పిల్లలకు విద్యాలయాలు దైవంతో సమానం. అక్కడ నేర్పిందే వారి జీవితానికి బాటలు వేస్తుంది. అలాంటి విద్యాలయాల్లో శాంతిని బోధిస్తారే కానీ హింసకు తావివ్వరు. ముఖ్యంగా మన సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్ధులకు తెలియజేయడంతో పాటు మంచిని పెంపొందిస్తుంటారు. ఇక విద్యాలయాలు జ్ఞాన నిలయాలు.
అలాంటి విద్యాలయాల్లో హింసను ప్రొత్సహించే పాఠాలు ఎంత వరకు కరెక్ట్..? అవును నిజమే.. మదర్సాలలో మర్డర్ పాఠాలు నేర్పుతున్నట్లు ఏకంగా ఓ రాష్ట్ర గవర్నర్ చెప్పడం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. బిజెపి మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మకు మద్దతు ఇచ్చినందుకు రాజస్థాన్‌లో ఒక దర్జీ తల నరికి చంపడాన్ని ఖండించిన కేరళ గవర్నర్ ఆరిఫ్ మహ్మద్ ఖాన్ మదర్సాలలో ఏమి బోధిస్తున్నారో పునఃపరిశీలించండని పిలుపునిచ్చారు, హత్య బోధనలకు విరుద్ధమని అన్నారు. ఇస్లాం దూషణకు శిక్ష శిరచ్ఛేదమని మదర్సాలలో పిల్లలకు బోధిస్తున్నారని తెలిపారు. దానిని భగవంతుని చట్టంగా బోధిస్తున్నారని వెల్లడించారు. మదర్సాలలో ఏమి బోధిస్తున్నారో పునఃపరిశీలించాలని గతంలో కూడా గవర్నరు మండిపడ్డారు.
అలాంటి వాటిని తప్పనిసరిగా వ్యతిరేకించాలన్న ఆయన… ఇటువంటి విధానాలు అసలైన ముస్లిం లక్షణాలు కావన్నారు. మదర్సాలాలు ఖురాన్ ప్రాథమిక బోధనలను ఉల్లంఘిస్తున్నాయని గవర్నర్ అన్నారు. ఇక మదర్సాలలో జిహాద్ అర్ధాన్ని వక్రీకరిస్తున్నారని తెలిపారు. అయితే ఇస్లామిక్ చట్టం ఖురాన్ నుండి రాలేదని ఆయన చెప్పారు. ఇది సామ్రాజ్యం కాలంలో వ్యక్తులచే రాయబడిందని.. ఇది శిరచ్ఛేదనను సమర్థిస్తుందని స్పష్టం చేశారు. ఈ చట్టాన్ని మదర్సాలలో పిల్లలకు బోధించడం చాలా ప్రమాదకరమని గవర్నర్ వెల్లడించారు. మొదట ఇది దైవ చట్టం కాదని.. మనుషులు రాసిందని చెప్పారు. అయితే పిల్లల మనసులో మాత్రం దేవుని చట్టంగా ముద్ర వేసే ప్రయత్నం జరుగుతుందన్నారు. కొంతమంది వ్యక్తులు రాసిన చట్టం.. ఇస్లాంలో భాగమని ఎలా చెప్పగలరని గవర్నర్ ప్రశ్నించారు. 14 ఏళ్ల వయసు వచ్చేంత వరకు పిల్లలకు బ్రాడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాలని అన్నారు. మదర్సాలలో కూడా బ్రాడ్ బేస్డ్ ఎడ్యుకేషన్ అందించాల్సిన అవసరం ఉందని చెప్పారు.
అందుకే దేశంలోని కొన్ని రాష్ట్రాలు మదర్సాలపై ఆంక్షలు విధించాయి. ఇంకొన్ని ప్రభుత్వాలు అయితే మదర్సాలలను రద్దు చేస్తూ నిర్ణయాలు తీసుకున్నాయి. అసోం ప్రభుత్వం తమ ఆధ్వర్యంలోని అన్ని మదర్సాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. బిల్లుకు వ్యతిరేకంగా అసెంబ్లీలో ప్రతిపక్షాల ఆందోళనల మధ్యనే రాష్ట్ర మంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రవేశ పెట్టారు. అప్పటికే అమలులో ఉన్న ‘ది అసోం మదర్సా ఎడ్యుకేషన్ చట్టం-1995’, ది అసోం మదర్సా ఎడ్యుకేషన్ చట్టం-2018ల రద్దును ఈ బిల్లు ప్రతిపాదించింది. కొత్త బిల్లు ఆమోదం పొంది అమలులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 610 ప్రభుత్వ మదర్సాలు రద్దయ్యాయి. ఇక యూపీలో మదర్సాలపై యోగి సర్కార్ ప్రత్యేక దృష్టి పెట్టింది. అక్కడి బోధనలతో పాటు నేర్పాల్సిన వాటిలో కూడా మార్పులు చేసింది. మదర్సాల్లోనూ క్లాసుల ప్రారంభానికి ముందు జాతీయగీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేస్తూ.. ఉత్తరప్రదేశ్‌లోని మదర్సా ఎడ్యుకేషన్ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఉదయాన్నే విద్యార్ధులు ప్రార్థనలతో పాటు.. జాతీయ గీతాలాపన చేసి క్లాసులకు హాజరుకావాలని బోర్డు నిర్ణయించింది.అయితే.. 2017లో తొలిసారిగా యూపీలోని మదర్సాలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజు జాతీయ జెండా ఎగురవేయడం.. జాతీయ గీతాన్ని ఆలపించడం తప్పనిసరి చేసింది. మొత్తంగా కేరళ గవర్నర్ చెప్పినట్లుగా మదర్సాలలో బోధనలపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.