More

  డెబ్బయేళ్ల రిజర్వేషన్ల రగడ ముగిసేనా..?

  రిజర్వేషన్లపై ఇటీవలి కాలంలో మన దేశంలోని న్యాయస్థానాలు ఇస్తున్న తీర్పులపై వివరమైన, ప్రిజిడ్యూస్ లేని చర్చ జరగాలి. గత నిర్ణయాలను, గతంలో రాజ్యాంగం ఇచ్చిన హామీలు పునస్సమీక్షించినపుడు గోల చేయకుండా సామరస్యంగా చర్చించే వాతావరణం ఉండాలి. రిజర్వేషన్ల అంశం అంత సులంభంగా తేలేది కాదు. కానీ, దేన్నైనా రాజకీయఅంశంగా మార్చడం పార్టీలకు అలవాటైంది.

  న్యాయస్థానాలు సమాజంలో వచ్చే ప్రతిక్రియలను అంచనా వేసి తీర్పులు వెల్లడించాలా? ప్రభుత్వాలు మందబలం ఆధారంగా నిర్ణయాలు మార్చుకోవాలా? రాజ్యాంగ స్ఫూర్తిని అనుసరించి ప్రతిస్పందించాలా అనే చర్చ చాలా కాలంగా ఉంది. రిజర్వేషన్లపై భారతదేశంలో రాజకీయ పార్టీలు ఎప్పుడూ అవకాశవాదవైఖరితో కూడుకున్న వైఖరులే వినిపించాయి. ఆయా సందర్భాలను బట్టీ, రాజకీయ అవసరాలనూ, బలమైన సామాజిక వర్గాల ప్రతిక్రియలకు భయపడి తమ వైఖరులను మార్చుకుంటూ వచ్చాయి.

  రిజర్వేషన్లను సమర్థించే వారు వాటి ప్రయోజనాన్ని మాత్రమే చెప్తూ దుర్వినియోగాన్ని దాటవేయడం ఒక పద్ధితి. దుర్వినియోగాన్ని అరికట్టే సాధ్యాసాధ్యాలను చర్చించడం మరొక పద్ధతి. రెండోది నైతికంగా లేనప్పుడు మొదటిదాన్ని ఎంచుకుంటాయి రాజకీయ పార్టీలు.

  న్యాయస్థానాల తీర్పులపై గతంలో చరిగిన చర్చ ఏంటి? డిమాండ్ చేస్తే రిజర్వేషన్లు ఇవ్వాల వద్దా అనే అంశంపై సుప్రీం ఏమంది? చెన్నై న్యాయస్థానాల నేపథ్యంలో జరుగుతున్న చర్చ ఏంటి? ఏ వాదనలో పస ఎంత? రిజర్వేషన్ల అమలు విషయంలో మారిన న్యాయస్థానాల స్ఫూర్తి విషయంలో ఇంత వ్యతిరేకతకు కారణమేంటి? మరాఠాల రిజర్వేషన్ల విషయంలో సుప్రీం ఏమంది? ఇలాంటి కీలక అంశాలు వెల్లడించే ప్రయత్నం చేస్తాను.

  ఇటీవల మరాఠాల రిజర్వేషన్ల విషయంలో సుప్రీం తీర్పు; రిజర్వేషన్ ప్రాతిపదికన ఉద్యోగం పొందినవారు, మతం మార్చుకుంటే ఉద్యోగాన్ని కోల్పోవాల్సిందే అన్న చెన్నై హైకోర్టు తీర్పు, గతంలో తమిళనాడులో ఉద్యోగుల సీనియారిటీ ప్రాతిపదికన కాకుండా రిజర్వేషన్ల ఆధారంగా పదోన్నతులు ఇవ్వడం సమంజసం కాదన్న తీర్పుల నేపథ్యంలో దేశంలో రిజర్వేషన్ల అవసరంపై ఆసక్తికరమైన, అవసరమైన చర్చ మొదలైంది.

  ఈ చర్చలో కొంతమంది నిపుణులు చాలా విచిత్రంగా రాజ్యాంగ అధికరణాల స్ఫూర్తికి భిన్నమైన తీర్పులు ఇస్తున్నాయని కూడా వాదించారు. దీంతో రాజ్యాంగ సవరణచేసి రిజర్వేషన్లు తొలగించాలన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. కథ ఇక్కడితో ఆగలేదు-రిజర్వేషన్లు ప్రభుత్వ పరిధిలోవా, రాజ్యాంగ పరిధిలోవా? అనే చర్చకూడా తీవ్రమైంది.

