దిగొచ్చిన కంపెనీ షోరూమ్.. రైతు ఇంటికే వాహనం

0
918

కర్ణాటకలోని తుమకూరు జిల్లా రమణపాళ్యకు చెందిన కెంపెగౌడ అనే రైతును కార్ షోరూమ్‌లో సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ అవమానించారు. దీంతో డబ్బుల కట్టలు తెచ్చి షోరూమ్‌ సిబ్బంది ముందు పెట్టాడు. ‘అడిగిన డబ్బు కట్టా. తక్షణం కారు డెలివరీ చేయండి’ అంటూ డిమాండ్‌ చేశాడు ఆ రైతు. కెంపెగౌడ అనే రైతు తన మిత్రులతో కలిసి ఓ కార్ల షోరూమ్‌కు వెళ్లాడు. బొలేరో పికప్‌ వెహికిల్‌ కావాలని అడిగాడు. అతడి వేషభాషలను, వెంటనున్న మిత్రబృందాన్ని చూసిన షోరూమ్‌ సిబ్బంది వాళ్లను తక్కువగా అంచనా వేసి.. సరిగా స్పందించలేదు. అరగంటలో కెంపెగౌడ తిరిగి వచ్చి.. సేల్స్‌మన్‌ టేబుల్‌ ముందు అవసరమైన డబ్బును పెట్టాడు. కారు డెలివరీ చేయాలని కోరాడు. షోరూమ్‌ సిబ్బంది వెంటనే డెలివరీ ఇవ్వలేకపోతున్నట్టు చెప్పారు. కెంపెగౌడ మిత్ర బృందం దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న ఆనంద్ మహీంద్రా అసహనం వ్యక్తం చేశారు. ఓ వ్యక్తి గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘‘మా కమ్యూనిటీలోని వారు, భాగస్వాముల అభివృద్ధి కోసం పనిచేయడమే మహీంద్ర సంస్థ ప్రధాన లక్ష్యం. వ్యక్తుల ఆత్మగౌరవాన్ని కాపాడడం మాకు ఎంతో ముఖ్యంగా. ఈ సిద్ధాంతాలను రాజీ లేకుండా అమలు చేస్తాం. ఎవరైనా వాటిని మీరినట్టు తెలిస్తే అత్యంత వేగంగా చర్యలు తీసుకుంటాం’’ అని ఆయన పేర్కొన్నారు. మహీంద్రా సంస్థ సీఈవో విజయ్ నక్రా ఈ ఘటనపై స్పందించారు. తమ వినియోగదారుల గౌరవాన్ని కాపాడడం తమ బాధ్యతని అన్నారు. డీలర్లు వినియోగదారుల గౌరవానికి భంగం కలగకుండా వ్యవహరించాల్సిన అవసరం ఉందన్నారు. కర్ణాటక ఘటనపై దర్యాప్తు చేస్తున్నామని, తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కస్టమర్లను గౌరవించే విషయంలో ఫ్రంట్ లైన్ సిబ్బందికి కౌన్సిలింగ్, శిక్షణనిస్తామని తెలిపారు.

మహీంద్రా షోరూం వర్గాలు మూడ్రోజుల్లో వాహనం అందజేస్తామని, ఈ రైతుకు తమ ప్రవర్తన పట్ల క్షమాపణ చెప్పాయి. షోరూం వర్గాలు మహీంద్రా బొలేరో వాహనాన్ని రైతు కెంపెగౌడ ఇంటి వద్దకు వెళ్లి డెలివరీ ఇచ్చాయి. ఆయనకు మరోసారి క్షమాపణలు చెప్పారు. దీనిపై ఆ రైతు ఎంతో సంతోషం వ్యక్తం చేశాడు. తనకు జరిగిన అవమానం మరెవరికీ జరగకూడదని కోరుకుంటున్నానని.. వాహనాన్ని సకాలంలోనే డెలివరీ ఇచ్చారని వెల్లడించాడు. ఈ వ్యవహారంపై మహీంద్రా సంస్థ అధినేత ఆనంద్ మహీంద్రా కూడా స్పందించారు. రైతు కెంపెగౌడను తమ మహీంద్రా కుటుంబంలోకి సాదరంగా ఆహ్వానించారు. ఏది ఏమైనా కానీ.. ఎవరినీ తక్కువగా అంచనా వేయకూడదని ఈ ఘటన తెలియజేస్తుంది.