More

  భారత నౌకాదళంలో ‘మహీంద్ర’జాలం..!

  భారత పారిశ్రామిక రంగాన్ని ప్రపంచ చోదకశక్తిగా మలిచే సత్సంకల్పంతో.. ప్రధాని మోదీ ప్రారంభించిన ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమం అప్రతిహతంగా దూసుకుపోతోంది. గుండు సూది నుంచి విమానం వరకు ఏ విషయంలోనూ విదేశాలపై ఆధారపడకుండా.. భారత్‎లోనే ఉత్పత్తుల తయారీకి మోదీ ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఆత్మనిర్భర్ భారత్‎ ‘మేకిన్ ఇండియా’ మరింత ఊతమిస్తోంది. ఎలక్ట్రానిక్, హార్డ్‎వేర్, ఆటోమొబైల్.. ఇలా అన్ని రంగాల్లో భారత్ స్వతంత్ర శక్తిగా అవతరిస్తోంది. ప్రయివేటు రంగాల్లోనే కాదు.. ప్రభుత్వరంగ వ్యవస్థలకు కూడా ‘మేకిన్ ఇండియా’ ఊతమిస్తోంది. ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యంతో రక్షణరంగం మరింత బలోపేతమవుతోంది.

  తాజాగా భారతీయ ఆటోమొబైల్ దిగ్గజం మహింద్రా అండ్ మహింద్రా లిమిటెడ్‎ అనుబంధ సంస్థ.. మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్‎తో దాదాపు 1,350 కోట్ల విలువైన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందంలో భాగంగా.. భారత నౌకదళానికి చెందిన ఆధునిక యుద్ధనౌకల కోసం ‘ఇంటిగ్రేటెడ్ యాంటీ-సబ్‌మెరైన్ వార్‌ఫేర్ డిఫెన్స్ సూట్’ను తయారు చేయనుంది. ఈ అత్యాధునిక రక్షణ వ్యవస్థతో భారత నావికాదళంలోని ‘యాంటీ సబ్ మెరైన్ సిస్టమ్’ మరింత బలోపేతం కానుంది. నూతన IADS టెక్నాలజీ శత్రు జలాంతర్గాములను, టార్పెడోల గుర్తించి ధ్వంసం చేయడంలో ఉపయోగపడుతుంది. అంతేకాదు, శత్రు జలాంతర్గాముల నుంచి దూసుకొచ్చి టార్పెడోలను దారిమళ్లిస్తుంది. ఈ కొత్త సాంకేతిక పరిజ్ఞానం.. సముద్ర గర్భంలో జరిగే యుద్ధాల్లో కీలకపాత్ర పోషిస్తుంది. భారత నౌకాదళానికి చెందిన విలువైన ఆస్తులను కాపాడుతుంది. రక్షణశాఖతో ఒప్పందం పట్ల మహీంద్రా అండ్ మహీంద్రా హర్షం వ్యక్తం చేసింది. మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ చైర్మన్ ఎస్.పి. శుక్ల ‘ఆత్మనిర్భర్ భారత్’ చొరవను కొనియాడారు. దీనిని భారత నావికాదళంతో ఓ ప్రయివేట్ కంపెనీ కుదుర్చుకున్న ప్రధాన ఒప్పందంగా అభివర్ణించారు. ఈ ఒప్పందం ‘ఆత్మనిర్భర్ భారత్’ ఆశయాన్ని విజయవంతం చేస్తుందన్నారు. రక్షణరంగంలో ఇప్పటికే పలు ప్రయివేట్ కంపెనీలు పాలుపంచుకుంటున్నాయి. ‘ఎకనామిక్ ఎక్స్‎ప్లోజివ్స్ లిమిటెడ్’ అనే మరో స్వదేశీ ప్రయివేట్ సంస్థ.. కేంద్ర ప్రభుత్వ నమ్మకాన్ని నిలబెట్టింది. భారతదేశంలో తొలిసారిగా ‘మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్’లను స్వదేశీయంగా తయారు చేసింది. ఇటీవలే మొదటి బ్యాచ్‎ను రక్షణశాఖకు అందించింది. DRDOకు చెందిన ‘టెర్మినల్ బాలిస్టిక్ రీసెర్చ్ ల్యాబొరేటరీ’ టెక్నాలజీని బదిలీ చేసిన తర్వాత హ్యాండ్ గ్రెనేడ్ తయారీ సాధ్యమైంది.