  ఇటీవల చెన్నై హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో కులం నేపథ్యం-మతం విశ్వాసం కాబట్టి రిజర్వేషన్ ద్వారా ఉద్యోగం మార్చుకున్నవారు మతం మార్చుకోవచ్చనేవాదన మొదలైంది. దీనికి ఓ సమర్థన మొదలైంది…అదేంటంటే…వివక్ష ప్రాతిపదికన రిజర్వేషన్ వచ్చినపుడు విశ్వాసాన్నిమార్చుకున్నపుడు రిజర్వేషన్ ఎందుకు కోల్పోవాలి? రాద్ధాంతమూ నడుస్తోంది.

  సాంఘికంగా, విద్యాపరంగా వెనుకబడిన సామాజిక వర్గాలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉందని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్15(4) అంటుంది. ప్రభుత్వ ఉద్యోగాలలో తగిన ప్రాధాన్యం లేని వర్గాలకు ఉద్యోగ రిజర్వేషన్లు కల్పించే అధికారం ప్రభుత్వానికి ఉందని 16(4) అంటుంది.

  ఇది ప్రభుత్వానికి ఉన్న అధికారమా? ప్రజలకా? అనే చర్చ చాలా నడిచింది. మొదట్లో ఇది ప్రభుత్వానికి రాజ్యాంగం ఇచ్చిన అధికారమే తప్ప ఎవరి హక్కూ కాదని సుప్రీం తేల్చింది. ప్రభుత్వం ఇస్తే తీసుకోవాల్సిందే తప్ప ఇమ్మడి డిమాండ్ చేసే అధికారం ఎవ్వరికీ లేదని స్పష్టం చేసింది. 70ల తర్వాత మారిన పరిస్థితుల్లో న్యాయస్థానాల వైఖరులు మారి…చర్చ ముగిసింది.

  తిరిగి 2014లో ఎన్డీఏ ప్రభుత్వంలోకి రాగానే రిజర్వేషన్లపై అనుకూల వాదనలు మొదలయ్యాయి. సైద్ధాంతికంగానే రిజర్వేషన్ల విషయంలో బీజేపీది భిన్నమైన వాదన. వ్యతిరేకించడం లేదు గానీ, తప్పుడు మార్గాల్లో వాటిని అనుభవించేవారి విషయంలో, మతమార్పిడుల తర్వాత సైతం రిజర్వేషన్ పొందడం విషయంలో బీజేపీకి అభ్యంతరం ఉంది.

  తాజాగా చైన్నె హైకోర్టు ఒక కులం కోటాలో ఉద్యోగం పొంది… ఆ తర్వాత మతం మారితే వారిని వెంటనే ఉద్యోగం నుంచి తొలగించాలని సంచలన తీర్పు ఇచ్చింది. భారతీయార్‌ విశ్వవిద్యాలయంలో జరిగిన అక్రమ నియామకాలపై విచారణ సందర్భంగా జస్టిస్‌ ఆర్‌.మహదేవన్‌ సంచలన తీర్పు వెల్లడించారు.

  ‘‘ఒక ఉద్యోగి నిర్దిష్టంగా ఒక కులానికి కేటాయించిన కోటాలో ఉద్యోగం పొంది… ఆ తర్వాత మతం మారితే ఉద్యోగం నుంచి తొలగించాలి. వారికి ఉద్యోగంలో కొనసాగే హక్కు ఉండదు. అలాగే, అపాయింట్‌మెంట్‌కు ముందు మతం మారిన వారికి కూడా సంబంధిత కులం కోటా వర్తించదు’’ అని తేల్చి చెప్పారు. తప్పుడు సమాచారం అందించి ఉద్యోగం పొందిన, అనర్హులను ఎంపిక చేసిన విశ్వవిద్యాలయాలపైనా చర్యలకు ఆదేశించింది.

  హిందువులలో భాగమైన దళితులు లేదా గిరిజనులు మతం మారి క్రైస్తవం స్వీకరిస్తే… ‘ఎస్సీ,ఎస్టీ’ హోదా కోల్పోతారు. వారంతా క్రైస్తవులే! తమిళనాడులోని క్రైస్తవులు ‘బీసీ-సీ’ కేటగిరీలోకి వస్తారు. వారికి ఎస్సీ రిజర్వేషన్‌ వర్తించదు. ఉద్యోగంలో చేరాక మతం మారాననే వాదన కూడా చెల్లదని తేల్చింది న్యాయస్థానం.

