మహారాష్ట్రపై వర్ష భీభత్సం.. 60 మందికి పైగా మృతి..!

0
681

మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో చాలా ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడుతూ ఉన్నాయి. ఈ ప్రమాదాల్లో 60 మందికి పైగా చనిపోయారని అధికారిక లెక్కలు చెబుతున్నాయి. భారీవర్షాల కారణంగా రాయగఢ్‌ జిల్లాలో మూడు చోట్ల కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డ్డాయి. ఈ ప్ర‌మాద ఘ‌ట‌న‌ల్లో ఇప్పటివరకు 36 మరణించగా పలువురు గల్లంతయ్యారు. రాయగడ్ జిల్లా తలాయి గ్రామంలో కొండచరియలు ఇళ్లపై పడ్డాయి. ఈ ఘటనలో 36 మంది చనిపోయారు. ఒకే చోట 32 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో చోట నుంచి మరో 4 మృతదేహాలను తీశారు. సతారా జిల్లాలోని మిర్గావ్ లో మరో 12 మంది బలయ్యారు. సతారాలోని అంబేగార్ లోనూ ఇలాంటి ఘటనే జరగడంతో పదుల సంఖ్యలో రాళ్ల కింద చిక్కుకున్నారు. ప్రస్తుతం వారందరినీ కాపాడే ప్రయత్నాలు చేస్తున్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

ఘటనా స్థలాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా కొల్హాపూర్‌ జిల్లాలోని 47 గ్రామాలకు సంబంధాలు తెగిపోయాయి. 965 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మ‌హారాష్ర్ట‌లో ఒక్క జులై నెల‌లోనే ఇంత‌గా భారీ వ‌ర్షాలు కురియ‌డం 40 ఏండ్ల‌లో ఇదే తొలిసారని అధికారులు తెలిపారు.

కొంకణ్, పశ్చిమ మహారాష్ట్రలోని అనేక జిల్లాల్లో నదులు, వాగులు ఉప్పొంగుతున్నాయి. జలాశయాలన్ని నిండిపోయాయి. రత్నగిరి, రాయ్‌గఢ్‌ జిల్లాల్లో దాదాపు నదులన్నీ ఉగ్రరూపం దాల్చాయి. అనేక గ్రామాలకు బాహ్యప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. మరోవైపు ముంబై – పుణే, ముంబై – నాసిక్‌ మార్గాలపై రైళ్ల రాకపోకలు స్తంభించాయి. రత్నగిరి జిల్లాలోని చిప్లూన్‌ తాలూకాతోపాటు కొల్హాపూర్‌లో జిల్లాలో పంచగంగా, వైశిష్ట, శివ నదుల వరదల కారణంగా ఇళ్లల్లోని నీరు చొరబడింది. వరదల్లో చిక్కుకున్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు స్థానిక యంత్రాంగంతోపాటు ఎన్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు, సైన్యం, నేవీ రంగంలోకి దిగాయి. ఇప్పటికే అనేక మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినప్పటికీ చాలా మంది సహాయం కోసం వేచిచూస్తున్నారు. చిప్లూన్‌ పట్టణం పూర్తిగా జలమయమైంది. పట్టణంలోని మార్కెట్‌తోపాటు అనేక ప్రాంతాల్లో మొదటి అంతస్తు వరకు నీళ్లు వచ్చేశాయి. సుమారు 12 అడుగుల నీరు చేరింది. దీంతో అనేక మంది టెర్రస్‌పైకెక్కి సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. కొల్హాపూర్‌లోని చిఖలీలో ముంపుకు గురైంది.

బుధవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల ప్రభావం మహారాష్ట్రలోని రవాణ వ్యవస్థపై పడింది. రోడ్డు, రైలు సేవలకు అంతరాయం కలిగింది. ముంబైకి సమీపంలోని టీట్‌వాలా, వాంగణీతోపాటు బద్లాపూర్, అంబర్‌నాథ్‌లలో కురిసిన వర్షం కారణంగా వరద నీరు రైల్వేట్రాక్‌పై చేరింది. కసారాలో కొండచరియలు విరిగి రైల్వే ట్రాక్‌పై పడ్డాయి. దీంతో ముంబై – నాసిక్, ముంబై – పుణేల మధ్య నడిచే మెయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం మహారాష్ట్రలోని వరద పరిస్థితిపై ఆరా తీశారు. మహారాష్ట్ర సీఎం ఉద్దవ్‌ ఠాక్రేకు ఫోన్‌ చేసి మాట్లాడారు మోదీ. భారీ వర్షాలు, వరదల గురించి అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలా మహారాష్ట్రకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

Leave A Reply

Please enter your comment!
Please enter your name here