మహాత్మా గాంధీ ముని మనవరాలు ఆశిష్ లతా రామ్ గోబింద్ కు ఏడేళ్ల జైలు శిక్ష విధించడం సంచలనంగా మారింది. 56 సంవత్సరాల ఆశిష్ లతా రామ్ గోబింద్ ఓ భారతీయ వ్యాపారిని మోసం చేశారనే అభియోగాలు నమోదయ్యాయి. ఈ కేసును విచారించిన దక్షిణాఫ్రికా కోర్టు ఆశిష్ లతా రామ్ గోబింద్ మోసానికి పాల్పడ్డారని భావించి.. ఏడేళ్ల జైలు శిక్షను విధించింది. ఆశిష్ లతా రామ్ గోబింద్ ఎస్.ఆర్.మహారాజ్ అనే వ్యాపారవేత్తకు రూ.3.2 కోట్లు (62 లక్షల ర్యాండ్లు) మోసం చేసినట్లు డర్బన్ లోని వాణిజ్య నేరాల ప్రత్యేక కోర్టు తేల్చింది. వ్యాపారవేత్తను మోసం చేసి రూ.3.23 కోట్ల మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై ఆమెను దోషిగా తేల్చుతూ డర్బన్ కోర్టు సోమవారం తీర్పును ప్రకటించింది. కోర్టు తీర్పును, శిక్షను మరే కోర్టులోనూ అప్పీల్ చేసుకోకుండా ఆదేశాలివ్వడంతో ఆశిష్ లతా రామ్ గోబింద్ ఇక జైలు శిక్ష అనుభవించకతప్పదని తెలుస్తోంది.

భారత్ నుంచి వచ్చే ఓ కంటైన్‌మెంట్ కోసం ఇంపోర్ట్ అండ్ కస్టమ్స్ డ్యూటీస్ చెల్లించేందుకు మహరాజ్.. ఆమెకు అడ్వాన్స్‌గా రూ.3.23 కోట్లు ఇచ్చారు. అనంతరం దాని ద్వారా వచ్చే లాభాల్లో కొంత ఆయనకు లభిస్తుంది. అలాంటి కన్‌సైన్‌మెంటే లేదని.. నకిలీ బిల్లులు సృష్టించి ఆమె ఆయన్ను మోసం చేసినట్లు వెల్లడికావడంతో డర్బన్ కోర్టు ఈ తీర్పును వెలువరించింది. ఈ కేసు విచారణ 2015 నుంచి కొనసాగుతోంది. ఆశిప్ లతా ఈ కేసులో అరెస్ట్ అయ్యాక దక్షిణాఫ్రికా కరెన్సీ 50,000 ర్యాండ్లు పూచీకత్తుగా చెల్లించి బెయిల్‌పై విడుదల అయ్యారు. డబ్బును సొంతం చేసుకునేందుకు లతా రామ్ గోబింద్ భారత్ నుంచి మూడు కంటెయినర్ల లినెన్ కాటన్ వస్త్రం వచ్చినట్టు నకిలీ ధ్రువపత్రాలు, తప్పుడు ఇన్ వాయిస్ లను సృష్టించారని నేషనల్ ప్రాసిక్యూటింగ్ అథారిటీ (ఎన్పీఏ)కి చెందిన బ్రిగేడియర్ హాంగ్వానీ ములౌజీ కోర్టుకు తెలిపారు.

న్యూ ఆఫ్రికా అలయన్స్ ఫుట్ వేర్ డిస్ట్రిబ్యూటర్స్ డైరెక్టర్ అయిన ఎస్ఆర్ మహారాజ్ ను 2015 ఆగస్టులో లతా రామ్ గోబింద్ కలిశారు. మహారాజ్ సంస్థ వస్త్రాలు, లినెన్ వస్త్రాలు, పాదరక్షల దిగుమతితో పాటు వాటిని తయారు చేసి విక్రయిస్తుంటుంది. ఇతర సంస్థలకు లాభాల్లో వాటా ఆధారంగా పెట్టుబడి సాయం కూడా చేస్తుంటుంది. ఈ క్రమంలోనే దక్షిణాఫ్రికాలోని ఆసుపత్రి గ్రూప్ నెట్ కేర్ కోసం మూడు కంటెయినర్ల లినెన్ వస్త్రాన్ని సరఫరా చేస్తున్నట్టు నమ్మించారు. దిగుమతి రుసుం, కస్టమ్స్ సుంకం చెల్లించేందుకు తన దగ్గర డబ్బుల్లేవని, దానికోసం రూ.3.2 కోట్లు సాయం చేస్తే లాభాల్లో వాటా ఇస్తానని మహారాజ్ కు చెప్పారు. అందుకు పోర్టులో ఆగిపోయినట్టున్న మూడు తనవి కాని కంటెయినర్లను ఫొటోల్లో చూపించారు. సరుకు కొన్నట్టు తప్పుడు ఇన్ వాయిస్ చూపించారు. ఆ తర్వాత నెలకు నెట్ కేర్ ఇన్ వాయిస్ ను మహారాజ్ కు పంపించారు. దీంతో మహారాజ్ రూ.3.2 కోట్లు పంపించారు. డబ్బు ముట్టినట్టు ధ్రువీకరిస్తూ నెట్ కేర్ బ్యాంక్ పేమెంట్ వివరాలను ఆమె ఆయనకు పంపారు. ఆమె చూపించినవన్నీ తప్పుడు పత్రాలేనని గ్రహించిన మహారాజ్ తాను మోసపోయాననుకుని ఆమెపై కేసు పెట్టారు. కేసును విచారించిన డర్బన్ కోర్టు లతా రామ్ గోబింద్ ను దోషిగా తేల్చి.. ఏడేళ్ల శిక్షను ఖరారు చేసింది.

గాంధీజీ మనవరాలు, మానవ హక్కుల కార్యకర్త ఎలా గాంధీ కుమార్తె ఆశిష్ లతా రామ్ గోబింద్. ఎలా గాంధీ తన సేవలతో అంతర్జాతీయంగా గుర్తింపు పొందారు. ఇండియా, దక్షిణాఫ్రికాల నుంచి పలు సత్కారాలు, పురస్కారాలు సైతం అందుకున్నారు. దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ తన పదవీకాలంలో స్థాపించిన ఫీనిక్స్ సెటిల్ మెంట్ ను పునరుద్ధరించడంలో ఎలా గాంధీ, మేవా రామ్‌గోవింద్ కీలక పాత్ర పోషించారు. లతా గోబింద్ స్వచ్ఛంద కార్యక్రమాల్లోనూ ఆమె పాల్గొంటోంది. ఎన్జీవో ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ నాన్ వయొలెన్స్ లో భాగంగా పార్టిసిపేటివ్ డెవలప్ మెంట్ ఇనిషియేటివ్ అనే గ్రూపుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఆమె ఉన్నట్టు తెలుస్తోంది. అంత గొప్ప చరిత్ర కలిగి ఉన్న కుటుంబంలో ఉన్న ఆమె ఇలా మోసానికి పాల్పడుతుందని ఎవరూ ఊహించలేదు.
.jpg?K1dwcUJujpWpsu6wkVqpPe5oCppr9tXc&size=770:433)