‘ది కశ్మీర్ ఫైల్స్’ సినిమాను టాక్స్-ఫ్రీ(పన్ను రహితంగా) ప్రకటించిన మూడవ రాష్ట్రంగా మధ్యప్రదేశ్ నిలిచింది. అంతకు ముందు హర్యానా, గుజరాత్ లు ఈ లిస్టులో ఉన్నాయి. విడుదలైన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. దేశవ్యాప్తంగా అన్ని థియేటర్లు హౌస్ ఫుల్ అయినట్లు నివేదించాయి. పన్ను రహిత హోదా సినిమా టిక్కెట్ల ధరను తగ్గిస్తుంది, రాష్ట్రాలు దానికి వర్తించే ఎంటర్టైన్మెంట్ GSTని మినహాయించాయి. వినోదంపై ప్రస్తుత GST రేటు 18%, మరియు రాష్ట్ర GSTని టిక్కెట్ ధరల నుండి తీసివేస్తే టికెట్ ధర 9% తగ్గుతుంది.
పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులు ప్రజలు వచ్చి సినిమా చూసేందుకు థియేటర్లను బుక్ చేశారు. ఈ చిత్రానికి జనాల నుంచి విశేష స్పందన లభించింది. భారతదేశంలో తక్కువ థియేటర్లలో మాత్రమే విడుదల అయినప్పటికీ, వివేక్ అగ్నిహోత్రి రూపొందించిన ది కాశ్మీర్ ఫైల్స్ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఇండోర్‌లోని బీజేపీ అధికార ప్రతినిధి ఉమేష్ శర్మ, కశ్మీర్ ఫైల్స్‌ని ప్రజలకు చూపించడానికి ఒక పూర్తి థియేటర్‌ను రిజర్వ్ చేసారు. కాషాయ జెండాలు పట్టుకుని దేశభక్తి నినాదాలు చేస్తూ సినిమా చూసేందుకు జనం వచ్చారని ట్విట్టర్ లో వీడియోలను పోస్టు చేశారు.
మార్చి 11న విడుదలైన ది కశ్మీర్ ఫైల్స్ చిత్రాన్ని చూసేందుకు శుక్రవారం ఇండోర్‌లో గణనీయమైన సంఖ్యలో ప్రజలు చేరుకున్నారు. ఉమేష్ శర్మ థియేటర్ మొత్తాన్ని ప్రజల కోసం బుక్ చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజలు తమ చేతుల్లో కాషాయ జెండాలతో థియేటర్ దగ్గరకు వచ్చారు. ఈ చిత్రాన్ని ప్రదర్శించేందుకు బీజేపీ ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహించడంపై కాంగ్రెస్ పార్టీ నిరసన వ్యక్తం చేసింది. నాలుగు రాష్ట్రాల్లో సాధించిన విజయాలతో భాజపా ఆనందోత్సాహాలతో ఉందని కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి రాకేష్ సింగ్ యాదవ్ అన్నారు. ఈ సినిమా ద్వారా మతపరమైన ఉద్రిక్తలను పెంపొందించాలని భావిస్తున్నారని ఆయన ఆరోపించారు.
విజయ్‌పూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసవనగౌడ పాటిల్ తన నియోజకవర్గంలో 10 రోజుల పాటు ఉచిత షోలను ప్రకటించారని ట్విట్టర్‌లో మరో వినియోగదారుడు పేర్కొన్నారు. “విజయపూర్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బ్సవనగౌడ పాటిల్ తన నియోజకవర్గంలో కశ్మీర్ ఫైల్‌లను 10 రోజుల ఉచిత ప్రదర్శనను ప్రకటించారు. ఇలాంటి నాయకులు మనకు కావాలి” అని కొందరు ట్వీట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో చాలా తక్కువ చోట్ల మాత్రమే ఈ సినిమా ఆడుతూ ఉంది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో టాక్స్ ఫ్రీగా సినిమాను ప్రకటించగా.. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏ నిర్ణయం తీసుకుంటాయో చూడాలి.