దేశంలో హనుమాన్ చాలీసా హాట్ టాపిక్ గా మారింది. ఎంపీ నవనీత్ కౌర్ మహారాష్ట్ర ఇంటి ముందు హనుమాన్ చాలీసా చదువుతా అంటూ సవాల్ విసరడం పెను దుమారం రేగింది. తర్వాత భారీ ఎత్తున శివసేన కార్యకర్తలు నవనీత్ కౌర్ దంపతుల ఇంటిని ముట్టడించడం.. నాటకీయ పరిణామాల మధ్య ఎంపీ దంపతుల అరెస్ట్, రిమాండ్ అంతా చకచకా జరిగిపోయాయి.
ఇప్పుడు తాజాగా మరో వీడియో వైరల్ గా మారింది. మహరాష్ట్ర మంత్రి హనుమంతుడిని అసభ్య పదజాలంతో దూషించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. బీజేపీ నేత నితీష్ రాణే ట్విట్ చేసిన ఈ వీడియోలో మంత్రి అబ్దుల్ సత్తార్ హనుమంతుడిని దుర్భాషలాడుతున్నాడు. హనుమాన్ చాలీసాను అవమానించే విధంగా పదాలను వాడుతున్నాడు. అయితే నితేష్ మహరాష్ట్రకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అయిన నారాయణ్ రాణే కుమారుడు.
కొన్ని నిమిషాల వ్యవధిలోనే ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పోలీసులు, మంత్రితో పాటు మరికొంతమంది స్థానికులు ఈ వీడియోలో కన్పిస్తున్నారు. హనుమంతుడికి వ్యతిరేకంగా అసభ్య పదాలను మంత్రి అబ్దుల్ సత్తార్ వాడినట్లు వీడియోలో తెలుస్తోంది. అయితే కేవలం హనుమంతుడినే కాదు.. హనుమాన్ చాలీసా బహిరంగ పారాయణాన్ని సమర్ధిస్తూ సమావేశమైన స్థానిక ప్రజలపై సైతం మంత్రి మండిపడినట్లు తెలుస్తోంది. దీనిపై మహరాష్ట్ర నవ నిర్మాణ సేన సైతం స్పందించింది. ఉద్ధవ్ థాకరే ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడింది. మంత్రి అబ్ధుల్ సత్తార్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
మరోవైపు మహారాష్ట్రలో శివసేన విభాగం.. ఇతర పార్టీల నేతలు, నాయకులపై దాడులకు పాల్పడుతున్నారు. హనుమాన్ చాలీసా పారాయణం చేస్తామని చెప్పిన రాణా దంపతులకు ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఏప్రిల్ 23న, భారతీయ జనతా పార్టీ నేత కిరీట్ సోమయ్య కారు ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్ పరిధి గుండా వెళ్తున్న సమయంలో ఆయనపై దాడి జరిగింది. ఖార్ పోలీస్ స్టేషన్ లో ఉన్న రాణా దంపతులను కలవడానికి సోమయ్య వెళుతున్న సమయంలో ఈ దాడి జరిగింది. కిరీట్ సోమయ్య కూడా హనుమాన్ చాలీసా విషయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేశారు.. ఇదే శివసేన నాయకులకు ఆగ్రహం తెప్పించింది.
సవాలు చేసిన వారిని వదిలిపెట్టకూడదని బాలాసాహెబ్ తమకు నేర్పించారని చెప్పింది. ఆ సమయంలో మోదీజీ కారు ఉండి ఉంటే దానిపై కూడా దాడి చేసి ఉండే వాళ్లమని శివసేన నాయకురాలు దీపాలీ సయ్యద్ చెప్పారు. మాతోశ్రీ ముందు నిరసనగా హనుమాన్ చాలీసాను పఠించడానికి ఎంపీ నవనీత్ రాణా, ఎమ్మెల్యే రవి రాణా సవాల్ చేయడంపై సయ్యద్ ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత బీజేపీ నేత కిరీట్ సోమయ్యపై శివసేన నేతలు చేసిన దాడిని ఆమె సమర్థించారు. ఈ దాడిలో ఆయన గాయపడ్డారు. సోమయ్య తన ముఖంపై రక్తం కారుతున్న వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఉద్ధవ్ థాకరే గూండాలు తనను చంపడానికి ప్రయత్నించడం ఇది మూడోసారి అని.. ఈసారి ఏకంగా పోలీస్ స్టేషన్ లోనే దాడికి దిగారని ట్విట్ చేశారు.