More

    మహారాష్ట్రలో ముస్లింలకు రిజర్వేషన్.. మహా కాంగ్రెస్ తీర్మానం

    మహారాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ మరోసారి ముస్లింల రిజర్వేషన్ల అంశాన్ని తెరపైకి తీసుకువచ్చింది. ఫిబ్రవరి 23న ముంబైలో జరిగిన కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు తీర్మానం కూడా చేసినట్లు తెలుస్తోంది. మహారాష్ట్రలో మరాఠా సామాజిక వర్గంతోపాటు ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించాలని శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ నేతృత్వంలోని మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది.

    ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ.. ముస్లింలకు రిజర్వేషన్ల కల్పించాలనే డిమాండ్ చేయడం వెనుక…, ఆ వర్గం క్రెడిట్ పొందేందుకేననే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో బీజేపీతో కలిసి ఉన్నప్పుడు కూడా….శివసేన ముస్లింలకు 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలంటూ డిమాండ్ చేసింది. ఈ అంశంపై గతంలో బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను ఫడ్నవీస్ ప్రభుత్వం అమలు చేయకపోవడాన్ని తప్పుబట్టింది. మరాఠా రిజర్వేషన్లతో పాటు ధన్ గర్స్, ముస్లిం, ఇతర రిజర్వేషన్ల డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలని అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వానికి శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే సూచించారు కూడా. అంతేకాదు తమ వర్గానికి కూడా రిజర్వేషన్లు కావాలంటున్న ముస్లింల డిమాండ్ సమంజసమైనదేనని వ్యాఖ్యానించారు.

    ప్రస్తుతం మహారాష్ట్రకు ఉద్దవ్ థాక్రేనే సీఎంగా ఉన్నారు.ఈ తరుణంలో… రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ముస్లిం రిజర్వేషన్లకు సంబంధించి కోటాపై ఓ నిర్ణయం తీసుకునే అవకాశాలున్నాయని చెబుతున్నారు. అన్ని అనుకూలిస్తే…శాసన సభలో అందుకు సంబంధించి బిల్లును సైతం తీసుకువచ్చేందుకు మహా వికాస్ అఘాడీ ప్రభుత్వం కసరత్తులు చేస్తోందనే ప్రచారం జరుగుతోంది.

    దీంతో కాంగ్రెస్, శివసేనల మధ్య… క్రెడిట్ గేమ్ మొదలైందని…, అందుకే మహారాష్ట్ట్ర కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎంపీల సమావేశంలో ఈ మేరకు తీర్మానం చేశారని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. అలాగే నూతన వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలనే మరో తీర్మానాన్ని సైతం ఈ సమావేశంలో ఆమోదించడం జరిగింది.

    Trending Stories

    Related Stories