తెలంగాణ మంత్రి మల్లారెడ్డి మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్ కేసర్ లో జరిగిన రెడ్డి సింహగర్జన సభకు హాజరయ్యారు. ఆ కార్యక్రమంలో ఆయనకు నిరసన సెగ తగిలింది. ఆయన ప్రసంగిస్తుండగా, కొందరు వ్యక్తులు ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆయన ప్రసంగాన్ని అడ్డుకున్నారు. వారు ఏమాత్రం శాంతించకపోవడంతో మంత్రి మల్లారెడ్డి తన ప్రసంగాన్ని ఆపేశారు. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న పనులను మల్లారెడ్డి ప్రశంసిస్తూ ఉండగా.. కొందరు ఎదురుతిరిగారు. నిరసనకారులు రెచ్చిపోవడంతో, ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయేందుకు ప్రయత్నించారు. కొంత మంది నిరసనకారులు మల్లారెడ్డి కాన్వాయ్ వెంట పరుగులు తీశారు. చేతికందిన కుర్చీలు, మంచినీళ్ల సీసాలు కాన్వాయ్ పై విసురుతూ ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టించారు.
తనపై దాడి వెనక తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్‌రెడ్డి కుట్ర ఉందని మంత్రి మల్లారెడ్డి ఆరోపించారు. రేవంత్‌రెడ్డి చేస్తున్న ప్రజా వ్యతిరేక చర్యలను ప్రశ్నిస్తున్నాననే అతడి అనుచరుల ద్వారా దాడిచేయించాడని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు. తాను ఇలాంటి వాటికి భయపడే రకం కాదన్నారు. రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని మేనిఫెస్టోలో టీఆర్ఎస్ హామీ ఇచ్చిందని, అయితే కరోనా కారణంగా కొంత ఆలస్యమైందని అన్నారు. ఇదే విషయాన్ని తాను చెబుతుండగా తనకు వ్యతిరేకంగా నినాదాలు చేసి దాడి చేశారని మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.