ఒలింపిక్స్ ఫీల్డ్ ఈవెంట్స్‌లో మేడిన్ ఇండియా బ్రాండ్ కనిపించనుంది. అథ్లెటిక్స్‌లో పోటీలో పాల్గొనే క్రీడాకారులు భారతదేశంలో తయారైన పరికరాలనే వాడబోతున్నారు. ఒలింపిక్స్ కోసం ప్రపంచ అథ్లెటిక్స్ సమాఖ్య గుర్తించిన ఆరు కంపెనీల్లో ఆనంద్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఎక్వి్‌పమెంట్, భల్లా ఇంటర్నేషనల్, నెల్కో భారత్‌కు చెందినవి. ఈ కంపెనీలు తయారుచేసిన షాట్‌పుట్, డిస్కస్ త్రో, హామర్ త్రోలను పోటీలు జరిగే ప్రాంతాల్లో ఉంచుతారు. తేజిందర్ సింగ్, సీమా పూనియా, కమల్‌ప్రీత్ కౌర్ భారత కంపెనీల వస్తువులను వాడనున్నారు. మరికొంత మంది అథ్లెట్లు ప్రత్యేకంగా తయారుచేయించుకున్న వాటితోనే పోటీపడతారు. ‘మేడిన్ ఇండియా’ నినాదం టోక్యో ఒలింపిక్స్ దాకా వెళ్లడంపై భారతీయులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
ఆనంద్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఎక్విప్‌మెంట్ (ఏటీఈ), భల్లా ఇంటర్నేషనల్, నెల్కో సంస్థలు అథ్లెట్లకు తమ క్రీడా సామగ్రిని ఈవెంట్ల కోసం అందించనున్నాయి. జులై 23 నుంచి ప్రారంభమయ్యే ఈ ఒలింపిక్స్‌లో షాట్‌పుట్ (7.26 కేజీలు), డిస్కస్ (2 కేజీలు), హ్యామర్ (7.26 కేజీలు) లాంటి పరికారలను అథ్లెట్లు వినియోగించనున్నారు. ఆనంద్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఎక్విప్‌మెంట్ కంపెనీ పురుషులు, మహిళల విభాగాలకు సంబంధించి మొత్తం 36 పరికరాలు అందించనుంది. 1992 బార్సిలోనా గేమ్స్ నుంచి ఇప్పటివరకు తాము క్రీడా పరికరాలు అందిస్తున్నట్లు ఆనంద్ ట్రాక్ అండ్ ఫీల్డ్ ఎక్విప్‌మెంట్ సంస్థ తెలిపింది.
భల్లా ఇంటర్నేషనల్ ప్రతినిధి అశుతోష్ భల్లా మాట్లాడుతూ 2016 రియో ఒలింపిక్స్ సందర్భంగా నాణ్యమైన క్రీడా పరికరాలకు రూపొందించినందుకు అవార్డు లభించిందని చెప్పారు. భారత్ నుంచి తమ పరికరాలు ఒలింపిక్స్‌లో ఉపయోగించడం గొప్పగా ఉందని ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సీమా పునియా అనే అథ్లెట్‌తో పాటు మరికొంత మంది తాము రూపొందించిన డిస్కస్‌లు ఈ ఒలింపిక్స్‌లో వాడుతున్నట్లు చెప్పారు. ఈ వేదికపై వివిధ దేశాల అథ్లెట్లు తమ పరికరాల గురించి తెలుసుకునే వీలుంటుందని, భవిష్యత్‌లో వారు కూడా వీటిని కొనుగోలు చేస్తారని తెలిపారు.
టోక్యో ఒలింపిక్స్‌లో పోటీ పడుతున్న ముగ్గురు భారతీయులు భారత్ లో తయారు చేసిన బ్రాండ్లను ఉపయోగించనున్నారు. “తాజిందర్ సింగ్ తూర్ మరియు కమల్‌ప్రీత్ కౌర్ మా షాట్ పుట్ మరియు డిస్కస్‌లను ఉపయోగిస్తారు. ఇతర దేశాల పోటీదారులు మా వస్తువులను ఉపయోగించాలని నేను ఆశిస్తున్నాను” అని ఏటీఈ కంపెనీకి చెందిన ఆదర్ష్ ఆనంద్ అన్నారు. వెటరన్ సీమా పునియా మీరట్ ఆధారిత సంస్థ, దేశంలో అతిపెద్ద స్పోర్ట్స్ గూడ్స్ పరికరాల ఎగుమతిదారులలో ఒకటైన భల్లా ఇంటర్నేషనల్ తయారు చేసిన డిస్కస్‌ను ఉపయోగించనుంది. “సీమా పునియా మా డిస్కస్ ను ఉపయోగిస్తోంది. మరికొందరు పోటీదారులు కూడా ఉపయోగిస్తారని ఆశిస్తున్నాను” అని భల్లా చెప్పారు.