ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాకు సీబీఐ లుకౌట్ నోటీసులు జారీచేసింది. దేశం విడిచి ఎక్కడికీ వెళ్లొద్దని అందులో పేర్కొంది. సిసోడియాతోపాటు ఈ కేసుతో సంబంధమున్న మరో 13 మందికి కూడా నోటీసులిచ్చింది. ఆప్ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం విధానంలో భారీఎత్తున అక్రమాలు చోటుసుకున్నాయనే ఆరోపణలపై సీబీఐ కేసు నమోదు చేసి.. శుక్రవారం ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఢిల్లీలోని సిసోడియా నివాసంతోపాటు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోని 21 ప్రాంతాల్లో సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు.
సీబీఐ లుకౌట్ నోటీసులపై మనీశ్ సిసోడియా స్పందించారు. సోదాల్లో భాగంగా ఒక్క పైసా కూడా దొరకలేదన్నారు. ఇప్పుడు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. మనీశ్ సిసోడియా మీకు అందుబాటులో లేడా అని ప్రశ్నించారు. నేను ఢిల్లీలో స్వేచ్ఛగా తిరుగుతున్నాను. ఎక్కడి రావాలో చెప్పండి. నేనేమైనా మీకు కనిపించకుండా పోయానా? అని ప్రశ్నించారు. తన ఇంట్లో 14 గంటల పాటు సోదాలు జరిపిన సీబీఐ అధికారులు తన కంప్యూటర్, మొబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తాను, తన కుటుంబ సభ్యులు సీబీఐ అధికారుల విచారణకు సహకరించామని అన్నారు. సీబీఐని కేంద్ర ప్రభుత్వం దుర్వినియోగం చేస్తోందని.. తాము ఏ అవినీతికీ పాల్పడలేదని అన్నారు. ఏ తప్పూ చేయలేదని.. తాము భయపడాల్సిన అవసరం లేదన్నారు.