National

భారీగా తగ్గిన పెట్రోల్ డీజిల్ ధరలు

మహారాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం మహారాష్ట్రలో పెట్రోల్ ధర 5 రూపాయలు.. డీజిల్ ధర 3 రూపాయలు తగ్గనుంది. రేపటి నుండి ముంబైలో పెట్రోల్ ధర ₹ 106 కాగా.. డీజిల్ ధర ₹ 94 ఉండనుంది.

పెట్రోల్‌పై 5 రూపాయలు, డీజిల్‌పై 3 రూపాయలు వ్యాట్ తగ్గిస్తూ మహారాష్ట్ర కేబినెట్ నిర్ణయించింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, రాష్ట్ర బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవిస్ ట్వీట్ కూడా చేశారు. వ్యాట్ తగ్గింపుతో మహారాష్ట్ర ప్రభుత్వంపై 6 వేల కోట్ల భారం పడనుందని.. అయితే ద్రవ్యోల్బణం అదుపులో వస్తుందని ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే తెలిపారు. ముంబైలో లీటర్ పెట్రోల్ ప్రస్తుతం 111.35 రూపాయలు కాగా 5 రూపాయల తగ్గింపు అనంతరం 106.35 రూపాయలవుతుంది. ఇక డీజిల్ లీటర్ ధర 97.28 రూపాయలు కాగా 3 రూపాయలు తగ్గింపు అనంతరం 94.28 రూపాయలకు లభించనుంది.

అంతర్జాతీయంగా ఇంధన ధరలు పెరిగిన నేపధ్యంలో పెట్రోల్, డీజిల్ ధరల్ని కేంద్ర ప్రభుత్వం రెండుసార్లు తగ్గించింది. రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేసింది. గతంలో ఉన్న ఉద్ధవ్ థాకరే ప్రభుత్వం వ్యాట్ తగ్గించేందుకు అంగీకరించలేదు. ఏకనాథ్ శిందే ముఖ్యమంత్రి కాగానే వ్యాట్ తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. “ధరలను తగ్గించేందుకు మే 4న కేంద్ర ప్రభుత్వం ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించినప్పుడు, పన్నులను కూడా తగ్గించాలని రాష్ట్రాలను కోరింది. కానీ గత రాష్ట్ర ప్రభుత్వం చేయలేదు. మేము ఇప్పుడు ఆ చర్య తీసుకున్నాము” అని షిండే చెప్పారు. ఇక అసెంబ్లీలో మెజారిటీ నిరూపించుకున్న వెంటనే.. షిండే ఇంధనంపై వ్యాట్ తగ్గిస్తున్నట్లు గత వారం ప్రకటించారు.

Related Articles

Back to top button