హోలీ రోజున ఢిల్లీలోని పహర్‌గంజ్ ప్రాంతంలో కొంతమంది అబ్బాయిలు ఓ జపాన్ మహిళను అసభ్యంగా తాకారు. అందుకు సంబంధించిన వీడియో ట్విట్టర్‌లో వైరల్ అయింది. జపాన్ మహిళ ట్విట్టర్‌లో తాను భారత్ ను ప్రేమిస్తూ ఉన్నానని.. హొలీ పండుగ నిజంగా ఎంతో అద్భుతమైన పండుగ అని చెప్పింది. ఈ వీడియో చూసి బాధపడిన వారికి క్షమాపణలు చెప్పింది. భారతదేశాన్ని తాను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నానని తెలిపింది. జపనీస్‌లో పోస్ట్ చేసిన సుదీర్ఘ ట్విట్టర్ థ్రెడ్‌లో, మహిళ తాను మొదట వీడియోను పోస్ట్ చేశానని, అయితే వీడియో వైరల్‌గా మారడంతో తొలగించానని చెప్పింది. వీడియో చూసి బాధపడిన వారికి తాము హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతున్నామని మహిళ జపనీస్ భాషలో రాసింది.
జపాన్ మహిళ ప్రకారం, హోలీ సమయంలో ఒక మహిళ బయటకు వెళ్లడం ప్రమాదకరమని ఆమె విన్నది. ఆమె 35 మంది స్నేహితుల బృందంతో ఉన్న సమయంలో కొంతమంది వ్యక్తులు ఆమెను వేధించారు. ఆమెపై బలవంతంగా రంగులు అద్దారు. జపాన్‌కు చెందిన తన స్నేహితురాలిని అనుకోకుండా వీడియో తీశారని, హోలీ గురించి ప్రతికూలంగా చెప్పాలనే ఉద్దేశ్యం లేదని జపాన్ మహిళ చెప్పింది. హోలీ పండుగ ఒక అద్భుతమైన, ఆహ్లాదకరమైన సాంప్రదాయ పండుగ అని తెలిపింది. భారతదేశంలోని సానుకూల అంశాలు తెలియజేయడమే తన లక్ష్యమని.. అయినప్పటికీ మిమ్మల్ని ఆందోళన కలిగించినందుకు తాను హృదయపూర్వక క్షమాపణలు తెలియజేస్తున్నానని ఆమె జోడించింది. తాను భారతదేశానికి సంబంధించిన ప్రతి విషయాన్ని ప్రేమిస్తున్నానని, చాలాసార్లు భారతదేశానికి వెళ్లానని ఆమె అన్నది.
ఢిల్లీ పోలీసులు వైరల్ వీడియోను పరిగణనలోకి తీసుకున్నారు. ఈ కేసులో ఎటువంటి ఫిర్యాదు నమోదు అవ్వనప్పటికీ పోలీసులు ఒక జువైనల్ తో సహా ముగ్గురు యువకులను పట్టుకున్నారు. IPC సెక్షన్ 354 కింద కేసు నమోదు చేశారు. పర్యాటకులకు అనుకూలమైన దేశంలో ఎలాంటి న్యూసెన్స్ ను సహించబోమని స్పష్టమైన సందేశాన్ని పంపేందుకు నిందితులపై కేసు నమోదు చేసినట్లు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ సంజయ్ సైన్ తెలిపారు.