భారతదేశానికి సంబంధించిన ఎన్నో పురాతన విగ్రహాలు ఇతర దేశాలకు వెళ్లిపోయాయి. భారత ప్రధాని నరేంద్ర మోదీ అటువంటి విగ్రహాలను తిరిగి భారత్ కు తెప్పించే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కొన్ని విగ్రహాలను తెస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరో పురాతన విగ్రహం కూడా భారత్ కు చేరుకుంది.
పవిత్ర కాశీ నుంచి దాదాపు వంద సంవత్సరాల క్రితం చోరీకి గురై అన్నపూర్ణ విగ్రహం తిరిగి పూజలందుకునేందుకు సిద్ధమవుతోంది. 18వ శతాబ్దానికి చెందిన ఈ విగ్రహం కెనడా చేరింది. ఈ విషయాన్ని గుర్తించిన భారత ప్రభుత్వం దాన్ని తీసుకుని వచ్చింది. పునర్నిర్మాణం జరుపుకుంటూ కొత్తగా ముస్తాబవుతున్న విశ్వనాథాలయ ప్రాంగణంలో నవంబర్ 15న ఈ విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రయత్నం ఫలితంగానే ఈ విగ్రహాన్ని భారత్ కు కెనడా తిరిగిచ్చిందని డివిజనల్ కమిషనర్ దీపక్ అగర్వాల్ తెలిపారు. రోడ్డు మార్గంలో విగ్రహాన్ని ఢిల్లీ నుంచి కాశీకి తరలించనున్నారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమం నవంబర్ 11న మొదలవుతుంది. 14 రాత్రి కల్లా యాత్ర కాశీ చేరుతుంది. విశ్వనాథ్ ధామ్ లో 15న విగ్రహ ప్రతిష్టాపన, ప్రాణప్రతిష్ట జరుగుతాయని అధికారులు తెలిపారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.

100 ఏళ్ల క్రితం కాశీ నుంచి చోరీకి గురైన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని ఎట్టకేలకు దాని స్వస్థలమైన వారణాసికి తిరిగి ఇస్తున్నట్లు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే తెలిపారు. శతాబ్ది క్రితం భారత్ నుంచి చోరీకి గురైన అన్నపూర్ణ దేవత విగ్రహాన్ని కెనడా నుంచి తెప్పిస్తున్నట్లు గతేడాది నవంబర్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. లక్నోలో జరిగిన ఒక కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం విగ్రహాన్ని స్వీకరించిందని ఇప్పుడు దానిని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఇస్తున్నట్లు చెప్పారు. “100 సంవత్సరాల క్రితం కాశీ నుండి అన్నపూర్ణ మాత విగ్రహం దొంగిలించబడింది. అది చేతులు మారడంతో కెనడాలోని ఒక విశ్వవిద్యాలయంలో చేరింది. భారత ప్రభుత్వం ఆ విగ్రహాన్ని విశ్వవిద్యాలయం నుండి స్వీకరించింది, ఇప్పుడు దానిని యూపీ ప్రభుత్వానికి అందజేస్తోంది’ అని సీఎం ఆదిత్యనాథ్ అన్నారు.విగ్రహాన్ని కెనడా తిరిగిచ్చిందని 2020 నవంబర్ 29న మన్ కీ బాత్ లో దేశ ప్రజలతో ప్రధాని మోదీ పంచుకున్నారు. వివిధ దేశాల నుంచి 55 విగ్రహాలు, శిల్పాలు, పెయింటింగ్స్ తీసుకొచ్చేందుకు ప్రధాని మోదీ ఏర్పాట్లు చేశారని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. 100 ఏళ్ల క్రితం చోరీ చేసి కెనడాకు తీసుకెళ్లిన అన్నపూర్ణ దేవి విగ్రహాన్ని తిరిగి భారత్‌కు తీసుకొచ్చి నవంబర్ 14న కాశీ విశ్వనాథ ఆలయంలో ఉంచుతామని తెలిపారు. ప్రధాని మోదీ కృషి మాకు విగ్రహాన్ని పొందడంలో సహాయపడింది అని కేంద్ర మంత్రి తెలిపారు. పీబాడీ ఎసెక్స్ మ్యూజియంలోని భారతీయ మరియు దక్షిణాసియా కళల క్యూరేటర్ అయిన డాక్టర్ సిద్ధార్థ V. షా ఈ విగ్రహాన్ని గుర్తించారు.