మధ్యప్రదేశ్‌లోని శివరాజ్ సింగ్ చౌహాన్ ప్రభుత్వం లవ్ జిహాద్ కేసులో నిందితుడైన ఇమ్రాన్ అనే వ్యక్తికి చెందిన అక్రమ ఇంటిని కూల్చివేసింది. బాధితురాలి బంధువులు గ్వాలియర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. దీంతో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించగా.. నిందితులు అక్రమంగా నిర్మించిన ఇంట్లో నివసిస్తున్నట్లు తేలింది.
మున్సిపాలిటీలోని తహసీల్దార్ దీపక్ శుక్లా, ఎస్‌డీఓపీ వివేక్ శర్మ, పలువురు అధికారులు, సిబ్బంది కూల్చివేత ఉత్తర్వులతో దాబ్రా జంగీపురాలోని ఇమ్రాన్ ఇంటికి వచ్చారు. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బలగాలను కూడా మోహరించారు. ఇమ్రాన్ ఇల్లు ఇరుకైన వీధిలో ఉన్నందున, బుల్డోజర్ అతని ఇంటికి చేరుకోలేకపోయింది. దీంతో తొలుత మున్సిపల్ అధికారులు ఇంటిని ఖాళీ చేయించి, కూలీల సహకారంతో కూల్చివేశారు. యాంటీ మాఫియా ఆపరేషన్‌లో భాగంగా ఇమ్రాన్ అక్రమ ఇంటిని కూల్చివేసినట్లు అధికారులు తెలిపారు.
ఇమ్రాన్ తాను హిందువునని చెబుతూ ఓ అమ్మాయితో స్నేహం చేసి పెళ్లి చేసుకున్నాడని ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు తీసుకున్నారు. 2021 జనవరిలో ఒక కార్యక్రమంలో నిందితుడిని కలిశానని.. అతను తనను తాను రాజు జాదవ్‌గా పరిచయం చేసుకున్నాడని బాలిక పోలీసులకు తెలిపింది. తను గర్భవతి అయినప్పుడు, రాజు అలియాస్ ఇమ్రాన్ తనను అబార్షన్ చేసుకోమని బలవంతం చేశాడని బాలిక తెలిపింది. సెప్టెంబర్ 18, 2021న నిందితుడు ఆమెను ఆలయానికి తీసుకెళ్లి హిందూ సంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు.
పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె తన భర్త నిజమైన మతం, అసలు పేరు ఇమ్రాన్ అని తెలుసుకుంది. ఆమె ఇమ్రాన్‌తో కలిసి జీవించడం ప్రారంభించినప్పుడు, ఒక మౌలానా వచ్చి వివాహం చెల్లదని.. ముస్లిం ఆచారాల ప్రకారం వివాహం చేసుకోవాలని, దాని కోసం ఆమె ఇస్లాంలోకి మారాలని వత్తిడి చేశాడు. మతం మారేందుకు ఆమె నిరాకరించడంతో.. ఆమె బావ, మౌలానా తనపై అత్యాచారం చేశారని ఆమె ఆరోపించింది. పెళ్లయిన తర్వాత అత్తమామలు తనను కొట్టారని, 7 నెలలు బందీగా ఉంచారని మహిళ ఆరోపించింది. తన అత్త సుగా బేగం తనను బలవంతంగా వ్యభిచారంలోకి దించిందని వెల్లడించింది. తనను ఓ గదిలో బంధించగా.. పలువురు యువకులు వచ్చి తనపై అత్యాచారానికి పాల్పడ్డారని బాధితురాలు వాపోయింది.. ఏప్రిల్ 20న ఆమెకు ఆ నరకం నుండి బయటకు వచ్చే అవకాశం దక్కడంతో.. తల్లిదండ్రుల ఇంటికి పారిపోయింది. ఆమె తన కుటుంబ సభ్యులకు జరిగిన దారుణాలను వివరించింది. దీంతో శనివారం గ్వాలియర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
యువతి గ్వాలియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ సంఘీని కూడా కలిసి భద్రత కావాలని కోరింది. ఈ కేసులో త్వరితగతిన, నిష్పక్షపాతంగా విచారణ జరిపిస్తామని ఎస్పీ బాధితురాలి కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు. భర్త ఇమ్రాన్, మరిది అమన్, పున్ని, మౌలానా ఒసామాఖాన్, మరో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులపై ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కేసులో ఇమ్రాన్, అతని తల్లి సుగా బేగంలను పోలీసులు అరెస్టు చేయగా, మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.