More

    తనువు తాకట్టుపెడుతున్న తల్లులు.. సెక్స్ వర్కర్లుగా శ్రీలంక మహిళలు..!

    చేయడానికి ఉద్యోగం లేదు.. తినడానికి తిండి లేదు.. చేతిలో చిల్లి గవ్వ లేదు.. ఏది కొనాలన్నా ధరల మోత.. పిల్లలకు పాలు దొరకని పరిస్థితి.. పెద్దలకు తిండి కరువైన దుస్థితి. బతుకు భారంగా మారి శరీరాలను అమ్మకుంటున్నారు. రోజు గడవడమే కష్టంగా మారడంతో శ్రీలంక మహిళలు సెక్స్ వర్కర్లుగా మారుతున్నారు.

    ద్వీప దేశం శ్రీలంకలో ఎటు చూసినా కన్పిస్తోన్న దుర్భర పరిస్థితులివే.. ఇలాంటి నిస్సహాయ స్థితిలో శ్రీలంక మహిళలు పొట్టకూటి కోసం సెక్స్‌ వర్కర్లుగా మారుతున్నారు. పిల్లల కడుపు నింపేందుకు మహిళలు తమ శరీరాలను అమ్ముకుంటున్నారు. ఆహారం, ఔషధాలకు డబ్బుల్లేక తమ దేహాలను తాకట్టుపెడుతున్నారు. అప్పులు, అధిక ధరలు, అడుగంటిపోయిన విదేశీ మారకపు నిల్వలతో శ్రీలంక ఆర్థికవ్యవస్థ సంక్షోభంలో పడిపోయింది. పెట్రోలు, డీజిల్ నిల్వలు దాదాపుగా అయిపోయాయి. మరోవైపు దేశ నాయకత్వం మీద ప్రజాగ్రహం తగ్గడంలేదు.

    ఒక్క పూట తిండి కూడా శ్రీలంక ప్రజలకు కష్టంగా మారుతోంది. స్వచ్ఛంద సంస్థలు, చర్చిలు ఏర్పాటు చేసిన అన్నదాన శిబిరాల వద్ద చాలా మంది ప్రజలు బారులు తీరుతున్నారు. బ్రెడ్ కొనడానికి కూడా డబ్బులు లేవు. పిల్లలకు అప్పుడప్పుడు పాలు, అన్నం దొరుకుతాయి. కానీ కూరగాయలు కొనడం మాత్రం సాధారణ ప్రజలకు శక్తికి మించిన పనిగా మారింది. ప్రజలు డబ్బులు లేక సరుకులు, కూరగాయలు కొనలేకపోతున్నారు. రోజుకు ఒకటి లేదా రెండు సార్లు మాత్రమే తింటున్నారు. పోషకాలు బాగా ఉండే మాంసం వంటి వాటిని తీసుకోవడం మానేశారు. ఇక లంకలోని ఆసుపత్రులు కూడా దాదాపు విరాళాల మీదే నడుస్తున్నాయి. తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోన్న ద్వీపదేశం శ్రీలంకలో దాదాపు అన్ని రంగాలు కుదేలయ్యాయి. దీంతో లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారు. ముఖ్యంగా జౌళి పరిశ్రమ కొనుగోళ్లు లేక వెలవెలబోయింది. దీంతో ఈ రంగంలో పనిచేసే వేలాది మంది మహిళలు ఉపాధి కోల్పోవడంతో ప్రత్యామ్నాయ అవకాశాలను వెతుక్కుంటున్నారు. కానీ ఎక్కడా.. ఉపాధి లభించక వేశ్యల్లా మారుతున్నారు.

    శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తరువాత టెక్స్ టైల్స్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. దీంట్లో పనిచేస్తున్న మహిళలు ప్రత్యామ్నాయ పనులు లేకపోవడంతో ఇళ్లు గడిచేందుకు శరీరాన్ని అమ్ముకుంటున్నారు. ఈ ఆర్థిక సంక్షోభ సమయంలో ఉద్యోగాలు కోల్పోయామని.. ఈ సమయంలో సెక్క్ వర్క్ దిక్కవుతుందని కొంతమంది మహిళలు చెబుతున్నారు. టెక్స్ టైల్స్ లో పనిచేసే సమయంలో నెలవారీ జీతం రూ. 28,000 వేల నుంచి గరిష్టంగా రూ. 35,000 వేల వరకు ఉండేదని.. ప్రస్తుతం సెక్క్ వర్క్ వల్ల రోజుకు రూ. 15,000 సంపాదించుకుంటున్నామని మహిళలు చెప్తున్నారు. ఆర్థిక సంక్షోభం వల్ల భారత్, బంగ్లాదేశ్ లకు శ్రీలంక 10-20 శాతం ఆర్డర్లను కోల్పోతున్నట్లు అక్కడి అపెరెల్ అసోసియేషన్ వెల్లడించింది.

    ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు..సెక్స్‌ వర్కర్లుగా మారుతున్న మహిళల సంఖ్య 30 శాతం పెరిగిందంటే అక్కడి పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ముఖ్యంగా కొలంబో ఇండస్ట్రియల్‌ జోన్‌కు సమీపంలో ఈ తాత్కాలిక సెక్స్‌ వర్కర్లు ఇటీవల కాలంలో విపరీతంగా పెరిగారు. ఈ వేశ్యాగృహాలకు పోలీసుల సహకారం కూడా ఉన్నట్లు తెలుస్తోంది. డబ్బుకు బదులు దుకాణాదారులతో సంబంధాలను పెట్టుకుంటున్నారు. చివరకు పోలీసులతో కూడా ఒళ్లు అమ్ముకోవాల్సి వస్తోందని అక్కడి మహిళలు వాపోతున్నారు. ఇంధనం, ఆహార, ఔషధాల కొరత మహిళలను ఈ తీవ్ర పరిస్థితుల్లోకి నెట్టేసింది. పిల్లలు, కుటుంబాన్ని పోషించాల్సిన బాధ్యత ఉన్న మహిళలు ఎక్కువగా ఈ వృత్తిలోకి మారుతున్నారు. ఆహారం, మందులకు డబ్బుల్లేక స్థానిక దుకాణదారులకు బలవంతంగా తమ శరీరాలను అప్పగించి.. వాటిని కొనుక్కునే పరిస్థితికి దిగజారడం బాధాకర పరిణామం.

    spot_img

    Trending Stories

    Related Stories