భారత సరిహద్దుల్లో మేడిన్ ఇండియా డ్రోన్స్ గస్తీ కాయనున్నాయి. భారత సైన్యం త్వరలో భారత్ లో తయారు చేసిన మానవరహిత వైమానిక వాహనం(UAV) లను నిఘా కోసం ఆపరేట్ చేయనుంది. ముంబైకి చెందిన ఐడియాఫోర్జ్ భారత సైన్యానికి ‘200 స్విచ్ UAV’లను డెలివరీ చేసే కాంట్రాక్ట్‌ను సొంతం చేసుకుంది. వర్టికల్ టేక్-ఆఫ్ ల్యాండింగ్ (VTOL) మినీ UAV లు రక్షణ ఒప్పందంలో కంపెనీ కుదుర్చుకుంది. రక్షణ మూలధన సేకరణ బడ్జెట్‌లో దాదాపు 68 శాతం దేశీయ సేకరణకు కేటాయించినట్లు కేంద్ర బడ్జెట్‌లో ప్రకటించిన నేపథ్యంలో ఈ డీల్ కుదిరింది.
ఫ్రాన్స్, ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, భారతదేశానికి చెందిన ఇతర సంస్థల నుండి పోటీని ఎదుర్కొన్న తర్వాత భారతీయ కంపెనీ ఈ ఒప్పందంను సొంతం చేసుకుంది. SWITCH UAV భారత సైన్యం నిర్వహించిన కఠినమైన పరీక్షలలో భాగంగా ఫీల్డ్ ట్రయల్స్‌ను విజయవంతంగా పూర్తి చేసిన ఏకైక వ్యవస్థ అని కంపెనీ నుండి అధికారిక ప్రకటన వచ్చింది. సరిహద్దుల్లో రక్షణకు ఫిక్స్‌డ్ వింగ్ UAV అనువైన పరిష్కారం అని భావిస్తున్నారు. భారతీయ సైన్యం ఎదుర్కొంటున్న వాస్తవ కార్యాచరణ పరిమితులను విశ్లేషించిన తర్వాత, భారతీయ కంపెనీ ఐడియాఫోర్జ్ హైబ్రిడ్ వెర్టికల్ టేక్-ఆఫ్ మరియు ల్యాండింగ్ (VTOL) ప్లాట్‌ఫారమ్‌పై పని చేసింది. కంపెనీ ప్రకారం ఈ డ్రోన్ లను చేతితో ఆపరేట్ చేయవచ్చు, రన్‌వే లేకుండా టేకాఫ్ చేయవచ్చు. ఈ డ్రోన్లు భారత సైన్యానికి సరైన సహకారం అందిస్తాయని భావిస్తున్నారు.
ఐడియాఫోర్జ్ కో-ఫౌండర్, సీఈఓ అంకిత్ మెహతా మాట్లాడుతూ “భారత సైన్యం పహారా కాసే ప్రాంతాలలో భూభాగ సవాళ్లను దృష్టిలో ఉంచుకుని VTOL విధానంతో ప్రత్యేకంగా రూపొందించబడింది.” అని తెలిపారు. ‘Built like a bird and tested like a tank’ అనే సిద్ధాంతంతో తాము డ్రోన్ లను రూపొందించామని తెలిపారు. ఈ కాంట్రాక్ట్‌ను పొందేందుకు అత్యంత కఠినమైన ఫీల్డ్ ట్రయల్స్, ల్యాబ్ టెస్టింగ్‌లను పాస్ అయ్యామని అన్నారు. సరిహద్దులలో రక్షణ వ్యవస్థ మరింత పటిష్టంగా మార్చుకోవాలని భారత్ ప్రయత్నిస్తోంది. అందుకు తగ్గట్టుగా ప్రణాళికలను రచిస్తూ ఉంది. ముఖ్యంగా మోదీ ప్రభుత్వం రక్షణ విషయంలో అన్ని చర్యలు తీసుకుంటూ ఉంది.