తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చిన మాధవన్

0
762

ప్రముఖ నటుడు మాధవన్ స్వయంగా నటించి, దర్శకత్వం వహించిన చిత్రం ‘రాకెట్రీ: ద నంబి ఎఫెక్ట్’ (Rocketry: The Nambi Effect) ప్రమోషన్ కార్యక్రమాలలో భారత అంతరిక్ష పరిశోధన రంగంపై మాధవన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఇస్రో చేపట్టిన అంగారక యాత్రకు పంచాంగం తోడ్పడిందని మాధవన్ చెప్పుకొచ్చారు. పంచాంగం చూసి పెట్టిన ముహూర్త బలంతో భారత్ మార్స్ మిషన్ అవాంతరాలను అధిగమించగలిగిందని అన్నారు. గ్రహగతులన్నీ పంచాంగంలో నిక్షిప్తమై ఉంటాయని మాధవన్ చేసిన వ్యాఖ్యలను నెటిజన్లు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు.

తన వ్యాఖ్యల పట్ల విమర్శలు వస్తుండడంపై మాధవన్ స్పందించారు. మాధవన్ ట్విట్టర్లో వివరణ ఇచ్చారు. అయితే ఇక్కడ మాధవన్ తమిళ భాష అంశాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేశారు. “పంచాంగాన్ని ‘పంచాంగ్’ అంటూ తమిళంలో చెప్పే ప్రయత్నం చేసినందుకు ఈ విమర్శలు రావడంలో తప్పులేదు. నాది అజ్ఞానమే. ఈ విమర్శల తాకిడికి నేను అర్హుడ్నే. అయితే మార్స్ మిషన్ కేవలం 2 ఇంజిన్ల సాయంతోనే విజయవంతం అయ్యిందన్న వాస్తవాన్ని ఈ వ్యవహారం దాచలేదు. ఇదొక రికార్డు కూడా. నంబి రూపొందించిన వికాస్ ఇంజిన్ ఓ రాక్ స్టార్” అని మాధవన్ చెప్పుకొచ్చారు.

‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమా జులై 1న విడుదల కాబోతోంది. ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ సినిమాను మాజీ శాస్త్రవేత్త, ఇస్రో ఏరోస్పేస్ ఇంజినీర్ నంబి నారాయణ జీవిత కథ ఆధారంగా తెరకెక్కించారు. నంబి నారాయణపై అప్పట్లో గూఢచర్యం ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ సినిమాలో మాధవన్ టైటిల్ రోల్‌లో కనిపించనున్నారు. హిందీ, తమిళం, తెలుగు, కన్నడ, మలయాళం, ఇంగ్లీష్ భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది.