చేతిలో పెన్నూ పేపరు ఉంది కదా అని.. ఇకపై ఇష్టమొచ్చింది రాసేస్తే కుదరుదు. మైకులు, కెమెరాలు ఉన్నాయి కదా అని.. తాము చూపించిందే నిజమని నమ్మించే ప్రయత్నం చేసినా అంతేసంగతులు. కుహనావాద రాజకీయ పార్టీలు, దేశవిద్రోహ శక్తులు విసిరే ఎంగిలి మెతుకుల కోసం.. తప్పుడు వార్తలను వడ్డిస్తే.. నడ్డి విరిగే రోజులివి. పరమ పవిత్రమైన పత్రికా స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తే న్యాయస్థానాలు చూస్తూ ఊరుకోవు. నిబంధనలు పాటించకుండా డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ పై వెర్రివెతలు వేస్తున్న.. కొన్ని కుహనా లెఫ్ట్ లిబరల్ మీడియా హౌజ్ లకు తాజాగా ఢిల్లీ హైకోర్టు దిమ్మదిరేగా షాక్ ఇచ్చింది.
డిజిటల్ మీడియాలో నకిలీ వార్తలను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం ఇటీవల కొత్త ఐటీ నిబంధనలను తీసుకొచ్చింది. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 పేరుతో మార్గదర్శకాలు రూపొందించింది. దేశంలో ప్రతి డిజిటల్ మీడియా సంస్థ.. ఈ నిబంధనలు అనుసరించి పత్రికా స్వేచ్ఛను సరైన మార్గంలో వాడుకోవాల్సి వుంటుంది. కానీ, కొన్ని కుహనా లెఫ్ట్ లిబరల్ డిజిటల్ మీడియా హౌజ్ లు దారి తప్పి వ్యవరిస్తున్నాయి. ఈ క్రమంలో తమ పప్పులు ఉడకపోయేసరికి ఐటీ కొత్త మార్గదర్శకాలపై స్టే విధించాలంటూ కోర్టుకెక్కాయి. అయితే, స్టే విధించడం కుదరదని న్యాయస్థానం తేల్చి చెప్పేసింది.
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రూల్స్ 2021 కు సంబంధించిన ఇంటర్మీడియరీ గైడ్ లైన్స్ అండ్ డిజిటల్ మీడియా ఎథిక్స్ కోడ్ ను పాటించాలంటూ.. ది వైర్, క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెట్, ఆల్ట్ న్యూస్ మాతృసంస్థ ప్రావ్డా మీడియా ఫౌండేషన్, ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజం సంస్థలకు.. కేంద్రం ఇటీవల నోటీసులు జారీ చేసింది. నిబంధనలు పాటించకుంటే ఆయా సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ నేపథ్యంలో కొత్త ఐటీ రూల్స్ పై స్టే ఇవ్వాలంటూ.. క్వింట్ డిజిటల్ మీడియా లిమిటెడ్ డైరెక్టర్ రీతూ కపూర్,.. ది వైర్ మాతృసంస్థ ఫౌండేషన్ ఫర్ ఇండిపెండెంట్ జర్నలిజమ్.. ఆల్ట్ న్యూస్ మాతృ సంస్థ ప్రావ్డా మీడియా ఫౌండేషన్ ఇటీవల ఢిల్లీ హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశాయి. పిటిషనర్ల వాదనలు విన్న జస్టిస్ సి. హరి శంకర్, జస్టిస్ సుబ్రహ్మణియం ప్రసాద్‌లతో కూడిన ధర్మాసనం.. నోటిఫికేషన్ అమలు చేయాలని మాత్రమే కేంద్రం నోటీసు ఇచ్చిందని.. అందువల్ల నిబంధనల అమలుపై స్టే ఇవ్వడం కుదరదని తేల్చి చెప్పేసింది.
వాస్తవానికి ఈ కేసు ఆగస్ట్ 4న విచారణకు రావాల్సివుంది. అయితే, డిజిటల్ మీడియా మార్గదర్శకాలను పాటించకుంటే, కఠిన చర్యలు తప్పవని కేంద్రం హెచ్చరించింది. అయితే, కొత్త నిబంధనలను తప్పుబడుతూ ఫేక్ న్యూస్ బ్యాచ్ కోర్టుకెక్కింది. కొత్త నిబంధనల నుంచి తమకు ఉపశమనం లభిస్తుందన్న ఆశతో.. పిటిషనర్లు ప్రస్తుతం వేసవి విరామంలో వున్న ఢిల్లీ హైకోర్టును ఆగమేఘాలమీద ఆశ్రయించారు. అయితే, స్టే విధించడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడంతో ఈ మీడియా సంస్థలకు దిమ్మదిరిగే షాక్ తగలింది.
నకిలీ వార్తలు, బెదిరింపు వార్తలను అరికట్టేందుకు కేంద్రం ఇటీవల కొత్త మార్గదర్శకాలను రూపొందించింది. కొత్త నిబంధనల ప్రకారం.. వార్త నిజమైందని ఒకటికి రెండుసార్లు నిర్ధారణ చేసుకున్న తర్వాతే ప్రసారం చేయాల్సివుంటుంది. అలా కాకుండా తప్పుడు వార్తలను ప్రసారం చేస్తే కఠిన చర్యలు ఎదుర్కోవాల్సివుంటుంది. ముఖ్యంగా పారదర్శకతకు మారుపేరంటూ డబ్బాలు కొట్టుకునే.. విదేశీ వార్తాసంస్థలు ఈ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సివుంటుంది.