  ఒక కులం ఆధారంగా రిజర్వేషన్ల కోటా కింద ఉద్యోగం పొందిన వ్యక్తి, తరువాత మత మార్పిడి చేసుకుంటే ఆ ఉద్యోగంలో కొనసాగే హక్కు కోల్పోతారన్న న్యాయమూర్తి వ్యాఖ్యలు సరికొత్త చర్చకు తెరలేపాయి. తన తీర్పుకు ఆధారంగా 1950 ఆగస్టులో రాష్ట్రపతి గెజిట్ ఆర్డర్ లోని మూడవ పేరాగ్రాఫ్‌ను ఉటంకించారు న్యాయమూర్తి. అందులో హిందూ మతంలో దళితులకు మాత్రమే ఎస్సీ కోటా వర్తిస్తుందని పేర్కొన్నారు.

  దీనిపై గత డెబ్బయ్యేళ్లుగా వివాదం రగులుతూనే ఉంది. 1956లో సిక్కుల్లో దళితులకు, 1990లో బౌద్ధులలో దళితులకు ఎస్సీ కోటా వర్తింపజేస్తూ గెజిట్ ఆర్డర్ లో మార్పులు తెచ్చారు. సిక్కులు, బౌద్ధులకు వర్తింపజేసినప్పుడు క్రిస్టియన్‌, ముస్లింలలో దళితులకు ఎందుకు వర్తింపజేయరనే ప్రశ్న సహజంగానే ముందుకొచ్చింది.

  రిజర్వేషన్ల అమలును డిమాండ్ చేస్తున్నవారు సచార్‌ కమిటీ, జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిటీల పరిశీలనలను ప్రస్తావించారు. క్రైస్తవం, ఇస్లాంలోని దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు వర్తింపజేయాల్సిన ఆవశ్యకత గురించి గట్టిగా నొక్కి చెప్పాయి. పట్టణ ప్రాంతాల్లో 47 శాతం మంది దళిత ముస్లీంలు, 32 శాతం మంది దళిత క్రిస్టియన్లు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నారని, అన్ని రకాల దోపిడీకి, సామాజిక వివక్షకు గురవుతున్నారని జస్టిస్‌ రంగనాథ్‌ మిశ్రా కమిషన్‌ పేర్కొంది. ఈ రెండు కమిటీలు ఏర్పాటు చేసింది నాటి యూపీఏ ప్రభుత్వం. వాటి ప్రయోజనాలు వేరు.

  2019, నవంబర్ 17 మద్రాసు హైకోర్టు మరో సంచలన తీర్పునిచ్చింది. రిజర్వేషన్లకు లోబడి పదోన్నతులు చట్ట విరుద్ధమని సంచలన తీర్పును వెలువరించింది. సీనియారిటీకి అనుగుణంగా పదోన్నతులు కల్పించాలని స్పష్టం చేసింది. రిజర్వేషన్లకు అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం ఉద్యోగ నియామకాలు చేస్తోంది. అలాగే పదోన్నతులు కల్పించడంలోనూ రిజర్వేషన్లను ప్రాతిపదికగా తీసుకుంటోంది.

  ఈ ఏడాది మే5న సర్వోన్నత న్యాయస్థానం సైతం మరాఠాల రిజర్వేషన్లు చెల్లవని తేల్చి చెప్పింది. మరాఠాలకు సర్కార్‌ ఉద్యోగ నియామకాలు, విద్యాసంస్థల ప్రవేశాల్లో 16 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ.. మహారాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీం ధర్మాసనం కొట్టివేసింది.

  మరాఠా రిజర్వేషన్లు ‘రాజ్యాంగ విరుద్ధం’గా అభివర్ణించింది. 1992 మండల్ తీర్పులో.. రిజర్వేషన్లపై విధించిన 50 శాతం పరిమితిని ఇది అధిగమించిందని స్పష్టం చేసింది. 1992లో ఇచ్చిన మండల్ తీర్పు ప్రకారం.. రాష్ట్రాలు 50 శాతం రిజర్వేషన్లను అధిగమించరాదు.

  మరాఠాల రిజర్వేషన్ తీర్పులో సుప్రీం కొన్ని ప్రత్యామ్నాయాలను సూచించింది. దేశంలో సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వాలు రిజర్వేషన్లకే పరిమితం కాకుండా మరిన్ని చర్యలు తీసుకోవచ్చని సుప్రీం ధర్మాసనం అభిప్రాయపడింది. ఆయా వర్గాల్లో విద్యను ప్రోత్సహించడం, విద్యాసంస్ధలు నెలకొల్పడం వంటివి చేయొచ్చని పేర్కొంది.

