పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోదరుడు ఆషిమ్ బెనర్జీ కరోనా కారణంగా శనివారం నాడు కన్నుమూశారు. ఆషిమ్ బెనర్జీకి ఇటీవలే కరోనా సోకడంతో కోల్ కతా లోని ఆసుపత్రిలో చేరారు. శనివారం ఉదయం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో కన్నుమూసినట్లు ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి.
కోల్ కతా లోని మెడికా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఛైర్మన్ డాక్టర్ అలోక్ రాయ్ మమతా బెనర్జీ తమ్ముడు ఆషిమ్ బెనర్జీ మరణించారనే విషయాన్ని ధృవీకరిస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు. మమతా బెనర్జీ సోదరుడి మృతి పట్ల పలువురు దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు.
మరో వైపు పశ్చిమ బెంగాల్ లో కరోనా కేసుల కట్టడిలో ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందనే విమర్శలు వస్తూ ఉన్నాయి. శుక్రవారం నాడు పశ్చిమ బెంగాల్ లో 20846 కేసులు నమోదయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. శుక్రవారం నాడు 136 మరణాలు కూడా సంభవించడంతో ఆ రాష్ట్రంలో ఇప్పటి వరకూ 12993 మంది కరోనా కారణంగా మరణించారు. పశ్చిమ బెంగాల్ లో ఇప్పటి వరకూ 10,94,802 కరోనా కేసులు నమోదయ్యాయి.