More

    మహారాష్ట్ర హోంమంత్రి రాజీనామా..!

    అనిల్ అంబానీ ఇంటిముందు పేలుడు పదార్థాల కారు కేసు.. మహారాష్ట్ర హోంమంత్రి మెడకు చుట్టుకుంది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా అనేక విషయాలు వెలుగుచూశాయి. ఎన్సీపీ సీనియర్ నేత హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ సైతం పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయనపై ముంబై మాజీ పోలీస్ క‌మిష‌న‌ర్ పరమ్ బీర్ సింగ్ అవినీతి ఆరోప‌ణ‌లు చేయ‌టం, ప్రతి నెల వంద కోట్ల రూపాయ‌లు వ‌సూలు చేయాల‌ని టార్గెట్ పెట్టాడ‌న్న ఆరోప‌ణ‌లు వినిపించాయి. ఈ అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 15 రోజుల్లో ప్రాథ‌మిక ద‌ర్యాప్తు పూర్తి చేయాల‌ని హైకోర్టు ఆదేశించింది. విచారణలో తగిన సాక్ష్యాధారాలు లభిస్తే అనిల్ దేశ్‌ముఖ్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయాలని కోర్టు సూచించింది. ఈ నేపథ్యంలో హోంశాఖ మంత్రి అనిల్ దేశ్ ముఖ్ త‌న మంత్రి ప‌ద‌వికి రాజీనామా చేశారు. రాజీనామా లేఖ‌ను సీఎం ఉద్ద‌వ్ థాక్రేకు పంపించారు.

    రెస్టారెంట్లు, బార్ల నుంచి నెలకు వంద కోట్లు వసూలు చేయాలని హోం మంత్రి పోలీసులు అధికారులను ఆదేశించారని ఆరోపిస్తూ.. ముంబై మాజీ కమిషనర్ పరంబీర్ సింగ్ ఇటీవల ఏకంగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రేకు లేఖ రాశారు. పరంబీర్ సింగ్ రాసిన ఈ లేఖ అధికార శివసేనతో పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది. హోం మంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను బర్త్‎రఫ్ చేయాలని ప్రతిపక్ష బీజేపీ డిమాండ్ చేసింది. హోం మంత్రిపై చేసిన అవినీతి ఆరోపణలపై పరంబీర్ సింగ్ తొలుత సుప్రీంను ఆశ్రయించారు. మాజీ సీపీ ఆరోపణలను తీవ్రంగా పరిగణించిన అత్యున్నత న్యాయస్థానం తొలుత హైకోర్టుకు వెళ్లాలని పరంబీర్ సింగ్‌కు సూచించింది. దీంతో.. ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అటు, ప్రముఖ న్యాయవాది డాక్టర్ జయశ్రీ పాటిల్ కూడా హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. జయశ్రీ పాటిల్ పిల్‌పై విచారించిన బాంబే హైకోర్టు తాజాగా హోం మంత్రిపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ చేయాలని, 15 రోజుల్లోగా ప్రాథమిక విచారణ పూర్తి చేయాలని సూచించింది.

    ఇన్నాళ్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చినా వెన‌క్కి త‌గ్గ‌ని ఆయ‌న‌.. ఇప్పుడు రాజీనామా చేయ‌టం మహారాష్ట్రలో రాజ‌కీయాలు వేడెక్కాయి. సీబీఐ విచారణకు బాంబే హైకోర్టు ఆదేశించడంతో అనిల్ మీద ఒత్తిడి పెరిగినట్టు చెబుతున్నారు. ఇలా ఇంటా బ‌య‌ట ఒత్తిడి పెర‌గ‌టంతోనే రాజీనామా చేసిన‌ట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అనిల్ దేశ్ ముఖ్ మాత్రం.. విచారణకు సహకరించేందుకే మంత్రి పదవికి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. తన రాజీనామా లేఖను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన ఆయన.. తనపై విచారణ జరుగుతున్నందున హోంమంత్రి పదవిలో కనసాగడం ఇష్టం లేదని ముఖ్యమంత్రికి పంపిన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.

    ఏదేమైనా ఈ వ్యవహారం అధికార శివసేనకు తలనొప్పిగా మారింది. ఉద్ధవ్ థాక్రే ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఇటీవల కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ తో భేటీ అయిన నాటి నుంచి.. ఈ కేసులో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. మే 2న ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే.. మహా అఘాడీ సర్కార్ కూలిపోతుందని రాజకీయ విశ్లేషకులు అంచనావేస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తే.. శివసేనతో ఎన్సీపీ తెగదెంపులు చేసుకుంటుందని.. అదే జరిగితే ఉద్ధవ్ థాక్రే సీఎం పదవి ఊడటం ఖాయమంటున్నారు.

    మరోవైపు, అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వాహనం కేసులో ఎన్‌ఐఏ దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇటీవల దక్షిణ ముంబయిలోని ఓ క్లబ్‌లో జరిపిన సోదాల్లో ఎన్‌ఐఏ కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది. ఓ పత్రాల్లో ఆ క్లబ్‌ నెలవారీగా ప్రభుత్వ అధికారులకు ఇచ్చిన సొమ్ము వివరాలు ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఇతర అధికారులకు ఇచ్చిన లంచాలు, వారి పేర్లతో సహా ఉన్నట్లు సమాచారం. వీటిని దర్యాప్తు సంస్థ క్షుణ్ణంగా పరిశీలిస్తోంది.

    Related Stories