ఈ ఏడాది జరగబోయే టీ20 ప్రపంచకప్ కు భారత జట్టును బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 15 మందితో జట్టును వెల్లడించింది. శిఖర్ ధవన్‌కు చోటు దక్కకపోవడం కాస్త ఆశ్చర్యం కలిగించింది. ఇక ఐపీఎల్‌లో సత్తా చాటిన సూర్యకుమార్ యాదవ్, వరుణ్ చక్రవర్తి, ఇషాన్ కిషన్‌లకు టీ20 జట్టులో స్థానం దక్కింది. భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రాను పేసర్లుగా ఎంపిక చేసింది. సెప్టెంబరు 10 కల్లా టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనే 15 మంది సభ్యుల వివరాలను తెలపాలనే ఐసీసీ నిబంధన ప్రకారం బీసీసీఐ భారత జట్టును వెల్లడించింది. అక్టోబరు 10 వరకూ జట్టులో మార్పులు చేసుకునే అవకాశం ఉంది. ఆసక్తికరమైన అంశం ఏమిటంటే భారత జట్టుకు భారత మాజీ సారధి మహేంద్ర సింగ్ ధోనీ మెంటార్‌గా వ్యవహరించనున్నట్లు బీసీసీఐ తెలిపింది. విరాట్ కోహ్లీ కెప్టెన్ గా వ్యవహరించనుండగా.. రోహిత్ శర్మ వైస్ కెప్టెన్ గా ఉండనున్నాడు.
భారత జట్టు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషభ్ పంత్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహమ్మద్ షమీ. స్టాండ్ బై ఆటగాళ్లుగా శ్రేయాస్ అయ్యర్, శార్దూల్ ఠాకూర్, దీపక్ చాహర్ ఉండనున్నారు. శ్రీలంక సిరీస్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ధావన్ ను ఎందుకు తీసుకోలేదో బీసీసీఐ వెల్లడించలేదు. కృనాల్ పాండ్యాకు కూడా జట్టులో చోటు దక్కలేదు.
టీ20 ప్రపంచకప్ రౌండ్ 1 గ్రూప్ బీలో ఆతిథ్య ఒమన్, పపువా న్యూగినియాల మధ్య మ్యాచ్‌తో అక్టోబర్ 17న మెగా ఈవెంట్ ప్రారంభం కానుంది. రౌండ్ 1లో భాగంగా గ్రూప్ ఏ లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నబీబియా జట్లు ఉన్నాయి. గ్రూప్ బి లో బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఒమన్ జట్లు ఉన్నాయి. క్వాలిఫయర్స్ మ్యాచ్‌ల అనంతరం ఒక్కో గ్రూప్ నుంచి టాప్ లో నిలిచిన రెండేసి జట్లు టీ20 వరల్డ్ కప్ రౌండ్-2కు క్వాలిఫై అవుతాయి. భారత్ లో గతేడాది జరగాల్సిన ఈ టోర్నమెంట్ కరోనా కారణంగా వాయిదా పడింది. యూఏఈ, ఒమన్ వేదికగా ఈ ఏడాది అక్టోబర్ 17వ తేదీ నుంచి నవంబర్ 14వరకు టీ20 ప్రపంచకప్ జరగనుంది. ఫైనల్ వేదికగా దుబాయ్‌ని నిర్ణయించారు. రౌండ్-2 లో భాగంగా అక్టోబర్ 23న మ్యాచ్ ఆస్ట్రేలియా-సౌత్ ఆఫ్రికా మధ్య అబుదాబీ వేదికగా మొదటి మ్యాచ్ మొదలు కానుంది. ఇక క్రికెట్ ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే భారత్-పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా జరగనుంది. సూపర్ 12లో గ్రూప్ 2లో ఉన్న భారత్.. అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో, అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్ఘనిస్తాన్ తో, నవంబర్ 5న బి1 క్వాలిఫయర్‌తో, నవంబర్ 8న ఏ1 క్వాలిఫయర్‌తో మ్యాచ్‌లు ఆడనుంది. నవంబర్ 10,11 తేదీల్లో సెమీ ఫైనల్స్, నవంబర్ 14వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది.