలీల ప్రతిష్టను దిగజార్చేలా కేంద్రం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ప్రధాని మోదీ రాజకీయ కక్షసాధింపునకు దిగుతున్నారని అన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్ధలు, ఇతర ఏజెన్సీలను వాడుతూ ప్రత్యర్ధులపై రాజకీయ కక్ష సాధింపునకు పాల్పడుతున్నారని అన్నారు. దేశంలో శాంతిభద్రతలు అత్యంత దారుణంగా ఉన్న రాష్ట్రం ఉత్తరప్రదేశ్ అని, బెంగాల్‌వైపు చూసే ముందు యూపీ సంగతేంటో చూడాలని మమతా బెనర్జీ హితవు పలికారు. బెంగాల్‌లో శాంతిభద్రతలు అమలులో లేవని భారతీయ జనతా పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణలను నిజం లేదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లో శాంతిభద్రతలు ఎలాంటి పరిస్థితులో ఉన్నాయో ప్రధానమంత్రి నరేంద్రమోదీకి బాగా తెలుసు.. ఆ రాష్ట్రంలో ప్రతిరోజు మానవ హక్కుల హననం జరుగుతూనే ఉంటుందని అన్నారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఎవరికీ భద్రత లేదని.. హత్రాస్ ఘటన నుంచి ఉన్నావ్ సంఘటన వరకు ఎన్నో ఎన్నెన్నో దారుణాలు రాష్ట్రంలో జరిగాయి, జరుగుతూనే ఉన్నాయని మమతా వెల్లడించారు. జర్నలిస్టులకు కూడా అక్కడ భద్రత లేదని.. భారతీయ జనతా పార్టీ నేతలు బెంగాల్‌లో శాంతిభద్రతల సమస్యలపై మాట్లాడుతున్నారు. యూపీని చూపించి బెంగాల్ ఇమేజ్‌ను పాడు చేయొద్దు అని మమత అన్నారు.
మరో వైపు మమతా బెనర్జీ త్వరలో ఢిల్లీ వెళ్లనున్నారు. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని మోదీ అపాయింట్‌మెంట్ లభిస్తే వారిని కలుస్తానని గురువారం ఆమె తెలిపారు. ఢిల్లీలో కరోనా పరిస్థితి మెరుగైందని మమత బెనర్జీ చెప్పుకొచ్చారు. పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో ఢిల్లీ వెళ్లి కొంత మంది నాయకులను కలుస్తానని అన్నారు. మమతా బెనర్జీ ఈ నెల 25న ఢిల్లీకి వెళ్తారని సమాచారం. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్‌తోపాటు ప్రతిపక్షాలకు చెందిన పలు పార్టీల నేతలను ఆమె కలుస్తారని తెలుస్తోంది.
ఇక నందిగ్రామ్ ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ వేసిన పిటీషన్ కోల్‌కత్తా హైకోర్టులో త్వరలో విచారణ జరగనుంది. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ ఘన విజయం సాధించిన మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో మాత్రం సువేందు అదికారి చేతిలో స్వల్ప తేడాతో ఓటమి పాలయ్యారు. నందిగ్రామ్ ఫలితాలపై అనుమానం వ్యక్తం చేసిన మమతా బెనర్జీ..ఆ ఎన్నికల్ని సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటీషన్‌ను కోల్‌కత్తా హైకోర్టు స్వీకరించింది. ఆగస్టు 12వ తేదీన పిటీషన్‌పై విచారిస్తామని చెప్పిన హైకోర్టు..ప్రతిపక్ష నేత సువేందు అధికారికి నోటీసులు జారీ చేయనుంది. నందిగ్రామ్ ఓట్లకు సంబంధించిన అన్ని రికార్డుల్ని భద్రపర్చాలని ఎన్నికల సంఘానికి సూచించింది.