  అతి తక్కువకాలంలోనే ‘మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్’లను అందించిన ‘ఎకనామిక్ ఎక్స్‎ప్లోజివ్స్ లిమిటెడ్’ను రక్షణశాఖామంత్రి రాజ్‎నాథ్ సింగ్ ప్రశంసించారు. అగ్రిమెంట్ తర్వాత కేవలం ఐదు నెలల్లోనే, అది కూడా దేశంలో కొవిడ్ సెకండ్ వేవ్ విజృంభిస్తున్న సమయంలో.. లక్ష గ్రెనేడ్‎లను తయారు చేయడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రయివేట్ సంస్థ తయారు చేసిన తొలి గ్రెనేడ్లు ఇవేనని.. రక్షణరంగంలో ప్రభుత్వ-ప్రయివేట్ భాగస్వామ్యానికి ఇదొక గొప్ప ఉదాహరణ అని పేర్కొన్నారు. అటు ‘మల్టీమోడ్ హ్యాండ్ గ్రెనేడ్’ల తయారీలో EEL సాధించిన విజయం.. రక్షణరంగ నిపుణులను విశేషంగా ఆకర్షించింది. సైనిక సామాగ్రిని అభివృద్ధి చేసే.. విదేశీ ప్రయివేట్ సంస్థలను సైతం ఆకట్టుకుంది. దీంతో ప్రయివేట్ రంగంలో ఈ ఘనత సాధించిన ఫ్రాన్స్‎కు చెందిన డసో.. యూఎస్‎కు చెందిన సరసన చేరింది EEL.

  భారత్‎ను ప్రపంచ తయారీ కేంద్రంగా మార్చి.. ఆర్థికశక్తిగా మలచాలన్న సదుద్దేశంతో.. నరేంద్ర మోదీ తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే.. 2014 సెప్టెంబర్‎లో ‘మేకిన్ ఇండియా’కు శ్రీకారం చుట్టారు. అప్పటిదాకా వాడుకలో లేని నియమ, నిబంధనల్లో మార్పులు చేసి.. తయారీ రంగాన్ని ప్రోత్సహించారు. తయారీదారులు తమ యూనిట్లను నెలకొల్పడానికి మార్గం సుగమం చేశారు. రైల్వేల నుంచి రక్షణరంగం వరకు వివిధ రంగాలను క్రమబద్ధీకరించారు. వ్యాపారాన్ని మరింత సులభతరం చేయడం కోసం.. ఆయారంగాల్లో ప్రాథమిక నిబంధనలను రద్దు చేశారు. ముఖ్యంగా ‘ఆత్మనిర్భర్ భారత్’ ప్రచారం రక్షణరంగాన్ని మరింత బలోపేతం చేసింది. ఈ రంగంలో పూర్తిగా కాకపోయినా కొంతవరకు స్వయం సమృద్ధి సాధించింది. రక్షణరంగ పెట్టుబడుల విషయంలో ప్రపంచంలో మూడో అతిపెద్ద దేశంగా అవతరించింది భారత్. అంతేకాదు, 2016-2020 మధ్య ప్రపంచ ఆయుధాల దిగుమతుల్లో 9.5 శాతం వాటాతో రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది.