  స్వాతంత్య్రం వచ్చినప్పుడు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేడ్కర్ రిజర్వేషన్లు పదేళ్ళపాటు మాత్రమే అమలు చేయాలని చెప్పారు. ఈ పదేళ్లలో దళితులు, వెనుకబడిన కులాల వారు అభివృద్ధి చెందుతారని ఆయన ఆశించారు. కానీ రిజర్వేషన్లను ఆసరాగా చేసుకొని ఓట్ల రాజకీయాలకు అలవాటుపడిన మన నేతలు రిజర్వేషన్లను కొనసాగిస్తూపోయారు.

  పదేళ్లు అన్నచోట మరో పదేళ్లు కొనసాగించవచ్చు. కానీ డెబ్భై ఏళ్ళు దాటినా ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అంటే దేశం అభివృద్ధి చెందినట్టా? చెందనట్టా? వెనుకబడిన కులాల్లో ఏ ఒక్క కులమూ ఇప్పటివరకు అభ్యున్నతి సాధించలేదా ? ఈ ప్రశ్నకు పాలకులు సరైన సమాధానం చెప్పగలరా ?

  వెనుకబడిన కులాలవారు సామాజికంగా, ఆర్ధికంగా అభివృద్ధి చెందాలనేదే రిజర్వేషన్ల లక్ష్యం అయినప్పుడు అలా అభివృద్ధి చెందిన కులాల్లో ‘క్రిమిలేయర్’ను రిజర్వేషన్ల జాబితా నుంచి తొలగిస్తున్నారా? వెనుకబడిన కులాల్లో కోటీశ్వరులు కూడా రిజర్వేషన్లు అనుభవిస్తూనే ఉన్నారు.

  ఏ సామాజిక వర్గం జనాభా ఎక్కువ ఉన్నదో ఆ సామాజిక వర్గానికే రిజర్వేషన్లు వర్తింపచేస్తున్నారు. ఇందుకు కారణం వారు ఓటు బ్యాంకు కాబట్టి. సమాజంలో అగ్రవర్ణాలుగా ముద్ర వేయించుకున్న కొన్ని సామాజిక వర్గాలు రిజర్వేషన్లు లేని కారణంగా ఇప్పటికీ పేదరికంలోనే మగ్గుతున్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు దొరక్క అల్లాడిపోతున్నారు.

  ఉద్యోగాలవరకు రిజర్వేషన్లు అమలు చేస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు. కానీ ప్రమోషన్లలో సైతం రిజర్వేషన్లు ఉన్నాయి. అకడమిక్ పరీక్షల్లో సైతం రిజర్వుడ్ కేటగిరీ వారికి మార్కులు తక్కువ వచ్చినా ఫరవాలేదు. ప్రభుత్వ ఉద్యోగాలకు అప్లయ్ చేసుకునేటప్పుడు వయసులో సైతం వారికి రిలాక్జేషన్ ఉంది.

  మద్రాసు హైకోర్టు తీర్పు విషయంలో వ్యతిరేకిస్తున్న వారు చాలా చిత్రమైన వాదన చేస్తున్నారు. వివక్ష ప్రాతిపదికన రిజర్వేషన్ వచ్చింది కాబట్టి-విశ్వాసం మార్చుకున్నంత మాత్రాన వివక్ష పోదు కదా! రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు పొందినవారు మతం మార్చుకుంటే తప్పేంటనే వాదనలు చేస్తున్నారు. వివక్ష ఉన్న కులాన్ని వదిలి విశ్వాసాన్ని మార్చుకున్నపుడు, కులం వల్ల వచ్చిన రిజర్వేషన్ కూడా న్యాయంగా వదులుకోవాలి కదా అన్నది మరో వాదన.

  అభివృద్ధికి బాటలు వేసే ప్రతి విధాన నిర్ణయ చర్చలో రాజకీయం దూరుతుంది. ఇక్కడే ప్రయోజనవాద సిద్ధాంతం ప్రవేశించింది. దీంతో అసలు అటకెక్కి అవకాశవాదమే ప్రధానంగా మారుతుంది. ముఖ్యంగా రిజర్వేషన్లపై రాజకీయ పార్టీలు ముఖ్యంగా కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీలు ఆద్యంతం సంతుష్టీకరణ వలల ప్రతిపాదికన వైఖరులు ప్రకటించాయి. రిజర్వేషన్లపై ఇప్పటికైనా అర్థంవంతమైన చర్చ జరగాలనీ, మతమార్పిడీకి రిజర్వేషన్ కు ఉన్న లంకె విషయంలో స్పష్టత రావాలనీ కోరుకుందాం.

  Related Stories