ముఖ్యంగా మహిళ హక్కులను పరిరక్షించేలా కొత్త నిబంధనలు రూపొందించింది కేంద్ర ప్రభుత్వం. ఈ నిబంధనల ప్రకారం.. మహిళల వ్యక్తిగత స్వేచ్ఛకు, గౌరవానికి భంగం వాటిల్లేలా డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వార్తలు ప్రసారం చేయకూడదు. పాక్షికంగా లేదా పూర్తిగా నగ్నత్వాన్ని ప్రదర్శించినా.. లైంగిక చర్యలకు సంబంధించిన కంటెంట్ ను ప్రసారం చేసినా.. లేదా మార్ఫింగ్ చేసిన చిత్రాలను ప్రసారం చేసినా.. ఫిర్యాదు అందిన 24 గంటల్లో వాటిని తొలగించాలి. లేదంటే కొత్త నిబంధనల ప్రకారం కఠిన శిక్షలు తప్పవు.
ఇకపై ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో ప్రసారం చేసే కంటెంట్ ను సైతం వయసులవారీగా వర్గీకరించి ప్రదర్శించాల్సివుంటుంది. యూనివర్సల్ రేటింగ్,.. U/A సెవెన్ ప్లస్,.. U/A థర్టీన్ ప్లస్,.. U/A సిక్స్ టీన్ ప్లస్ తో పాటు.. 18 ఏళ్లు పైబడినవారికి సంబంధించిన కంటెంట్ కు అడల్ట్ రేటింగ్ ఇవ్వాలి. వీడియో ప్రసారం అవుతున్నప్పుడు ఈ రేటింగ్ లు కచ్చితంగా ప్రదర్శించబడాలి. అంతేకాదు, 13 ఏళ్లకు పైబడినవారి కోసం తల్లిదండ్రుల చేతుల్లోనే యాక్సెస్ కంట్రోల్ ఉండేలా సాంకేతికతను రూపొందించుకోవాలి. అంతేకాదు, ఓటీటీలు, సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ నిబంధనలకు కట్టుబడి ఉన్నాయని నిర్ధారించుకోవడానికి.. అదనంగా మూడంచెల నియంత్రణ వ్యవస్థను అనుసరించాలి.
ఈ మూడంచెల వ్యవస్థ స్వీయ నియంత్రణ యంత్రాంగాన్ని కలిగివుంటుంది. దీనికింద ఫిర్యాదులను పరిష్కరించే వ్యవస్థ కూడా ఏర్పాటు చేయబడుతుంది. వీక్షకుడు ఫిర్యాదు చేసుకునేలా.. ఫిర్యాదుల పరిష్కార అధికారి వివరాలను కూడా ప్రదర్శించాల్సివుంటుంది. ఇక రెండవ శ్రేణి లేదా సెల్ఫ్ రెగ్యులేటరీ బాడీ.. ఒక సుప్రీం కోర్టు రిటైర్డ్ జడ్జి లేదా హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో పనిచేస్తుంది. వీక్షకుడు తన ఫిర్యాదును తగినవిధంగా పరిష్కరించలేదని విశ్వసిస్తే.. సెల్ఫ్ రెగ్యులేటర్ బాడీకి అప్పీల్ చేసుకోవచ్చు. ఈ మూడో అంచెలో ఇంటర్ మినిస్టీరియల్ కమిటీ పనిచేస్తుంది. ఈ కమిటీకి సమస్యను సూమోటోగా తీసుకునే అధికారం వుంటుంది. అంతేకాదు, నిబంధనలకు విరుద్ధంగా వుంటే అలాంటి కంటెంట్ ను బ్లాక్ చేసేలా సిఫార్సు చేస్తుంది. ఈ కమిటీలో కేంద్ర సమాచార ప్రసార శాఖ, హోం, న్యాయ శాఖ, విదేశీ వ్యవహారాలు, రక్షణ, మహిళా శిశు సంక్షేమ శాఖల నేతృత్వంలో పనిచేస్తుంది. అంటే, ఫేక్ న్యూస్ ప్రసారం చేసే ఎలాంటి డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ అయినా.. ఈ మూడంచెల వ్యవస్థ నుంచి తప్పించుకోలేవన్నమాట.
దేశంలో నకిలీ వార్తలను ప్రసారం చేసే డిజిటల్ మీడియా సంస్థలు చాలా పెరిగిపోయాయి. ఈ జాబితాలో కుహనా లెఫ్ట్ లిబరల్ మీడియా సంస్థలే ఎక్కువగా వున్నాయి. వాళ్ల ఎజెండాను అనుసరించి నకిలీ వార్తలను ప్రసారం చేయడమే పనిగా పెట్టుకున్నారు. కొత్త నిబంధనలపై స్టే విధించాలంటూ కోర్టుకెక్కిన ది వైర్, ది క్వింట్, ఆల్ట్ న్యూస్ సంస్థలు ఈ కోవకు చెందినవే. ఏదేమైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు.. డిజిటల్ మీడియా వేదికగా వెర్రివెతలు వేస్తున్న ఫేక్ మీడియా కోరలు పీకేస్తాయని ఆశిద్దాం.