  రక్షణరంగంలో ‘మేకిన్ ఇండియా’ను బలోపేతం చేసేవిధంగా.. రక్షణమంత్రి రాజ్‎నాథ్ సింగ్ వేగంగా అడుగులు వేస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో దేశీయ తయారీ రంగం నుంచి కొనుగోళ్ల కోసం.. 2021-22 కోసం కేపిటల్ ఎక్విజిషన్ బడ్జెట్‎ కింద.. రక్షణరంగ ఆధునికీకరణ నిధుల్లో 64 శాతం కేటాయించారు. ఇది 70 వేల కోట్ల కంటే ఎక్కువ. రక్షణరంగంలో ‘మేకిన్ ఇండియా’ను ప్రోత్సహించేందుకు.. స్వదేశీ రూపకల్పన, అభివృద్ధి, తయారీ కేటగిరీలకు కేంద్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోంది. ఇందులో భాగంగా కొత్తగా రక్షణ పారిశ్రామిక లైసెన్స్‎లు కోరుకునే కంపెనీల కోసం.. రక్షణరంగంలో FDIలను 74 శాతం పెంచింది. వందశాతం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకునే వెసులుబాటు కల్పించింది. దీంతో రక్షణరంగ తయారీలో స్వదేశీ ప్రయివేట్ దిగ్గజ సంస్థలు తమ సత్తా చాటుతున్నాయి.

  ఇప్పటికే అనేక కంపెనీలు రక్షణ ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. 83 లైట్ కొంబాట్ ఎయిర్‎క్రాఫ్ట్ తేజస్‎లను భారత్ కొనుగోలు చేస్తోంది. ట్రాన్స్‎పోర్ట్ ఎయిర్ క్రాఫ్ట్ C-295 తయారీ కోసం.. టాటా ఎయిర్‎బస్ సంస్థతో ఒప్పందం చివరిదశలో వుంది. అంతేకాదు, AK-203 రైఫిళ్లను స్వదేశీయంగా తయారు చేస్తోంది. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ బోర్డ్‎తో పాటు, రష్యాకు చెందిన కలష్నికోవ్ కన్సర్న్, రొసోబోరోన్ ఎక్స్‎పోర్ట్ వంటి రక్షణరంగ ఉత్పత్తుల సంస్థలు కలిసి.. AK-203 రైఫిళ్లను దేశీయంగా తయారు చేస్తోంది భారత్. రక్షణ ఉత్పత్తులను స్వదేశీయంగా తయారుచేయడమే కాదు.. గత ప్రభుత్వాలు చేయని విధంగా ఇతర దేశాలకు ఎగుమతులు కూడా చేస్తోంది. గతేదాడి డిఫెన్స్ ఎక్స్‎పో లో మాట్లాడిన ప్రధాని మోదీ.. 2014లో రక్షణరంగ ఎగుమతులు 2 వేల కోట్లు మాత్రమేనని.. కానీ, గత రెండేళ్ల కాలంలోనే 17 వేల కోట్ల రక్షణరంగ ఉత్పత్తులను ఎగుమతి చేసినట్టు తెలిపారు. అంతేకాదు, రానున్న ఐదేళ్లలో 35 వేల కోట్ల ఎగుమతులను లక్ష్యంగా పెట్టుకున్నట్టు ప్రకటించారు. ఇది భారత్ రక్షణరంగంలో సాధించిన స్వయం సమృద్ధికి అద్దం పడుతోంది. రక్షణరంగంలో రెడ్ టేపిజాన్ని పూర్తిగా అంతమొందించింది. తద్వారా స్వదేశీ కంపెనీలైన ‘మహీంద్రా డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్’, ‘ఎకనామిక్ ఎక్స్‎ప్లోజివ్స్ లిమిటెడ్’ వంటి స్వదేశీ సంస్థలు రక్షణ ఉత్పత్తుల్లో తమ సత్తాచాటుతున్నాయి. దేశ నిర్మాణంలో పాలుపంచుకుంటున్నాయి.

  Trending Stories

  Related Stories